Sunday, April 28, 2024

జనం నుంచి వనానికి

- Advertisement -
- Advertisement -

Medaram Jatara

 

నాలుగు రోజుల పాటు అశేష జనాన్ని ఉర్రూతలూగించి ఆశీర్వదించి వన ప్రవేశం చేసిన దేవతలు
సమ్మక్క, సారలమ్మలకు వీడ్కోలు పలికిన మంత్రులు
ఆదివాసీ సంప్రదాయ పూజలతో తల్లులకు వీడ్కోలు
ముగిసిన మేడారం జనజాతర

వరంగల్ : మేడారం మహాజాతరలో భక్తకోటి జనానికి నాలుగురోజులు దర్శనమిచ్చిన సమ్మక్కసారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం రాత్రి ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో వనప్రవేశం చేశారు. తల్లుల వనప్రవేశానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేపట్టింది. వనం నుంచి జాతరకు తీసుకొచ్చిన విధంగానే తల్లుల వనప్రవేశానికి కూడా అదే స్థాయిలో భారీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావుల ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్ కలెక్టర్ కర్ణన్ నేతృత్వంలో అధికారిక లాంఛనాలతో తల్లుల వనప్రవేశానికి ఏర్పాట్లను చేశారు. గద్దెల వద్ద ఆదివాసీ పూజారులు పూజల కోసం భక్తుల వేసిన కానుకలు బంగారం, కొబ్బరిని తీసి శుద్ధి చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రధాన పూజారులు గద్దెలకు చేరుకున్నారు. తల్లులను వనప్రవేశానికి తీసుకెళ్లేందుకు చేయాల్సిన పూజలను రహస్యంగా చేయడానికి పూజారులపై వస్త్రాన్ని కప్పుకొని అమ్మల తరలింపునకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ముగించారు.

ఆదివాసీ డోలు చప్పుళ్లు, కొమ్ము గొర్ర వాయిద్యాలతో తల్లులను వనప్రవేశానికి తీసుకెళ్లడానికి ఆహ్వానిస్తూ ఆదివాసీ గుత్తాది నృత్యాలతో సమ్మక్కసారలమ్మల నామస్మరణతో తల్లుల తరలింపును ప్రారంభించారు. గుడి ప్రాంగణంలో నాలుగు గద్దెలను ఆసీనులైన దేవదేవతలను నాలుగు ఊర్ల ఆదివాసీ పూజారులు వనప్రవేశానికి తరలించారు. ముందుగా చిలకలగట్టుకు సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మను పూనుగొండ్లకు పగిడిద్దరాజును, కొండాయికి గోవిందరాజును పూజారులు వేర్వేరుగా తరలించారు. చిలకలగట్టు, కన్నెపల్లికి తల్లులను తీసుకెళ్లే వరకు పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు చర్యలను చేపట్టింది. తల్లుల వనప్రవేశానికి మంత్రులు దగ్గరుండి వీడ్కోలు పలికారు. చిలకలగట్టుకు చేరుకున్న సమ్మక్కను గుడిలో ప్రత్యేక పూజలు చేసిన పూజారులు ప్రధాన పూజారితో సమ్మక్క పసుపు కుంకుమ భరిణి, ముక్కు, చెవి కమ్మలను తీసుకొని చిలకలగట్టుపైకి వెళ్లారు.

చిలకలగట్టులో సమ్మక్క స్థావరంలో ప్రధాన పూజారి ఒక్కడే పూజలు నిర్వహించి సమ్మక్కను యధాస్థానానికి చేర్చారు. అదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి సారలమ్మను యధాస్థానంలో ప్రతిష్ఠించారు. సమ్మక్కసారలమ్మల వనప్రవేశం కోసం శనివారం ఉదయం నుంచే చిలకలగట్టు, కన్నెపల్లిలో ప్రత్యేక పూజలు చేశారు. వారిని వనానికి ఆహ్వానించడానికి మేడారం నుంచి చిలకలగట్టు, కన్నెపల్లి వరకు ప్రధాన రహదారిని అలంకరించి ముగ్గులు వేశారు. దారి పొడవునా ఆదివాసీ పూజారులతో పాటు భక్తులు భారీ ఎత్తున జయజయధ్వానాలతో స్వాగతం పలికి వనప్రవేశాన్ని చేయించారు. ఈ కార్యక్రమంతో మహాజాతరకు ముగింపు పలికినట్లు అయింది. మిగిలిన పగిడిద్దరాజు, గోవిందరాజులను వారి యధాస్థానాలకు చేర్చేందుకు ప్రధాన పూజారులు మేడారం జాతర ప్రాంగణంలోని గద్దెల నుంచి తరలించారు.

పగిడిద్దరాజు మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని పూనుగొండ్లకు తీసుకొని పూజారులు పయనమయ్యారు. కాలినడకన పగిడిద్దరాజుతో బయలు దేరిన పూజారులు పస్రా నుంచి గుండాల మీదుగా పూనుగొండ్లకు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు కాలినడకన పగిడిద్దరాజును తీసుకొని వెళ్తున్న పూజారులకు పోలీస్ శాఖ తగిన బందోబస్తును ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామానికి చెందిన సారలమ్మ గోవిందరాజును అక్కడి ఆదివాసీ పూజారులు తీసుకొని బయలుదేరారు. ఈరోజు రాత్రికి కొండాయి గ్రామానికి చేరుకోనున్న పూజారులు గోవిందరాజును దేవాలయానికి చేర్చి ప్రత్యేక పూజలతో ప్రతిష్ఠించనున్నారు.

మహాజాతరకు ముగింపు పలికిన ప్రభుత్వ ప్రతినిధులు..
మేడారం సమ్మక్కసారలమ్మ మహాజాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు తల్లులను ఆహ్వానించి శనివారం రాత్రి వనప్రవేశం చేసే వరకు ప్రోటోకాల్ పద్ధతిలో అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చేపట్టింది. నలుగురు మంత్రులు మహాజాతర నిర్వహణలో వారంరోజుల పాటు విశేషమైన కృషిని చేశారు. శనివారం రాత్రి వనదేవతలను వనప్రవేశం చేసి చివరి అంకానికి వీడ్కోలు పలికారు. వచ్చే జాతరకు మరిన్ని సౌకర్యాలతో భారీ ఏర్పాట్ల నడుమ తల్లులను ఆహ్వానిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. వనదేవతలు వనప్రవేశం చేసిన తరువాత జాతర నిర్వహణకు సహకరించిన ఆదివాసీ పూజారులకు మేడారం పాలకవర్గానికి, ప్రజాప్రతినిధులకు, అధికార యంత్రాంగానికి మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Medaram Jatara closing
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News