Sunday, April 28, 2024

యాదాద్రిపై బురద వద్దు

- Advertisement -
- Advertisement -

Minister Indrakaran reddy review on Yadadri works

చిన్నచిన్న సమస్యలను బూతద్దంలో చూపిస్తూ
గొరంతలు కొండంతలు చేయొద్దు : మంత్రి ఐకె రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో సౌకర్యాలను, చిన్న చిన్న సమస్యలను కూడా భూతద్దంలో చూపిస్తూ పలువురు రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, పవిత్రమైన యాదాద్రి ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలని దేవదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యాపై, ప్రస్తుతం కొనసాగుతున్న మరమ్మత్తు పనులపై హైదరాబాద్ అరణ్య భవన్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ, స్వయంభు దర్శనాల ప్రారంభానంతరం అక్కడ చిన్న చిన్న సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించామని తెలిపారు. 79 మిల్లీమీటర్ల అకాల భారీ వర్షాల కారణంగా నిర్మాణంలో రోడ్లు దెబ్బతిన్నాయని, ఆలయ ప్రాంగణంలో పెండింగ్ పనులు కొనసాగడంతో పైప్ లైన్లలో మట్టి కూరుకుపోయి నీరు నిలిచిపోయిందని, అంతే కాని నాసి రకం సామాన్ల వల్లో, సరిగ్గా పనులు జరగక పోవడం వల్లో నిర్మాణ లోపం వల్లనో అలా జరగలేదని మంత్రి పేర్కొన్నారు.

దెబ్బతిన్న రోడ్లు, కూలిన పందిళ్ళు, వాననీటి లీకేజి రంద్రాలు, ఇతర నష్టాలను తీర్చడానికి పనులను వెంటనే పునరుద్ధరించామని స్పష్టం చేశారు. ఇటువంటి అడ్డంకులూ భవిష్యత్తులో పునరావృతం కాకుండా, వచ్చే వర్షాకాలంలోగా సమస్యలను అధికమించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. యాదాద్రిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించారని, ఆయన చేసే అభివృద్ధి పనులపై దుమ్మెత్తి పోయడం సరికాదని హితవు పలికారు. యాదాద్రికి వచ్చే భక్తులు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళేలాగ, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాము ఎల్లవేళలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సమీక్షా సమావేశానికి దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆర్ ఎండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్‌ఈ వసంత్ కుమార్, ఆలయ ఇంచార్జీ ఈవో రామకృష్ణ, తదితరులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News