సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభమైన నేపథ్యంలో ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు (MLA Harish Rao) సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ బిఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ. ఈ ప్లాంట్ కల సాకారం అవడం అనేది గొప్ప విజయమని అన్నారు.. వేలాదిమంది రైతుల జీవితంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకువచ్చే, దశ దిశను మార్చే ఫ్యాక్టరీ ఇది అని పేర్కొన్నారు.
‘‘కెసిఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ, దిండి ఎత్తిపోతల పథకం, చెరువులు, చెక్ డ్యాములతో ఈ రాష్ట్రం సస్య శ్యామలమై భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగాయి. కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల పాలమూరు గాని, కాళేశ్వరం గాని, సీతారామ గాని వాటి ఫలితంగా తెలంగాణ ప్రాంతమంతా పామాయిల్ పంట సాగుకు అనుకూలంగా మారింది. కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఆయిల్ ఫాం సాగు అవుతున్నది’’ అని హరీశ్ (MLA Harish Rao) అన్నారు.
రైతుల జీవితాల్లో వెలుగులు వచ్చిందంటే కారణం కాళేశ్వరమే అని హరీశ్ పేర్కొన్నారు. ‘‘బోరు బండ్లు మాయమైనాయి అంటే కారణం కాళేశ్వరం. వరి వండుతుంది కానీ ఎకరానికి 30,000 కంటే ఎక్కువ మిగలదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమాని ఎరువులు దొరకక వరి కష్టమైంది. కానీ ఆయిల్ ఫామ్ సాగు లాభసాటిగా ప్రతినెల జీతం పడ్డట్టు రైతుకు ఆదాయం వస్తుంది. చుట్టుపక్కల ఐదు జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ వరప్రదాయిని కాబోతున్నది. విత్తనం నాటింది బీఆర్ఎస్… కానీ పండ్లు తినడానికి మాత్రం బయలుదేరింది కాంగ్రెస్ వాళ్లు’’ అని హరీశ్ పేర్కొన్నారు.
‘‘ఈ ఫ్యాక్టరీ రావడానికి వెనుక కష్టం ఎవరిది? తంట ఎవరిది? చెమట చుక్కలు చిందించింది ఎవరు అనేది ప్రజలకు తెలుసు. 2022 ఏప్రిల్ నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీద శంకుస్థాపన చేసింది మన ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి రిబ్బను కత్తిరించడానికి కత్తేర్లు జేబులో పెట్టుకొని బయలుదేరిండు. కెసిఆర్ గారి ఆలోచన ప్రతి జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉండే. 10 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. మళ్లీ కేసీఆర్ గారు వస్తారు. జిల్లాకు పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారు. వరిలో, మక్కలో తిప్పి తిప్పి కొడితే 60, 70 వేల కంటే లాభం లేదు. ఇకముందు కోకో పంట వైపు అడుగులు వేద్దాం. ఫ్యాక్టరీ ప్రారంభమై నిన్ననే ట్రయలు కూడా ప్రారంభించారు.. పామాయిల్ లాభసాటి పంట రైతులు అందరూ పామాయిల్ పంటను వెయ్యండి. ఈ సంతోషంలో పాల్గొన్న మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’’ అని హరీష్ హర్షం వ్యక్తం చేశారు.
Also Read : కబ్జా చేసిన వారిలో రౌడీషీటర్లు ఉన్నారు: రంగనాథ్