Tuesday, April 30, 2024

జానా! ఇదిగో నీ ఇంట్లో భగీరథ

- Advertisement -
- Advertisement -

Jana Reddy Vs Errabelli Dayakar Over Mission Bhagiratha

నల్లగొండ జిల్లాకు మూడేళ్ల నుంచి భగీరథ నీళ్లు అందిస్తున్నాం
అనుముల గ్రామంలో 4 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి
బల్క్ నీటి సరఫరా జరుగుతోంది
అన్ని ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందుతుంది
సీనియర్ నాయకుడైన జానారెడ్డి ఇలా మాట్లాడటం తగదు
మంత్రి ఎర్రబెల్లి

మిషన్ భగీరథపై ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి,  జానారెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి ఎర్రబెల్లి,  సిఎం బర్త్‌డే సందర్భంగా గంటలో కోటి మొక్కలు నాటాలని పిలుపు

హైదరాబాద్ : మిషన్ భగీరథ పథకంపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వ్యాఖ్యలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం ఖండించారు. అనుముల గ్రామానికి మిషన్ భగీరథ నీరే రావడం లేదన్న జానారెడ్డి ఆరోపణలపై మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న జానారెడ్డి మిషన్ భగీరథ పథకంపై శుక్రవారం చేసిన వ్యాఖ్యలప్లై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పం దించారు. నల్గొండ జిల్లాకు మూడేళ్ల నుంచి మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రెండు రోజులుగా నేషనల్ హైవేపై గ్రిడ్ పైపులైన్‌కు బ్రేక్‌డౌన్ వచ్చిందని, ఆ రిపేర్లు జరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు.

ఆ పనులను కూడా శుక్రవారమే పునరుద్ధరించినట్టు తెలిపారు. అనుముల గ్రామంలో 4 ఓవర్‌హెడ్ ట్యాంకు లు, బల్క్‌నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఆ గ్రామంలోని అన్ని ఇళ్లకు మంచినీరు నల్లాల ద్వారా అందుతుందన్నారు. జానారెడ్డి సీనియర్ నాయకుడిగా ఉండి ఇలా మాట్లాడటం సరి కాదని, మీడియాకు ఎక్కడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన హితవు పలికారు. నల్గొండ జిల్లాలో గడిచిన మూడేళ్ల నుంచి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నామని, జానారెడ్డి ఇంటికి సైతం అందిస్తున్నామని, జానారెడ్డి సీనియర్ నాయకులుగా ఉండి అలా మాట్లాడటం తనకు బాధ కలిగించిందని వెల్లడించారు. మిషన్ భగీరథ విషయంలో కాంగ్రెస్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలి తప్ప ఇలా రాజకీయ ఆరోపణలు చేయడం తగదని ఎర్రబెల్లి దయాకర్ రావు హితవు పలికారు.

జానారెడ్డి ఇంటికి అధికారులు…

రాజకీయ లబ్ధి కోసమే జానారెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు. శనివారం ఆయన ఇంటికి అధికారులను పంపామన్నారు. దానికి సంబంధించిన వీడియోను జానారెడ్డికి పంపిస్తానని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తండాలు లాంటి 90 గ్రామాలకు మిషన్ భగీరథ రావడం లేదని, త్వరలోనే వాటికి కూడా తాగునీటిని అందిస్తామని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

సిఎంకు కానుకగా…

సిఎం కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ పార్టీలకతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సిఎం పుట్టినరోజు కానుకగా ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. ‘ఆకుపచ్చ తెలంగాణ’ లక్ష్యంగా మొక్కలు నాటాలని ఆయన సూచించారు. 2015 నుంచి ఇప్పటి వరకు అటవీ శాఖ లెక్కల ప్రకారం 4 శాతం పచ్చదనం పెరిగిందని, హరితహారం కార్యక్రమం విజయవంతం అయ్యిందనడానికి ఇదే నిదర్శమని ఆయన వెల్లడించారు. 2015 నుంచి ఇప్పటివరకు 230 కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటామని ఆయన తెలిపారు.

ఎపిలో ఏం చేయలేకనే ఇక్కడకు వచ్చారు : షర్మిలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు

షర్మిల ఎవరి బాణం కాదని, ఎపిలో ఏం చేయలేకనే ఇక్కడకు వచ్చారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. ఎర్రబెల్లితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వైఎస్ షర్మిల మాటలపై స్పందించారు. పరాయి నేతలు వద్దు అనే ఉద్దేశంతోనే సొంత రాష్ట్రం తెచ్చుకున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీలు పెట్టారు, ఏమైందో ప్రజలు చూశారని మంత్రి ఎద్దేవా చేశారు. సిఎం కెసిఆర్ పథకాలను దేశమే కాపీ చేస్తోందని, ఎవరు వచ్చినా ఇబ్బంది లేదన్నారు. మాజీ సిఎం రాజశేఖర్ రెడ్డి మృతిచెంది ఏళ్లు గడిచిపోయిందని ఆయన గుర్తు చేశారు. ఎక్సైజ్ శాఖ, స్పోర్ట్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు పిలుపునిచ్చినట్టు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌లో దేశంలోనే అతిపెద్ద పార్కును సుమారు రెండువేలకు పైగా ఎకరాల్లో ఎకో పార్కును ఏర్పాటు చేసుకున్నామని మంత్రి తెలిపారు.

ఆంధ్రా పార్టీలను రాష్ట్ర ప్రజలు రానివ్వబోరు : మంత్రి ఎర్రబెల్లి

షర్మిల పార్టీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం స్పందించారు. ఆంధ్రా పార్టీలను రాష్ట్ర ప్రజలు రానివ్వబోరని ఆయన స్పష్టం చేశారు. బిజెపి దేశ వ్యాప్తంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. రైతు ఉద్యమానికి టిఆర్‌ఎస్ మద్ధతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ఆంధ్రా పార్టీలను రానివ్వరని టిడిపి విషయంలో ఇదే స్పష్టమయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత కన్నెబోయిన రాజయ్య యాదవ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

Minister Errabelli Dayakar Slams Jana Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News