Saturday, May 11, 2024

ఖరీదైపోతున్న వైద్యం

- Advertisement -
- Advertisement -

సుబ్బారావు (పేరు మార్చాను) అరవై అయిదు సంవత్సరాల వృద్ధులు. ఆయనకు పెన్షన్ కూడా రాదు. మధ్యతరగతి కుటుంబీకుడు. బిపి, షుగర్ వ్యాధులు తప్ప మిగిలిన ఆరోగ్య సమస్యలు ఏమీలేని సుబ్బారావుకు ఒక రోజు అకస్మాత్తుగా కళ్ళు తిరిగినట్లనిపించింది. భార్యను వెంట బెట్టుకుని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి డాక్టర్ ఆయన్ను నాలుగైదు రకాల ప్రశ్నలు వేశాడు. ఒక దానికి ‘అవునండి’ అన్నాడు. డాక్టర్ కొన్ని పరీక్షలు రాసి అక్కడున్న లాబ్‌లో చేయించుకుని రమ్మన్నాడు. ఆయన లాబ్‌కు వెళ్లగా ఆ పరీక్షల ఖరీదు పదిహేను వేల రూపాయలయింది. డాక్టర్ అరనిమిషంలో రిపోర్టులు చూసి ‘వృద్ధాప్యం, అలసట వల్ల అలా అనిపించింది. పరీక్షలు చెయ్యడమే నయమైంది లేకపోతే అది గుండె జబ్బేమో అనిపించింది నాకు. అదృష్టవంతులు. ఈ మందులు వేసుకోండి’ అని వెయ్యి రూపాయల ఖరీదైన మందులు రాసి మళ్ళీ పదిహేను రోజుల తరువాత రమ్మని చెప్పారు.

సుబ్బారావు తమ ఇంటికి దగ్గరలో గల పది మందుల షాపులకు వెళ్ళాడు మందులు కొనడానికి. ఎందుకంటే ఆయనకు బయట షాపుల్లో పదిహేను శాతం డిస్కౌంట్ వస్తుంది. ఏ షాపులోనూ ఆ డాక్టర్ రాసిన మందులు దొరకలేదు. చివరకు ఒక షాపు అతను ‘సార్.. ఈ మందులు ప్రపంచంలో ఎక్కడా దొరకవు. వెళ్లి ఆ ఆసుపత్రి ఫార్మసీలో అడిగి చూడండి’ అని సలహా ఇచ్చాడు. సుబ్బారావుకు బిపి పెరిగిపోయింది ఆ మాటలకు. అయినా చేసేదేమీ లేదు గనుక మళ్ళీ ఆటో ఎక్కి ఆ కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడి ఫార్మసీలో అన్ని మందులూ దొరికాయి. ‘మా దగ్గర డిస్కౌంట్ ఉండదు. తీసుకుంటే తీసుకోండి లేకపోతె లేదు’ ఖండితంగా చెప్పారు ఉద్యోగులు. చచ్చినట్లు మందులు కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు.

నేను పైన ప్రస్తావించింది ఊహాజనిత కథ కాదు. చాలా మందికి ఎదురైన అనుభవం. ఇది ఆసుపత్రులకు వెళ్లే అనేక మంది అనుభవం. నలభై ఏళ్ళ క్రితం వరకూ అలోపతి వైద్యులు, హోమియో వైద్యులు, ఆయుర్వేద వైద్యులు ఎవరి దగ్గరకు వెళ్లినా ముందు మన చేతిని తీసుకుని నాడిని ఒక నిమిషం పాటు పరీక్షించేవారు. నాడి ప్రకంపనలు బట్టి బిపి ఎంతుందో, మన వ్యాధి లక్షణాలు ఏమిటో చెప్పేవారు. తగిన మందులు ఇచ్చేవారు. మరి నేడు ఎంత పెద్ద డాక్టర్ అయినా నాడి పట్టుకుని చూడటం అనేది చూడగలుగుతున్నామా? రోగి వెళ్ళగానే వెంటనే నాలుగైదు రకాల పరీక్షలు రాయడం, వాటిని ఫలానా సెంటర్లో చూపించుకుని రమ్మని సూచించడం, అవన్నీ చేయించుకుని వచ్చాక వ్యాధి నిర్ధారణ చెయ్యడం, రోగి ఆర్ధిక పరిస్థితిని తెలుసుకుని ఖరీదైన మందులు రాయడం, మళ్ళీ వారం రోజుల తర్వాత రమ్మని చెప్పడం. ఏ ఆసుపత్రికి వెళ్లినా ఇదే పరిస్థితి.

