Friday, May 3, 2024

ప్రభుత్వం చెప్పినట్టే పంటలు

- Advertisement -
- Advertisement -

CM KCR

 

ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ల ‘సాగు’బాటు వద్దు
మార్కెట్లో డిమాండున్న పంటలే వేయాలి
రైతుల్లో చైతన్యానికి కఠిన పద్ధతులు
ప్రతి ఏటా మానవీయ దృక్ఫథంతో పంటల కొనుగోలు ప్రభుత్వానికి సాధ్యం కాదు
తెలంగాణ సోనా రకం బియ్యానికి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది, 10 లక్షల
ఎకరాల్లో వీటిని పండించాలి
ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షా సమావేశంలో వ్యవసాయరంగ నిపుణుల సూచనలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రైతులంతా ఒకే పంట వేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చి తీరాలని వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయాధికారులు అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో వ్యవసాయం లాభసాటి కావాలంటే, వ్యవసాయాభివద్ది కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సంపూర్ణ ఫలితం ఇవ్వాలంటే పంటల కు మంచి ధర రావాలని వారు ఆ కాంక్షించారు. దీనికోసం పంటల సాగు ఎవరికిష్టం వచ్చినట్లు వారు చేసుకునే విధంగా కాకుండా, వ్యవసాయాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పినట్లు పంట లు వేసే విధానం రావాలని వారు స్పష్టం చేశారు. తెలంగాణలో పంట ల సాగు విధానం, ప్రత్యామ్నాయ పంటల గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటకు మంచి ధర వచ్చేలా చూడడం లాంటి అంశాలపై ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం సుదీర్ఘ సమీక్ష జరిగింది.

వ్యవసాయ శాఖ మంత్రి ఎస్. నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్థన్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండి సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ విసి ప్రవీణ్ రావు, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ సీమా, అగ్రి బిజినెస్ నిపుణులు సీమా, రాధిక, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కోసం తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా వ్యవసాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే పండించాలని వారు స్పష్టం చేశారు. అలా చేస్తేనే పంటలకు మంచి ధర వస్తుందని చెప్పారు. ఏ రైతు ఏ పంట పండించాలనే విషయాన్ని ప్రభుత్వమే తేల్చాలని, దానికి అనుగుణంగా సాగు జరిగేట్లు చూడడం అత్యంత ప్రధానమని వారు స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగ నిపుణుల సూచనలు ఇవీ…

రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంటసాగు చేసే సంప్రదాయం ఉంది. అలా చేస్తే పండించిన పంటకు మంచి ధర రాదు. కాబట్టి మార్కెట్ డిమాండును బట్టి పంట పండించాలి. ఇలా పండించాలంటే నియంత్రిత పద్ధతి రావాలి. రైతులకు చైతన్యం రావాలి. క్రమ పద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి. వ్యవసాయాధికారులు, యూనివర్సిటీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు సరైన అధ్యయనం, పరిశోధన ద్వారా ఎక్కడ ఏ పంట ఎంత మేర వేయాలో నిర్ణయిస్తారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేయాలి. సూచించిన పంటలు వేయని రైతులకు ప్రభుత్వం అందించే రైతుబంధు సహాయాన్ని నిలిపి వేయాలి. వారు పండించిన పంటలను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయవద్దు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసిన రైతులకు మాత్రమే రైతుబంధు, కనీస మద్దతు ధర ఇవ్వాలి. -ఈ సారి కరోనా -లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం మానవీయ దృక్పథంతో పంటల కొనుగోళ్లు జరుపుతున్నది. ప్రతీ ఏటా ఇలాగే కొనుగోళ్లు జరపడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. పండించిన పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంటేనే ధర వస్తుంది. లేకుంటే రాదు. కాబట్టి మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగానే పంటలు పండించడం తప్ప మరోమార్గం లేదు. –

ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలు

తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టకుని వ్యవసాయాధికారులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే విషయంలో కొంత నిర్ధారణకు వచ్చారు. ఏడాదిలో రెండు పంటలకు కలిపి వరి 8090 లక్షల ఎకరాలో, పత్తి 50 లక్షల ఎకరాలో, కంది 10 లక్షల ఎకరాల్లో మక్కజొన్న 7 లక్షల ఎకరాలో, వివిధ రకాల విత్తనోత్పత్తి 7 లక్షల ఎకరాలో, మిర్చి రెండున్నర లక్షల ఎకరాలో, కూరగాయలు మూడున్నర లక్షల ఎకరాలో, వేరుశనగ రెండున్నర లక్షల ఎకరాలో, పసుపు 1.25 లక్షల ఎకరాలో, కొర్రలు, మినుములు, పెసరు, ఆవాలు, నువ్వులు లాంటి పంటలు మరో రెండు లక్షల ఎకరాలో, కొద్ది పాటి విస్తీర్ణంలో సోయాబీన్ పండించడం ఉత్తమం. -ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడడమే కాకుండా, 3040 ఏళ్ల పాటు నిరంతరంగా పంట దిగుబడి వచ్చే పామాయిల్ సాగును తెలంగాణలో విస్తరించాలి.

ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 50 వేల ఎకరాలో, సూర్యాపేట జిల్లాలో 10 వేల ఎకరాల్లో పామాయిల్ పండిస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉన్నందున తెలంగాణ వ్యాపంగా 5 నుంచి 10 లక్షల ఎకరాల వరకు పామాయిల్ సాగు చేయవచ్చు. -రాష్ట్రంలో 8090 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయవచ్చు. కాని ఇందులో కూడా మార్కెట్ అవసరాలకు తగ్గట్టు రకాలు పండించాలి. సన్న రకాలు ఎన్ని పండించాలి, దొడ్డు రకాలు ఎన్ని పండించాలనే విషయంలో కూడా స్పష్టత ఉండాలి. కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు బాయిల్ రైస్ ఎగుమతి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దొడ్డు రకాలు పండించాలి. తెలంగాణ ప్రజలు ఎక్కువగా సన్న రకాలు తింటారు. కాబట్టి వాటినీ పండించాలి. బియ్యం గింజ పొడవు 6.2 ఎంఎం అంతకన్నా ఎక్కువ ఉన్న రకాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఆ రకాలనూ పండించాలి. ఏది ఎంత పండించాలనే విషయంలో నిర్ణయం తీసుకుని, అందుకనుగుణంగా సాగు చేయాలి.

షుగర్ ఫ్రీ రైస్‌గా గుర్తింపు

తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన తెలంగాణ సోనా బియ్యం రకానికి మంచి డిమాండ్ ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇవి చాలా మంచివి. షుగర్ ఫ్రీ రైస్ గా వీటిని వ్యవసాయ రంగ నిపుణులు గుర్తించారు. తెలంగాణ సోనా రకం బియ్యంలో గ్లైసమిన్ ఇండెక్స్ తక్కువ శాతం ఉంటుందని, ఇది ఆరోగ్యదాయకమని అమెరికన్ జర్నల్స్ కూడా ప్రచురించాయి. తెలంగాణ సోనాకు మంచి బ్రాండ్ ఇమేజి ఉంది. కాబట్టి ఈ రకాన్ని ఈ వర్షాకాలం సీజన్ లోనే 10 లక్షల ఎకరాల్లో పండించాలి. దీనికి కావాల్సిన విత్తనాలను కూడా వ్యవసాయ యూనివర్సిటీ సిద్ధం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఏ పంట ఎంత వేయాలో నిర్ణయించిన తర్వాత ఏ పంటను ఎక్కడ ఎంత విస్తీర్ణంలో పండించలానే విషయంలో నిర్ణయం తీసుకోవాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం చెప్పిన పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలి. ప్రభుత్వం సూచించిన పంటలకు సంబంధించన విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలి. విత్తన వ్యాపారులు తమకు తోచిన విత్తనాలను రైతులకు అంటగట్టే పద్ధతి పోవాలి. ఈ విషయంలో కూడా పూర్తి స్థాయి నియంత్రణ రావాలి. –

తీరిన కరెంట్ సమస్య

రాష్ట్ర పభుత్వం చేసిన కృషి ఫలితంగా తెలంగాణలో కరెంటు సమస్య తీరింది. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య తీరుతున్నది. వీటన్నింటి ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయం సాగు విస్తీర్ణం పెరుగుతుంది. దిగుబడులు కూడా బాగా వస్తాయి. అలా వచ్చిన దిగుబడులకు మంచి ధర వచ్చినప్పుడే వ్యవసాయ రంగాభివృద్ధి కోసం చేసిన కృషికి సార్థకత. అలా మంచి ధర రావాలంటే నియంత్రిత పద్ధతిలో సాగు జరగాలి. రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News