Wednesday, May 1, 2024

ఝూటా పార్టీలను నమ్మకండి

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao Slams BJP And Congress

దుబ్బాక: ఎన్నికలపుడు వచ్చి మాయ మాటలు చెప్పే ఝూటా పార్టీలను నమ్మవద్దని, ఎల్లప్పుడూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునే గులాబీ జెండాకు అండగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం రాజక్కపేట, బల్వంతపూర్‌లో ఎన్నికల ప్రచారం పాల్గొన్న మంత్రికి ప్రజలు బతుకమ్మలు, బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బిజెపిలు ఫేక్ , మార్ఫింగ్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు, బీజేపీ అంటే బాయికాడ మీటర్లు.. టిఆర్‌ఎస్ అంటే కడుపు నిండా చూసుకునే ప్రజల పార్టీ అని అన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. 70 ఏండ్లలో గ్రామాల్లో జరగని అభివృద్ధిని ఆరేళ్లలో చేసి చూపెట్టిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని అన్నారు.

గ్రామాల్లో మార్పు దిశగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠధామాలు, డంప్ యార్డులు, పల్లెలు పచ్చదనంతో ఉండేందుకు నర్సరీలు ఏర్పాటు చేసి గాంధీజీ కలలు కన్న స్వరాజ్యాన్ని కెసిఆర్ తీసుకువచ్చారని అన్నారు. బిజెపి అంటే ఝూటా పార్టీ అని వారి మాటల నమ్మి మోసపోవద్దదని అన్నారు. బిజెపి ప్రభుత్వం కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. పించన్లపై బండి సంజయ్‌కు సవాల్ విసిరితే ఇప్పటి వరకు పత్తా లేడని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కరెంట్ కోతలు ఉండేవని గుర్తు చేశారు. వారికి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని అన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు పెద్ద పీట వేశారని, 24 గంటల ఉచిత కరెంట్‌తో పాటు రైతు బీమా, రైతు బంధు పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎక్కువగా లబ్ది పొందే ప్రాంతం దుబ్బాకనే అని తెలిపారు. ఇంటింటి తాగు నీరు ఎలా ఇస్తున్నామో.. త్వరలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుందని అన్నారు. దుబ్బాకను అభివృద్ధి చేసే బాద్యత తాను, ఎంపీ ప్రభాకర్ రెడ్డి తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని.. అన్నారు. దుబ్బాక లో దివంగత ఎమ్మెల్యే రామలింగా రెడ్డి చివరి శ్వాస వరకు కష్టపడి అభివృద్ధి పనులు చేపట్టారని,, వాటికి కొనసాగించడానికి సోలిపేట సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి,ఎంపీపీ కొత్త పుష్పలత, లత కిషన్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కైలాసం , ఏఎంసీ చైర్మన్ లక్ష్మన్‌రావు, ఎంపీటీసీలు రాధా, మనోహర్‌రెడ్డి, సర్పంచులు చౌడు కిష్టయ్య, పెరుగు పద్మ, పర్వతాలు, నాయకులు కోమటి రెడ్డి,వెంకట్ నర్సింహారెడ్డి, రొట్టె రాజమౌళి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News