మొదటి విజిట్‌లోనే మందులు ఇచ్చి ‘వీటితో కచ్చితంగా తగ్గుతుంది. మళ్ళీ రావలసిన అవసరం లేదు’ అని చెప్పే వైద్యులను ఎక్కడైనా చూస్తున్నామా? ఒక ఉదాహరణ చెబుతాను. సుమారు పాతికేళ్ల క్రితం వరకు మధుమేహ వ్యాధిగ్రస్థులకు నూటికి తొంభై శాతం మందికి DIANIL అనే టాబ్లెట్స్‌ను ఇచ్చేవారు వైద్యులు. అవి పది మాత్రలు అయిదు రూపాయలో, పది రూపాయలో ఉండేవి. నెలకు యాభై రూపాయలతో షుగర్ నియంత్రణలో ఉండేది. మరి నేడు? షుగర్ జబ్బు రోగికి నెలకు అయిదారు వేల రూపాయల మందులను వాడాల్సి వస్తున్నది. ప్రతి డాక్టరూ అయిదారు రకాల మందులను రాస్తారు. అన్నీ కొనుక్కోవల్సిందే.

1975 వరకు ఆసుపత్రుల్లో కార్పొరేట్ అనే మాట వినపడలేదు. నాకు గుర్తున్నంత వరకు 1980 ల నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల కల్చర్ అప్పటి వరకు చిన్న చిన్న ఆసుపత్రులను నిర్వహిస్తూ వైద్యసేవలు అందించేవారు వైద్యులు. వారి ఫీజులు కూడా చాలా తక్కువ. వారి దగ్గర జబ్బు తగ్గకపోతే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళమని చెప్పేవారు. 1990 వచ్చే సరికి వందల కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాలుగైదు ఎకరాల స్థలంలో రాజభవనాలను తలదన్నే రీతిలో ఏడెనిమిది అంతస్తుల భవనాలు, అయిదారు వందల పడకలు, వీటిలో ఎసి, నాన్ ఎసి, షేరింగ్ రూమ్స్, జనరల్ వార్డ్.. ఇలా రకరకాల వసతులు అందించడం మొదలు పెట్టారు.

ఒక త్రీ స్టార్ హోటల్లో డబుల్ రూమ్ రెండు నుంచి మూడు వేలకు దొరుకుతుంది. కానీ, ఈ కార్పొరేట్ ఆసుపత్రులలో షేరింగ్ రూమ్స్‌లో ఒక మంచం అద్దె రోజుకు మూడు వేల రూపాయలు ఉంటుందంటే ఇంత ఖరీదైన వైద్యం సామాన్యులు భరించగలరా? ఇక ఏదైనా సర్జరీ అవసరం అయితే మూడు నుంచి పది లక్షల రూపాయలు అవుతుంది. మూత్రపిండాలు, కేన్సర్ లాంటి వ్యాధుల సర్జరీ అయితే నలభై యాభై లక్షల రూపాయల బిల్లు అవుతుంది. ఒక ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు కష్టపడి కూడబెట్టిన సొమ్ము రిటైర్ అయిన తరువాత ఏ సర్జరీయో చేయించుకోవాల్సిన అగత్యం ఏర్పడితే పది రోజుల్లో కరిగిపోతుంది. ఎంత దారుణంగా ఉన్నదీ పరిస్థితి!!

మరొక విషయం చెప్పుకోదగినది ఏమిటంటే… నాలుగు దశాబ్దాల క్రితం చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లోనూ కూడా ఎక్కువగా జనరల్ ఫిజిషియన్స్ ఉండేవారు. శరీరంలో ఏ భాగానికి సమస్య వచ్చినా వీరు చికిత్స చేసేవారు. కానీ, కార్పొరేట్ కల్చర్ పెరిగాక స్పెషలిస్టులు పెరిగారు. తలలో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, మెదడు, పళ్ళు, ప్రధాన అంగాలు. ఈ ప్రతి అంగానికి ఒక్కొక్క స్పెషలిస్ట్. ఇక శరీరంలోని సుమారు పాతిక ముప్ఫయి భాగాలకు వేరువేరుగా స్పెషలిస్టులు ఉంటారు. వీటిలో ప్యాకేజీలు కూడా ఉంటాయి. ఒక మహిళ గర్భవతి అయితే, మా చిన్నతనంలో ప్రసవానికి గంట ముందుగా ఆసుపత్రికి తీసుకెళ్లేవారు. కొన్నిసార్లు గ్రామంలోని మంత్రసానులే ఆ పని చేసేవారు. ఒకవేళ ఆసుపత్రికి తీసుకెళ్లినా సిజేరియన్ అనే మాట అసలు వినిపించేది కాదు. వంద రూపాయల ఖర్చుతో బిడ్డను తీసుకుని తల్లి ఇంటికి చేరేది.

