మన తెలంగాణ/సిద్దిపేట రూరల్: మచ్చలేని చంద్రుడైన కెసిఆర్‌కు మచ్చ తీసుకొచ్చారని తాను చెప్పగానే.. తల్లికి పిల్లను కాకుండా ఆపారని తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో జరిగిన బతుకమ్మ సంబరాలు ఆమె పాల్గొని మాట్లాడారు. చింతమడక ప్రజలు కెసిఆర్‌ను చంద్రుడు, చంద్రం సార్ అని ప్రేమతో పిలుస్తారన్నారు. అలాంటి మచ్చలేని కెసిఆర్‌కు కొంతమంది మచ్చ తీసుకొచ్చారని మండిపడ్డారు. ఈ సంవత్సరం తాను ఎంతో బాధతో ఉన్న క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నానని అన్నారు. కుటుంబాన్ని దూరం చేశారన్న బాధతో ఉన్న తనకు వెనుక నిలబడి పిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
దుఃఖంలో ఉన్నప్పుడు అండగా నిలిచినవారే అసలైన స్నేహితులని అన్నారు. తల్లి బాగుండాలే.. తండ్రి బాగుండాలని కొట్లాడే తనను కుటుంబం నుండి విడదీయాలని కుట్రలు చేసిన వారిని అసలు వదిలి పెట్టనని స్పష్టం చేశారు. ఏ ఊరూ ఎవరి అయ్యా జాగీర్ కాదు. జాగీర్ అనే వారి భరతం పడతామని అన్నారు. చింతమడక గడ్డలో పుట్టిన బిడ్డ కెసిఆర్ రాష్ట్రమంతా తిరిగి తెలంగాణ సాధించే వరకు ఉద్యమాన్ని ఆపలేదన్నారు. కెసిఆర్ వేసిన ముందడుగుతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు. చింతమడక మట్టితో ఒక ఉద్యమం పుట్టింది.. దానితోనే దేశ, రాష్ట్ర చరిత్ర మారిందని అన్నారు. ఎవరికైనా కన్నా ఊరు అంటే ఎంతో ప్రేమ ఉంటుందన్నారు. తన చిన్ననాటి తనమంతా చింతమడకలోని కొనసాగిందని, అన్ని పండుగలను అందరితో కలిసిమెలిసి జరుపుకున్న జ్ఞాపకాలు ఎంతో గుర్తుకొస్తాయని అన్నారు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కెసిఆర్ ఉద్యమ నాయకుడిగా ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి ఎంపిగా పోటీచేసినప్పుడు రాజకీయంగా ఒకరిని ఇక్కడికి తీసుకువచ్చి పెట్టారని అన్నారు. ఆనాటి నుంచి నేటివరకు చింతమడకకు రావాలన్నా.. సిద్దిపేటకు రావాలన్నా.. అదేదో వారి ప్రైవేట్ ప్రాపర్టీ లాగా.. కెజిఎఫ్‌లాగా మార్చుకొని ఎవరు రావాలన్నా కొన్ని ఆంక్షలు పెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కానీ ఈ చింతమడక గడ్డ ఒక చిరుత పులి లాంటి కెసిఆర్‌ను కన్న గడ్డ అని అన్నారు. ఇలాంటి గడ్డమీద ఎవరి ఆంక్షలు కూడా చెల్లవని ఊరు ఊరంతా కదిలి వచ్చి ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడమే సాక్షంగా భావిస్తున్నానని అన్నారు. ఇదే ఒరవడి కొనసాగాలని, ఎందుకంటే కెసిఆర్ మీ ఆశీర్వాదంతో బయలుదేరి ఒక భూపంపాన్ని సృష్టించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టారని అన్నారు. మీరు ఆశీర్వదిస్తే తన జన్మభూమి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చుని వ్యాఖ్యానించారు. ‘మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని’ అన్నారు.
మనం తెలంగాణ వాళ్ళం.. ఎవరి ఆంక్షలకు భయపడమన్నారు. ఆనాడు ఆంధ్రోళ్లు ఆంక్షలు పెట్టి పెద్దపెద్ద ముళ్ళకంపలు పెడితేనే దాటికొని పోయి బుల్లెట్లకు ఎదుర్కొని ఉద్యమం చేసిన వారసత్వం ఉందన్నారు. అలాంటిది రాజకీయంగా ఆంక్షలు పెడితే ఆగేది లేదు.. కచ్చితంగా చింతమడకకు వస్తాం.. సిద్దిపేటకు వస్తాం.. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువసార్లు వస్తామని అన్నారు. అయినా ‘చింతమడక గ్రామ ప్రజలు నన్ను రావాలని ఆహ్వానించి.. మీరు ధైర్యం కోల్పోవద్దు.. తల్లి గారి ఊరికి రావాలని ఆహ్వానించారు’ అని అన్నారు. ఈ గడ్డ ప్రజల మేలు జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనన్నారు. చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందని తాను చూపిస్తానని, ఈ ప్రయాణంలో ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. చింతమడక గ్రామం నేర్పిన విధంగానే తెలంగాణ మొత్తం కాళ్లకు బలపం కట్టుకొని బతుకమ్మ ఎత్తుకొని తిరిగానంటే ఈ చింతమడక ఇచ్చిన ధైర్యం అని అన్నారు. అంతకుముందు గ్రామ ప్రజలు డప్పుచప్పుళ్లతో కవితకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజీనామాపై మరోసారి కవిత ఆభిప్రాయం కోరనున్న మండలి చైర్మన్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఇంకా ఆమోదం పొందకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 3వ తేదీన కవిత ఎంఎల్‌సి పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఆమె రాజీనామాపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎంఎల్‌సి పదవికి తాను స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా చేసినట్లు కవిత వెల్లడించారు. తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను ప్రత్యేకంగా కోరినట్లు పేర్కొన్నారు. రాజీనామాకు ఆమోదించకుండా చైర్మన్ ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తనకు తెలియదని అన్నారు. బిఆర్‌ఎస్ ద్వారా వచ్చిన పదవి ఆనాడు వద్దనుకున్నాను.. ఇప్పుడు వద్దనుకుంటున్నానని తాజాగా స్పష్టం చేశారు.
కాగా, ఎంఎల్‌సి పదవికి రాజీనామాపై పునరాలోచన చేయాలని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కవితకు సూచించగా, తాను అన్ని విషయాలు ఆలోచించుకునే రాజీనామా చేసినట్లు చైర్మన్‌కు చెప్పానని అన్నారు. అయితే కవిత రాజీనామాపై చైర్మన్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది సస్పెన్స్‌గా మారింది. రాజీనామా ఆమోదానికి ముందు మండలి చైర్మన్ మరోసారి కవిత అభిప్రాయాన్ని తెలుసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాతే రాజీనామాపై నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి