దక్షిణ ఫ్రాన్స్‌లోని ఆడ్ డిపార్ట్‌మెంట్ ప్రాంతంలో మంగళవారం భారీ కార్చిచ్చు సంభవించింది. ఇప్పటివరకు 12,000 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు కాలిపోయాయని అధికారులు తెలిపారు. సమీపం లోని 25 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయని తెలిపారు. మంటలను అదుపు చేయడానికి 1800 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఓ గ్రామాన్ని మొత్తం ఖాళీ చేయించారు. చుట్టుపక్కల రహదారులను మూసివేయడంతో రాకపోకలకు ఇబ్బంది తలెత్తింది.
అమెరికా లోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఈనెల 1న అంటుకున్న భారీ కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. గిఫోర్డ్‌గా పేర్కొన్న ఈ కార్చిచ్చు ప్రస్తుతం 65 వేల ఎకరాలకు పైగా విస్తరించింది. లాస్ ఏంజెలెస్, వెంచురా, కార్న్ వంటి దక్షిణ కాలిఫోర్నియా కౌంటీల్లోని నివాసితులతోపాటు పొరుగున ఉన్న లాస్‌వేగాస్‌ల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రమాదం ఎక్కువగా ఉండే శాంటా మారియా వంటి ప్రాంతాల్లోని వారిని తరలిస్తున్నారు. సోమవారం నాటికి 3 శాతం మాత్రమే మంటలను అదుపు లోకి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు.