Saturday, April 27, 2024

పంజాబ్‌లో మాదిరిగా ఎందుకు కొనరు?

- Advertisement -
- Advertisement -
Minister Niranjan Reddy Slams Central Govt
తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వివక్ష
మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల ఆగ్రహం

మన తెలంగాణ/హైదరాబాద్ : పంజాబ్‌లో ధాన్యం కొనుగోలు చేసిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కొనదో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు డిమాండ్ చేశారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం తెలంగాణ పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నాదని ప్రశ్నించారు. రాష్ట్ర రైతులను ఆగం చేయాలన్నదే కేంద్రం కుట్రగా తెలుస్తోందని వారు ఆరోపించారు. ఇది సరైన విధానం కాదన్నారు. ఫెడరల్ స్పూర్తిగా విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, కమలాకర్‌లు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలులో కేంద్రానిది ఘోర వైఫల్యమని ఆరోపించారు. తన అసమర్థతను కేంద్రం ఒప్పుకోవాలన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపమంటే రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి నాయకులు ఎదురుదాడి చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధాన్యం కొనలేమంటున్న కేంద్రం ఎందుకు కొనరో నేరుగా, వివరంగా ప్రజలకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. యాసంగి వడ్ల సేకరణ విషయంలో కేంద్రానికి ఒక స్పష్టత లేదని విమర్శించారు. యాసంగి వడ్లను బాయిల్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించి… తీరా పంటచేతికి వచ్చాక ఇప్పడు చేతులెత్తేసిందని వారు దుయ్యబట్టారు. కేంద్రం బాయిల్ రైస్ కు ప్రోత్సాహం ఇచ్చినందునే దేశంలో చాలా రైస్ మిల్లులు ఏర్పడ్డాయన్నారు. బాయిల్ రైస్ వద్దనుకుంటే ఔటర్‌ను రిడిఫైన్ చేసి 55 నుండి 56 కిలోలుగా నిర్దేశించాలన్నారు. కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తే పంజాబ్ రాష్ట్రంలో లాగే ఇక్కడ కూడా పంట వస్తున్నదని… కానీ ఏడేళ్లలో రాష్ట్ర రైతులకు కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. అయినప్పటికీ వరిలో అగ్రస్థానానికి తెలంగాణ ఎదిగిందని వారు స్పష్టం చేశారు. అలాంటిప్పుడు తెలంగాణ రైతులు పండించిన పంటకు కేంద్రం ఎందుకు చేయూతనివ్వడంలేదో చెప్పాలని మంత్రులు నిలదీశారు.

ధాన్యం సేకరణ, ఆహార పంపిణీ కేంద్ర ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని అన్నారు. ధాన్యం సొమ్మును రైతులకు తాము వారం రోజుల్లోనే చెలిస్తుంటే… కేంద్రం మాత్రం రాష్ట్రానికి 6 నెలల తర్వాత ఇస్తోందని ఆరోపించారు. కేంద్రం తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతోందని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. రైతుల మెడమీద కత్తి పెట్టింది కేంద్రప్రభుత్వమేనని అన్నారు. ధాన్యాన్ని కొనలేమని చెప్పిన కేంద్రం.. అదే విషయాన్ని నేరుగా ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులు యాసంగి బియ్యాన్ని పూర్తిగా అమ్ముతారన్నారు. వేసవి ఉష్ణోగ్రతల వల్లే యాసంగి బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తాయన్నారు. ఇది అందరికి తెలిసిన విషయమేనని వారు పేర్కొన్నారు. ఇన్నాళ్లు కేంద్రం బాయిల్ రైసును తీసుకోలేదా? మరి ఇప్పుడు ఎందుకు తీసుకోమని అంటున్నారని ప్రశ్నించారు. ఒకవేళ బాయిల్ రైస్ తినే వాళ్లు దేశంలో తగ్గిపోతున్నారంటే అందుకు పరిష్కారం చూపెట్టాలన్నారు. అలా చెప్పకుండా మధ్యలోనే చేతులెత్తేస్తే ఎలా? అని మంత్రులు మండిపడ్డారు.

భవిష్యత్లో బాయిల్డ్ రైస్ తీసుకునేది లేదని రాష్ట్రం మెడపై కత్తిపెట్టి రాయించుకున్న కేంద్రం ఇంకా 5లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోలేదన్నారు. పలు విషయాల్లో తెలంగాణకు కేంద్రం అడ్డుపడుతోందన్నారు. చివరకు గన్నీ బ్యాగుల విషయంలోనూ తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. ఓపెన్ మార్కెట్లో ప్రభుత్వ ధరకంటే తక్కువకు కొంటామన్నా కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రం… ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం అని వేడుకున్నా కేంద్రం పట్టించుకోలేదని మంత్రులు పేర్కొన్నారు. పంటల మార్పిడి చేయాలని సలహాలు ఇచ్చిన కేంద్రం ప్రస్తుతం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇన్నాళ్లు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి తమ పని తాము చేసుకుంటూ పోయాన్నారు. కానీ ఇకపై ఊరుకునేది లేదని ఈ సందదర్భంగా మంత్రులు హెచ్చరించారు. చివరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా పచ్చి అబద్దాలు చెబుతూ సిఎం కెసిఆర్‌ను బెదిరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చెపుతున్నదానికి వ్యతిరేఖంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతుంటే అదుపులో పెట్టాల్సిన బాధ్యత కిషన్ రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News