Sunday, April 28, 2024

మానవాభివృద్ధిలో గుజరాత్రే!

- Advertisement -
- Advertisement -

 

ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సగటు జీవితకాలం, పాఠశాలకు వెళ్లే సంవత్సరాలు, స్థూల జాతీయ ఆదాయ (జిడిపి కాదు జిఎన్‌ఐ) సంబంధిత అంశాలను బట్టి మార్కులు వేస్తారు. 2030 నాటికి నిరంతర అభివృద్ధి, పర్యావరణంపై పారిస్ ఒప్పందం కుదిరిన తరువాత తొలిసారిగా వరుసగా రెండు సంవత్సరాలు ప్రపంచ మానవ వృద్ధి సూచిక తగ్గింది. తొంభై శాతం దేశాలు 2020 లేదా 2021లో ఏదో ఒక సంవత్సరం విలువను కోల్పోయాయి.

Modi gujarat model

2020లో పరిగణనలోకి తీసుకున్న 189 దేశాల్లో భారత్ 131వ స్థానంలో ఉంది. దేశాలను 800 పాయింట్లు అంతకు మించి వచ్చిన వాటిని అత్యధిక వృద్ధి, 700 800 మధ్య వచ్చిన వాటిని అధిక వృద్ధి, 550 నుంచి 700 వరకు వచ్చిన వాటిని మధ్య రకం, అంతకు లోపు వచ్చిన వాటిని తక్కువ వృద్ధి చెందిన తరగతులుగా విభజించారు. మనకు 2020లో 0.645 రాగా 2021కి 0.633కు తగ్గాయి. సగటు జీవిత కాలం 69.7 నుంచి 67.2కు తగ్గింది. చైనాలో 78.5 సంవత్సరాలుంది.(చెవులప్పగించేవారుంటే మనది ప్రజాస్వామ్యం గనుక స్వేచ్ఛగా చావనిస్తారు, చైనాలో కమ్యూనిస్టు పాలన గనుక బలవంతంగా బతికిస్తారు అని చెప్పే ప్రబుద్ధులు కూడా తారసపడవచ్చు) పాఠశాలకు వెళ్లే సంవత్సరాలు 12.2 నుంచి 11.9కి, పాఠశాలకు వెళ్లే సగటు సంవత్సరాలు 6.7 నుంచి 6.5కు తగ్గాయి. ఇక మన ఇరుగు పొరుగు దేశాలను చూస్తే మన కంటే ఎగువన శ్రీలంక 73, చైనా 79, భూటాన్ 127, బంగ్లాదేశ్ 129 స్థానాల్లో ఉండగా మన కంటే దిగువన నేపాల్ 143, మయన్మార్ 149, పాకిస్తాన్ 161లో ఉన్నాయి. జిడిపిలో మనం వెనక్కు నెట్టేసిన బ్రిటన్ 18, జపాన్ 19, అమెరికా 20వ స్థానంలో ఉంది.

ఈ వివరాలను చూసిన తరువాత కరోనా రాకపోతేనా మా నరేంద్రమోడీ.. అని గొప్పలు చెప్పేవారు మనకు తారసపడతారు. వారికి ఒక్కటే ప్రశ్న అంతకు ముందు ఉన్న సూచికకు ఇప్పటికీ పెద్ద తేడా ఏముంది? అంతకు ముందు అంత అధ్వానంగా ఎందుకున్నది అన్నది ప్రశ్న. 2014కు ముందు గుజరాత్ తరహా అభివృద్ధి అని బిజెపి పెద్దలు ఊదరగొట్టిన సంగతి తెలిసిందే. 1990 నుంచి ఇప్పటి వరకు అక్కడ బిజెపి భాగస్వామిగా లేదా పూర్తిగా అధికారంలో ఉంది. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ సిఎంగా నరేంద్ర మోడీ ఒక కొత్త రికార్డును సృష్టించారు. సందర్భం గనుక మానవ అభివృద్ధి సూచికల్లో గుజరాత్‌ను బిజెపి మోడీ ఎక్కడ ఉంచారు అన్న ప్రశ్నకు ఎవరో ఒకరు సమాధానం చెప్పాల్సిందే.

