Monday, December 2, 2024

మణిపూర్ మంటలు చర్చలతోనే చల్లారాలి!

- Advertisement -
- Advertisement -

స్వల్ప విరామం అనంతరం మణిపూర్ మళ్లీ మండుతోంది. హింసాత్మక సంఘటనలకు సంబంధించిన సరికొత్త వార్తలు రాష్ట్రం అంతటి నుంచి వస్తున్నాయి. వివాదం పరిష్కారంలో వైఫల్యం పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పట్ల నిరసనోద్యమానికి ఈ దఫా విద్యార్థులు సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం జాతుల మధ్య సాగుతున్న దౌర్జన్యకాండను కట్టడి చేయడానికి మోహరించిన అదనపు కేంద్ర బలగాలను ఉపసంహరించాలని విద్యార్థి సంఘాలు కోరాయి. ఏడాదిన్నర పైగా ఘర్షణలు కొనసాగుతున్నా ప్రశాంత పరిస్థితుల పునరుద్ధరణలో ఆ బలగాలు విఫలమయ్యాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉధృతమవుతున్న హింసాత్మక సంఘటనలు కారణంగా రాష్ట్రంలోని విద్యా సంస్థలను మూసివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం, రాష్ట్ర ‘ప్రాంతీయ, పరిపాలన సమగ్రత’ను పరిరక్షించాలన్న పిలుపు పట్ల వారు మణిపూర్ రాజ్‌భవన్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఇంఫాల్ లోయలో ముగ్గురు వ్యక్తులను బలిగొన్న ఇటీవలి డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. అయితే, ఆ దాడుల్లో డ్రోన్లను గానీ, రాకెట్లను గాని ఉపయోగించలేదని అసోం రైఫిల్స్ విశ్రాంత డిజి లెఫ్టినెంట్ జనరల్ పిసి నాయర్ ఇటీవల ఒక మీడియా ఇంటర్వూలో చెప్పారు. ఆయన మణిపూర్ పోలీసులను ‘మెయితీ పోలీసులు’ గా కూడా అభివర్ణించారు. జాతుల మధ్య ఘర్షణలో వారు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. మణిపూర్ పోలీస్ శాఖ దానిని ఖండించింది. డ్రోన్, హైటెక్ క్షిపణి దాడులు జరిగాయనేందుకు ఆధారాలు ఉన్నాయని పోలీస్ శాఖ తెలిపింది. డ్రోన్లను స్వాధీనం చేసుకున్నారు. మణిపూర్ పోలీసులపై వ్యాఖ్యలకు అసోం రైఫిల్స్ విశ్రాంత డిజిని మణిపూర్ పోలీస్ శాఖ తీవ్రంగా విమర్శించింది.

మెయితీ, కుకీ జో సమాజాల మధ్య జాతుల పరమైన చీలిక రాష్ట్రం జాతుల మధ్య తీవ్ర వైరుధ్యాలను సృష్టించింది. ఎవరైనా కుకీ అయినట్లయితే సదరు వ్యక్తి పోలీస్ అధికారి లేదా సైనికాధికారి లేదా రాజకీయ నాయకుడు అయినప్పటికీ బఫర్ జోన్ దాటి వెళ్లజాలడు. కుకీ జో తెగకు చెందిన మాజీ సైనికుడు లింఖొలాయ్ మాతె గత సెప్టెంబర్ 9 రాత్రి యాదృచ్ఛికంగా మెయితీ మెజారిటీ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు అతనిని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో కొట్టి చంపారు. సంఘర్షణల సమయంలో మణిపూర్ పోలీస్, కేంద్ర బలగాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణంగా మారాయి.

