మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి మాట మార్చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటూ విద్యా సంస్థలను నడుపుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే మల్లారెడ్డి 24 గంటల్లోనే తాను అలా అనలేదని చెప్పారు.రాజకీయాల్లో రిటైర్‌మెంట్ లేదని,తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటానని తెలిపారు. ఆదివారం మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని తాను అనలేదన్నారు.శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎంపిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని,
ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటూ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను పెడతానని పేర్కొన్నారు. ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌గా మారిపోయాయి. బిజెపి, టిడిపి పార్టీలో చేరుతున్నారా అని ఓ విలేకరి అడగగా తాను ఏ పార్టీలోకి పోనని, ఇంకా ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాల పదవీ కాలం ఉందని,బిఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు.ఈ విషయమై జవహర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ తన వయస్సు 73 ఏళ్లని జపాన్‌లో ఏ విధంగా రిటైర్‌మెంట్ అనేది ఉండదో…తనకు కూడా రాజకీయాల్లో రిటైర్‌మెంట్ ఉండదన్నారు.