Sunday, April 28, 2024

అవకాశాన్ని అందిపుచ్చుకుందాం

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

బీ ఇండియన్,
బై ఇండియన్
స్ఫూర్తి చాటుదాం
దేశంలో భారీ టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు ఆలోచన భేష్
పాలసీల్లో మార్పులతోనే దేశంలోకి భారీ పెట్టుబడులు
చేనేత, జౌళి రంగాల్లోని వారికి 50 శాతం కూలీ మద్దతు రెండేళ్ల పాటు చేనేత వస్తువులపై జిఎస్‌టి ఎత్తివేయండి
పిఎఫ్, ఇఎస్‌ఐ కేంద్రమే భరించాలి, తక్షణమే జిఎస్‌టి రిఫండ్
– కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కెటిఆర్ సుదీర్ఘ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : చేనేత, జౌళి రంగాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని మంత్రి కెటిఆర్ కోరారు. దేశంలో లక్షలాది మంది ఈ రంగాలపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారని, దేశంలో భారీ టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు ఆలోచనను స్వాగతిస్తున్నామని పేర్కొంటూ ఆదివారం కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. లేఖలోని పలు అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్స్, అప్పారెల్ పరిశ్రమపైన ప్రధాన దృష్టి సారించాలని కెటిఆర్ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. స్థానిక యువతకు, ప్రజలకు ఉపాధి కల్పించే ఈ రంగం పైన ప్రధాన దృష్టి సారించడం ద్వారా స్థూల జాతీయోత్పత్తి, ఎగుమతులను పెంచేందుకు అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తక్కువ ఖర్చుతో, తక్కువ భూ వినియోగంతో ఎక్కువ ఉపాధి కల్పించే శక్తి ఈ రంగానికి ఉందని, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ దిశగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ రంగం పైన ఆధారపడిన లక్షలాది మంది ఉపాధిని కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.

ఇండియా నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాల విలువ సుమారు 36 బిలియన్ డాలర్లు

ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ సంక్షోభం అన్ని రంగాల్లో మాదిరిగానే చేనేత, జౌళి పరిశ్రమను ప్రభావితం చేసిందని తన లేఖలో పేర్కొన్నారు. భారత దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్త్రాల విలువ సుమారు 36 బిలియన్ డాలర్లుగా ఉందని, అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్, వియత్నం లాంటి దేశాల్లో పెద్ద ఎత్తున పోటీ నెలకొందన్నారు. ఈ పోటీని ఎదుర్కొని భారతదేశానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

తాను ముందునుంచి చెబుతున్నట్లుగా ఈ ఆపత్కాలంలోనూ అవకాశాలున్నాయని, చైనా లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను కేంద్రీకృతం చేసిన మల్టీనేషనల్ కంపెనీలు వాటిని వికేంద్రీకరించే దిశగా ఆలోచిస్తున్నాయని, భారత్ లాంటి కొత్త ప్రదేశాలకు తమ పెట్టుబడులు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ అవకాశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవాలని కెటిఆర్ ఆ లేఖలో సూచించారు. ఒకవైపు ప్రస్తుతం పరిశ్రమపైన ఉన్న ఒత్తిడిని తగ్గించే చర్యలు తీసుకుంటూనే, మరోవైపు నూతన అవకాశాలను అందుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తే ఈ రంగంలో ఉన్న ప్రస్తుత ఉపాధి అవకాశాలకు భరోసా కల్పించిన వారవుతారని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి పలు సలహాలు, సూచనలను మంత్రి తన లేఖలో ప్రస్తావించారు.

పిఎఫ్, ఈఎస్‌ఐ వాటిని కేంద్రమే భరించాలి

ప్రస్తుతం పరిశ్రమలో పని చేస్తున్న వారికి 50 శాతం కూలీ మద్ధతు కనీసం 6 నెలలపాటు ఇవ్వడం, దీర్ఘకాలంలో పరిశ్రమకు అవసరమైన లోన్ ఇన్‌స్టాల్‌మెంట్‌లను చెల్లించే అంశంలో దీర్ఘకాలిక రుణాలను కల్పించడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి ప్యాకేజీని బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్కడి పరిశ్రమలకు ప్రకటించిందని మంత్రి ఈ సందర్భంగా తన లేఖలో పేర్కొన్నారు. మూడు నెలలపాటు పరిశ్రమలో పనిచేస్తున్న వారికి పిఎఫ్, ఈఎస్‌ఐ వంటి వాటిని కేంద్రమే భరించే నిర్ణయం తీసుకోవాలని, తద్వారా స్వల్పకాలంలో పరిశ్రమలో నగదు లభ్యత పెరుగుతుందన్నారు. ఈ విధమైన చర్యల వలన పరిశ్రమ ద్వారా అందుతున్న ఉపాధిపై ఎలాంటి నెగెటివ్ ప్రభావం లేకుండా భరోసా కల్పించిన వారవుతారని ఆయన సూచించారు. పరిశ్రమలకు బ్యాంకుల ద్వారా మరింత భరోసా కల్పించవచ్చని తన లేఖలో మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