ఆ సమాజాల మధ్య అపనమ్మకం ఎంత గాఢంగా ఉంది అంటే భద్రత దళాలు, శాంతి భద్రతల పరిరక్షక సంస్థలు జాతుల పరంగా చీలిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. అటువంటి దౌర్జన్యకరం పరిస్థితిలో సంఘటిత కృషితో ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడి తీరవలసిన అవసరం భద్రత దళాలపై ఉన్నప్పుడు వారు పరస్పరం నిందించుకుంటున్నారు. పోలీసులు, భద్రత బలగాల మధ్య సమన్వయం లేమిని దుండగులు, సంఘ వ్యతిరేక శక్తులు అవకాశంగా తీసుకుంటున్నారు. జర్నలిస్టులు, మేధోవర్గాలు కూడా జాతులపరంగానే కాకుండా, సంఘర్షణపై తమ దృక్పథంలో కూడా మణిపూర్ వివాదంపై చీలిపోయారు. దానిపై విస్తృతంగా ప్రచారం సాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) వంటి దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వంతో కాల్పుల విరమణ, ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంపై సంతకం చేసిన ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం వంటి తీవ్రవాద సంస్థలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటుండడం కూడా వేధిస్తోంది. రాష్ట్రంలో జాతుల మధ్య హింసాకాండను రేకెత్తించి, రాష్ట్రాన్ని అస్థిరపరచేందుకు మణిపూర్‌లోకి రెండు నిషిద్ధ మెయితీ సంస్థల చొరబాటుకు ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎంలోని ‘చైనా మయన్మార్ మాడ్యూల్’ సాయం చేసిందని ఆరోపిస్తూ ఎన్‌ఐఎ ఒక చార్జిషీట్ దాఖలు చేసిందని ‘ది హిందూ’ ఈ ఏడాది మేలో ఒక వార్త రాసింది.

మరొక వైపు, మయన్మార్‌లోని మెయితీ విప్లవ వర్గాలపై పోరు సాగించేందుకు కుకీ తీవ్రవాద వర్గాలకు భారతీయ భద్రత బలగాలు సాయం చేస్తున్నాయని ఎన్‌ఎస్‌సిఎన్‌ఐఎం మే 15న ఆరోపించింది. కుకీ తీవ్రవాద వర్గాలకు లాజిస్టిక్ మద్దతు ఇస్తూ నాగాలకు వ్యతిరేకంగా రక్తపాతంతో కూడిన ఘర్షణలో పాల్గొనేందుకు అనుబంధ బలగాలుగా కుకీలను భారతీయ భద్రత దళాలు వినియోగించుకుంటున్నాయని కూడా ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎం ఆరోపించింది. మణిపూర్‌లో హింసాకాండను అణచివేచి, శాంతి స్థాపన కృషిలో బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పటికీ ఆ ప్రభుత్వంపై మోడీ ప్రభుత్వం సంపూర్ణ విశ్వాసం ప్రదర్శిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోని భారతీయ భద్రత దళాలు కుకీ తీవ్రవాదులకు ఎందుకు సాయం చేస్తున్నాయి? మణిపూర్ హింసాకాండ వెనుక అనేక స్వప్రయోజక శక్తుల లోపాయికారీ పాత్ర ఉందని ఇది సూచిస్తోంది.

ఈ వివాదంలో సంబంధిత సంస్థల పాత్రను స్పష్టంగా అర్థం చేసుకోవడానికి వాటిని వేరు చేసి చూడవలసి ఉంటుంది. వివిధ భౌగోళిక ప్రాంతాల మధ్య జనాభా విభజన, ఆధిపత్య భావంతో అధికారం కేంద్రీకరణ, ప్రాంతీయ పరిపాలన సమగ్రత అనే దానికి ముప్పు భావన, జాతుల గ్రూపుల్లో వివిధ మతపరమైన గుర్తింపుపై వ్యవస్థాగత లోపం ఆధారపడి ఉంది. మణిపూర్ జనాభాలో 51 శాతం మేర ఉన్న ప్రధానమైన హిందు వర్గం మెయితీలు రాష్ట్రంలో పది శాతం భూమిని మాత్రమే కలిగి ఉన్నారు. మరొక వైపు జనాభాలో 40 శాతం ఉన్న, చాలా వరకు క్రైస్తవులైన కుకీలు, నాగాలు 90 శాతం భూమిని ఆక్రమించుకుని ఉన్నారు. తమ సంఖ్య అధికంగా ఉన్న కారణంగా మెయితీలు శాసనసభలో భారీ ప్రాతినిధ్య వాటా కలిగి ఉన్నారు. అది మెయితీ ఆధిక్యవాదాన్ని ప్రోత్సహిస్తోంది. మెయితీ ముఖ్యమంత్రులు 1990 నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అది కుకీలు, నాగాల్లో నిరసన పెరుగుదలకు దారి తీస్తోంది. రాజకీయ వ్యవస్థలో తమను చిన్నచూపు చూస్తున్నారని, తమకు తక్కువ ప్రాతినిధ్యం ఉంటున్నదని వారు భావిస్తున్నారు.