కానీ, నేడు గర్భవతి అయిందా లేదా తెలుసుకోవడానికి ఆసుపత్రికి వెళ్తారు. గర్భవతి అని తేలితే ఇక నెలకు, పదిహేను రోజులకు, చివర్లో వారం రోజులకొకసారి ఆసుపత్రికి వెళ్ళాలి. సహజ ప్రసవాలు కలికం వేసి గాలించినా కనిపించడం లేదు. తలిదండ్రులు కూడా తమ కూతురు కష్టపడటం చూడలేక సిజేరియన్ చేయమంటున్నారు. ఈ మొత్తానికి ప్యాకేజీ ఉంటుంది. లక్ష నుంచి అయిదు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి కొన్ని ఆసుపత్రులు. అలాగే కంటి శుక్లాల ఆపరేషన్ కు ఒకప్పుడు అయిదారు వందలు మాత్రమే ఖర్చయ్యేది. నేడు అవి కూడా ప్యాకేజీల రూపం సంతరించుకున్నాయి. ముప్ఫయి వేల నుంచి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నాయి కంటి ఆసుపత్రులు.

చెప్పుకోవాలంటే నేటి కార్పొరేట్ ఆసుపత్రుల తీరు రోగుల శరీరాన్ని మాత్రమేకాక ఆస్తిపాస్తులను కూడా హరించి వేస్తున్నది. పేదవారికి ఏదైనా జబ్బుచేస్తే ఆసుపత్రులకు వెళ్లలేక చావే శరణం అనుకుంటున్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు సాధారణంగా రాజకీయ నాయకులకు స్నేహితులు, బంధువులు లేదా బాగా విరాళాలు ఇచ్చేవారికి చెంది ఉంటున్నాయి. అందుకనే ప్రభుత్వాలు కూడా వీరి ఆగడాలను పట్టించుకోవు. వీరి అభివృద్ధి కోసం ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చెయ్యడానికి నిధులు కేటాయించడం లేదు. వైద్యులను నియమించరు. వైద్యులు తమ విధులను నిర్లక్ష్యం చేసి సొంత ప్రాక్టీస్ చేసుకుంటుంటే చర్యలు తీసుకోరు.

ఎంతమంది మంత్రులు, ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటున్నారు? టోటల్‌గా చూస్తే ప్రయివేట్ వైద్యం నేడు పేదల పాలిట పెనుశాపంగా మారింది. తమ వద్దకు వచ్చే రోగులకు వారు పని చేసే కంపెనీలు ఇచ్చే ఇన్సూరెన్స్, తెల్లకార్డు ద్వారా ప్రభుత్వాలు కల్పించే ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఉంటె ఆ మొత్తం లాగేయడంలో కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధహస్తులు. చాలా ఆసుపత్రులలో మానవత్వం అనేది మచ్చుకు కూడా కనిపించదు. ఆసుపత్రులలో ఇన్ పేషేంట్లుగా అడ్మిట్ అయ్యేవారి నుంచి ఇంత మొత్తం వసూలు చెయ్యాలని డాక్టర్లకు టార్గెట్లు ఉంటాయి. పేషేంట్ తరపు వారు డబ్బు చెల్లించడంలో ఒక్క గంట ఆలస్యమయినా పేషేంట్‌కు చికిత్సను నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తారు.

తోకటపా ఒక మిత్రుడి అనుభవం. ఈ మధ్య హఠాత్తుగా చెమటలు పట్టాయి. వెంటనే ఒక పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. కొన్ని పరీక్షలు చేశాక అడ్మిట్ అవ్వాలన్నారు. రెండు గంటల తరువాత డాక్టర్ వచ్చాడు. ‘సమయానికి వచ్చారు. గంట ఆలస్యం అయినా ప్రమాదం జరిగేది. నాలుగు వాల్వులు బ్లాక్ అయ్యాయి. స్టెంట్స్ వెయ్యాలి. సాయంత్రంలోగా రెండు లక్షలు అడ్వాన్స్ డిపాజిట్ చెయ్యండి. రేపు ఎర్లీ మార్నింగ్ స్టెంట్స్ వేస్తాం’ అని చెప్పి వెళ్ళిపోయాడు.

వాళ్ళు కంగారుపడి సాయంత్రంలోగా లక్షన్నర మాత్రం సేకరించగలిగారు. మరునాడు డాక్టర్ వచ్చి డబ్బులు పూర్తిగా చెల్లించలేదని ఆగ్రహించి స్టెంట్స్ వెయ్యకుండానే వెళ్ళిపోయాడు. నర్సులు వచ్చి ఏవో టాబ్లెట్స్ ఇచ్చిపోతున్నారు. కుటుంబమంతా టెన్షన్తో వణికిపోయింది. గంట ఆలస్యం అయినా ప్రమాదం అన్న డాక్టర్ మాటలు చెవుల్లో రింగుమంటున్నాయి. మూడో రోజు సాయంత్రానికి కానీ ఆ మిగిలిన యాభై వేలు సర్దలేకపోయారు. నాలుగో రోజు ఉదయం ఆయనకు స్టెంట్స్ పడ్డాయి. గంట ఆలస్యమైతే గుంటలోకి వెళ్లడం ఖాయం అనుకున్న వ్యక్తి నిక్షేపంలా ఇంటికెళ్లిపోయాడు.

మురళీమోహన్ రావు
8143318849

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News