లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో దారుణం చోటుచేసుకుంది. కడుపుతో ఉన్న భార్యను హత్య చేసిన ఆరోపణలతో ఓ మర్చంట్ నేవీ అధికారిని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 5న గోమతినగర్ ఎక్స్‌టెన్షన్‌లోని అపార్ట్‌మెంట్‌లో 31 ఏళ్ల నేవీ అధికారి అనురాగ్ సింగ్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో సింగ్ పై అతని మామ లక్నో పోలీసులు ఫిర్యాదు చేశాడు. తన కూతురు మధును భర్త అనురాగ్ సింగ్ చిత్రహింసలు పెట్టి హత్య చేశాడని ఆమె తండ్రి ఫతే బహదూర్ సింగ్ ఆరోపించారు. పెళ్లైన ఆరు నెలలకే వరకట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసించాడని.. అంతేకాదు, ఆమె తన గర్భాన్ని తొలగించాలని అనురాగ్ వేధించాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో అనురాగ్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
ఈ సంఘటనపై సౌత్ లక్నో (DCP) నిపున్ అగర్వాల్ మాట్లాడుతూ..”ఆగస్టు 5న ఫతే బహదూర్ సింగ్ తన కుమార్తె హత్య గురించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. అపార్టుమెంట్ లోని తన గదిలో ఉరివేసుకుని వేలాడుతున్న మధు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంతరం పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోద చేసి బాధితురాలి భర్తను అరెస్టు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది” అని తెలిపారు.