మణిపూర్ బడ్జెట్, అభివృద్ధి కార్యక్రమాల్లో అత్యధిక భాగం మెయితీ ఆధిక్యంలోని ఇంఫాల్ లోయ లక్షంగా ఉంటున్నదని కూడా రాష్ట్రంలోని మైనారిటీలు పేర్కొంటున్నారు. మణిపూర్‌లో ఏళ్ల తరబడి సంఘర్షణలకు లక్షంగా నాగాలు ఉంటున్నారు. కుకీ జో సమాజం ఆ తరువాత ఆ సంఘర్షణ బరిలోకి ప్రవేశించింది. ఎన్‌ఎస్‌సిఎన్ ఐఎంతో భూభాగం పరిమితి లేకుండా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో మణిపూర్‌లో ప్రాంతీయ, పరిపాలన పరిధికి డిమాండ్ తలెత్తింది. 2001లో ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం)తో కాల్పుల విరమణ పొడిగింపు ఒప్పందంలో ఇతర అంశాలతో పాటు సరికొత్త క్లాజ్ : ‘ఏ విధమైన భూభాగ పరిమితులు లేకుండా’ అనేది చేర్చారు. ఇప్పుడు ఆ కాల్పుల విరమణ ఒప్పందం మణిపూర్ సహా నాగా నివాసిత ప్రాంతాలు అన్నిటికీ వర్తిస్తుంది.

అప్పటి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం ఎన్‌ఎస్‌సిఎన్ (ఐఎం) తో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం మణిపూర్‌ను, ముఖ్యంగా ఇంఫాల్ లోయను అగ్నికాష్టంలా మార్చింది.నిరసనలు మణిపూర్ వ్యాప్తంగా ప్రజ్వరిల్లాయి. జూన్ 18న అల్లరిమూకలు రాష్ట్ర శాసనసభ, ముఖ్యమంత్రి కార్యాలయం, అనేక రాజకీయ పార్టీల భవనాలు, ఎంఎల్‌ఎల అధికార నివాసాలు, ఇతర రాష్ట్ర సంస్థల భవనాలను దగ్ధం చేశాయి. అల్లరి మూకలను నియంత్రించేందుకు భద్రత దళాలు కాల్పులు జరపగా 18 మంది వ్యక్తులు మరణించారు. ఒప్పందంలో ప్రతిపాదించిన నాగాలిమ్ మ్యాప్ అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మయన్మార్‌లోని ప్రాంతాలతో పాటు ఇప్పటి మణిపూర్ రాష్ట్రంలోని మూడింట రెండు వంతుల భాగానికి వర్తిస్తుంది. ప్రతిపక్షాల విమర్శలు, దేశంలో నుంచి, బయటి నుంచి ఒత్తిడి నేపథ్యంలో మణిపూర్‌లో ఘర్షణ జ్వాలలను ఆర్పివేయడంలో ప్రభుత్వ వైఫల్యానికి కారణం బిజెపి ప్రభుత్వ హిందుత్వ దృక్పథం, కఠిన వైఖరి కావచ్చు. కేంద్రం, జాతులపరంగా అధిక సంఖ్యాకుల మద్దతుతో ఆధిపత్య విధానాన్ని బీరేన్ సింగ్ ప్రభుత్వం అనుసరించడం అధికార పార్టీ అగ్నికి ఆజ్యంపోసేందుకు ప్రోత్సహించింది. అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలను బంగ్లాదేశీ ముస్లింలుగా, అసోంలోని సదరు స్వదేశీ ప్రజల ఉనికికి ముస్లింలు అందరినీ బిజెపి ప్రభుత్వం ముప్పుగా ముద్ర వేయడాన్ని మణిపూర్‌లోని కుకీ జో సమాజానికీ వర్తింపజేశారు.అసోంలో ముస్లింలు, మణిపూర్‌లో కుకీల జనాభా అధిక వృద్ధికి సరిహద్దుకు ఆవలి నుంచి జనం వలస పెరుగుదల కారణంగా పేర్కొన్నారు. అయితే, ఒక నిర్దిష్ట జాతి గ్రూప్ వెనుకబడినతనం, తక్కువస్థాయి విద్య వల్ల జనాభా వృద్ధి చెందిందని నిపుణులు చెబుతున్నారు. అక్రమ వలసను కారణంగా తోసిరాజనలేం, కానీ ఆ రెండు సందర్భాల్లో అంత అధిక జనాభా వృద్ధికి ఆ అంశానికి కారణం కాదు.