జిఎస్టీ రిఫండ్‌లను వెంటనే చెల్లించాలి

ఈ మేరకు ప్రస్తుతమున్న రుణాలకు అదనంగా మరిన్ని రుణాలను అందించడంతో పాటు, ప్రస్తుత రుణాలపైన ఉన్న వడ్డీ మాఫీ లేదా వాటి పై మారటోరియం ఒక సంవత్సరం పాటు విధించాలన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న జిఎస్టీ రిఫండ్‌లను వెంటనే చెల్లించాలన్నారు. జిఎస్టిలో మాన్‌మేడ్ ఫైబర్ రంగానికి మరింత వెసులుబాటు కల్పించడం ద్వారా ఈ రంగంలో రానున్న నూతన పెట్టుబడులను అందుకోవచ్చని మంత్రి తెలిపారు.

సబ్సిడీలను నేరుగా వారి అకౌంట్‌లో వేయాలి

పత్తి కొనుగోలు మద్ధతుకు సంబంధించి రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకంలో భాగంగా సబ్సిడీలను నేరుగా వారి అకౌంట్‌లో వేయాలని సూచించారు.పెట్టుబడిదారులు ఇక్కడి కూలీ రేటు, విద్యుత్ ఖర్చు రెండింటిని ప్రధానంగా చూస్తారని, గతంలో పిఎఫ్, ఈఎస్‌ఐ లో కంపెనీల వాటాను చెల్లించే పథకం ఉండేదని, దానిని తిరిగి ప్రవేశపెట్టాలని ఆయన కోరారు.

కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌కు స్పందన

దేశంలో భారీ టెక్స్‌టైల్స్ జోన్లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచించడాన్ని మంత్రి కెటిఆర్ స్వాగతించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్క్, వరంగల్‌లో ఏర్పాటు చేస్తుందని మంత్రి ఈ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి దీనికి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. దీంతో పాటు తాము చేపడుతున్న ఇతర ప్రాజెక్టులలోనూ ప్లగ్ అండ్ ప్లే మాదిరి మౌలిక వసతులను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

చేనేత గురించి ప్రస్తావించిన కెటిఆర్

ప్రస్తుతం భారతదేశంలో ఉపాధి అందిస్తున్న సంప్రదాయ రంగాల్లో చేనేత ఒకటని, తెలంగాణలోనూ పోచంపల్లి, గద్వాల్ వంటి ప్రముఖ చేనేత ప్రాంతాలతో పాటు ఇక్కత్, గద్వాల్ కాటన్, నారాయణపేట్ కాటన్, గొల్లభామ వంటి అనేక రకాలైన సుసంపన్న చేనేత కళ తెలంగాణలో ఉందని మంత్రి కెటిఆర్ కేంద్రమంత్రికి గుర్తు చేశారు. భారతదేశం నుంచి సుమారు 350 మిలియన్ డాలర్ల చేనేత ఎగుమతులు ప్రతి ఏడాది జరుగుతున్నాయని, దీనిని పెంచేందుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని కెటిఆర్ పేర్కొన్నారు.

ప్రస్తుత లాక్‌డౌన్ వలన పెద్ద ఎత్తున చేనేత ఉత్పత్తులు, కార్మికుల వద్ద పేరుకుపోయి ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇలాంటి వాటిని అమ్మేందుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ -కామర్స్ మాద్యమాలను అనుసంధానం చేయాలన్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేనేత వస్త్రాలను కెవిఐసి, కాటేజ్ ఇండస్ట్రీస్ వంటి వాటి ద్వారా కొనుగోలు చేయాలన్నారు. బీ ఇండియన్ ఇండియన్, బై ఇండియన్ (భారతీయులు గా ఉండండి, భారతీయవస్తువులను కొనండి )అనే నినాదంతో పెద్దఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం, ప్రస్తుతం ఏర్పడిందని, ఇలాంటి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు.

లక్ష లాది కుటుంబాలకి సహకారం

ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రస్తుతం పేరుకుపోయిన చేనేత ఉత్పత్తులను నగదు రూపంలోకి మార్చడం, ద్వారా లక్ష లాది చేనేత కుటుంబాలకి సహకారం అందించిన వారవుతామన్నారు. దీంతోపాటు చేనేత పరిశ్రమను చేనేత రంగాన్ని ఆదుకునేందుకు 50 శాతం యార్న్ సబ్సిడీని ఇవ్వాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రానున్న రెండు సంవత్సరాల పాటు చేనేత వస్త్రాల పైన పూర్తిస్థాయి జిఎస్టీ మినహాయింపులు పరిశీలించాలని మంత్రి కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News