కుకీ మెయితీ వివాదం పరిహరణకు బహుముఖ దృక్పథం, సంబంధిత వ్యక్తులు అందరి సమష్టి కృషి అవసరం. ఈశాన్య ప్రాంతంలో జాతుల సామాజిక సంఘర్షణను అర్థం చేసుకోవడానికి దాని చరిత్రను, విశ్లేషణాత్మక భావనను కూలంకషంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి ఇటీవల చెప్పినట్లుగా ఆ ఘర్షణలను కేవలం శాంతి భద్రతల పరిస్థితిగా కేంద్రం పరిగణించింది. జాతివర్గాలు, ఉపవర్గాల మధ్య అస్తిత్వాలు, హక్కుల స్పష్టీకరణలో వైరుధ్యాలు ఉన్నాయి. నాగాలు, కుకీల మధ్య, కుకీలు, మెయితీల మధ్య, తుదకు మెయితీ, కుకీజో గ్రూప్ మధ్య అనేక జాతుల పరమైన ఘర్షణలకు తక్షణ కారణాలుగా కనిపిస్తున్నాయి. మెయితీ పంగల్ మైతై (ముస్లిం మెయితీ) ఘర్షణ అందుకు ఒక ఉదాహరణ. మణిపూర్‌ల 1993లో మెయితీ పంగల్ ఘర్షణ వల్ల సుమారు 100 మంది మరణించగా, అనేక మంది నిర్వాసితులయ్యారు. తౌబాల్ జిల్లాలోని లైలాంగ్ ప్రాంతం లో మెయితీ వర్గాలు ముస్లిం నివాసాలు, వ్యాపార సంస్థలపై దాడులకు ఆ ఘర్షణ దారి తీసింది.

అటువంటి మరొక తెగల మధ్య ఘర్షణ 1997 98లోని కుకీపైతే లేదా కుకీ జోమి ఘర్షణ. దానిలో 352 మందికి పైగా మరణించగా 13వేల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఉమ్మడి భౌగోళిక ప్రాంతంలో కలసి నివసిస్తున్న జాతుల, గ్రూపుల మధ్య సాంఘిక, రాజకీయ అధికారం పంపకంలో తీవ్ర అసమతుల్యతను మనం అర్థం చేసుకోకుంటే, నార్కో టెర్రరిజంపైన, సంఘర్షణలకు వెలుపలి అత్యధునాత అసాల్ట్ రైఫిల్స్‌పైన దృష్టి కేంద్రీకరిస్తుంటే, సంఘర్షణలను పరిష్కరించి మణిపూర్‌లో ప్రశాంతతను తీసుకురావడం అసాధ్యం.

అన్ని జాతుల గ్రూపులు, వాటి రాజకీయ సంస్థల ప్రమేయంతో సాంఘిక చర్చను ప్రభుత్వం ప్రోత్సహించవలసి ఉంటుంది. కఠిన వైఖరి లేకుండా సంప్రదింపులతో ఒప్పందం సాధించడం జీవన ప్రదేశంలో ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తుంది. సంఘర్షణకు దిగుతున్న వర్గాలు అన్ని సమాజాల శాంతియుత సహజీవనానికి ఏకైక మార్గం అహింసాయుత సంఘర్షణ అని గ్రహించాలి. మనం ఎక్కడికి వెళుతున్నామో ఎంచుకునే విజ్ఞత మనకు ఉండాలి. మీరు ఎక్కడికి వెళుతున్నదీ మీకు తెలియకపోతే ఏ రోడ్డు అయినా మిమ్మల్ని అక్కడికే చేరుస్తుందని ఇంగ్లీష్ రచయిత, కవి లూయిస్ కరోల్ అంటారు. మణిపూర్‌లో పునరావృతం అవుతున్న హింసాకాండ అటువంటి రోడ్డు మీదుగా సాగుతోంది.

గీతార్థ పాఠక్

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక,
రాజకీయ అంశాల విశ్లేషకుడు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News