మోడీని అడిగే వారు లేరు, అడగకుండా తనంతట తాను నోరు విప్పరు. అడగ్గలిగే విలేకర్లున్నా వారితో సమావేశం పెట్టరు గనుక అది జరిగేది కాదు. 2019 సంవత్సరంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాల మానవాభివృద్ధి సూచికలు అందరికీ అందుబాటులో ఉన్నాయి. దేశ సగటు మార్కులు 0.646 కాగా ఏడు వందల పాయింట్లకు పైగా తెచ్చుకొని అధిక వృద్ధి జాబితాలో ఉన్న పద్నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 0.782 తో కేరళ ప్రథమ స్థానంలో తరువాత వరుసగా చండీగఢ్, గోవా, లక్షద్వీప్, ఢిల్లీ, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, హిమచల్‌ప్రదేశ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, డామన్ డయ్యు, హర్యానా, మిజోరాం ఉన్నాయి. తరువాత మధ్య తరహా వృద్ధి చెందిన మిగతా వాటిలో 0.697తో మహారాష్ర్ట, తరువాత వరుసగా మణిపూర్, జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, తెలంగాణ, దాద్రా నాగర్ హవేలీ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, అసోం, చత్తీస్‌గఢ్, ఒడిషా, మధ్యప్రదేశ్, జార్కండ్, ఉత్తరప్రదేశ్, బీహారు ఉన్నాయి.

గతంలో కాంగ్రెస్, వామపక్షాలు లేదా వివిధ ప్రాంతీయ పార్టీలు తమ పాలనలో సాధించిన ప్రగతి గురించి మిగతా రాష్ట్రాలతో పోల్చి చెప్పుకున్నాయి తప్ప తమ రాష్ర్టం దేశానికి ఒక అభివృద్ధి నమూనాగా చెప్పుకోలేదు. అలా చెప్పుకోవటం జనాలను తప్పుదారి పట్టించే ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. కొన్ని రాష్ట్రాలు కొన్ని రంగాల్లో ముందున్నంత మాత్రాన దాన్నే నమూనాగా చెప్పలేము.

పోనీ నరేంద్ర మోడీ దగ్గర మంత్రదండం ఉంది గనుక గుజరాత్‌ను అలా రూపొందించారని అనుకుందాం. రాజకీయంగా మోడీ పుట్టక ముందే గుజరాత్ పారిశ్రామికంగా, వాణిజ్యంలో ముందున్న రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ప్రపంచంలో మోడీ అధికారానికి వచ్చాక విదేశాల్లో విశ్వసనీయత పెరిగిందని చెప్పారు. విదేశీ పెట్టుబడుల కోసమే విమానాల్లో లోకం చుట్టిన వీరుడిగా చెప్పారు. అంగీకరిద్దాం, గుజరాత్ మాదిరి దేశం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్దలు ఇప్పుడు ఆ మాట మాట్లాడితే ఒట్టు. మోడీ పలుకుబడితోనే విదేశీ పెట్టుబడులు వస్తున్నట్లు అంగీకరిస్తూ ఆ ఘనతను కూడా ప్రధాని ఖాతాలోనే వేద్దాం. గుజరాత్ నమూనా గురించి ఎందుకు మాట్లాడటం లేదంటే ఆర్‌బిఐ లేదా కేంద్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం 2019 అక్టోబరు నుంచి 2021 మార్చి నెల వరకు వివిధ రాష్ట్రాలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) మొత్తంలో గుజరాత్‌కు 30, మహారాష్ర్టకు 28, కర్ణాటకకు 14, ఢిల్లీకి 11 శాతం అంటే 83 శాతం ఈ నాలుగు రాష్ట్రాలకే వెళ్లింది.

విదేశీ పెట్టుబడులతో దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పిన పెద్దలు, వారిని సమర్ధిస్తున్నవారు గానీ దీన్ని ఎలా సమర్ధిస్తారు ? దేశమంటే ఈ నాలుగు రాష్ట్రాలేనా ? విశ్వగురువుగా పిలిపించుకుంటున్నవారికిఇది తగినదేనా? దేశం సంగతి వదలివేద్దాం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు తెచ్చింది కేవలం ఒక శాతమే. దీనికి మోడీ లేదా సిఎం ఆదిత్యనాధ్ ఏ భాష్యం చెబుతారు. లోగుట్టు ఏమంటే లాభాల కోసం పెట్టుబడులు పెట్టేవారు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ పెడతారు తప్ప ప్రధాని లేదా సిఎంల గొప్పచూసి పెట్టరు. డబుల్ ఇంజన్లు ఉంటే (కేంద్రం రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారం) అభివృద్ధి పరుగుపెట్టిస్తాం అన్నారుగా, మరి దేశంలో అతిపెద్ద రాష్ర్టం ఉత్తరప్రదేశ్‌కు ఎఫ్‌డిఐలు ఎందుకు రావటం లేదు? బిజెపి అధికారంలోని రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ల గురించి ఆ పార్టీ నేతలు చెప్పే మాటలను నమ్మటం ఎలా? డబుల్ ఇంజన్లు ఉన్న రాష్ట్రాలు మానవాభివృద్ది సూచికల్లో అట్టడుగున ఎందుకున్నట్లు? కేరళ, ఎగువన ఉన్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల స్థాయికి గుజరాత్‌ను ఎందుకు తీసుకురాలేకపోయారు. రాష్ట్రాలను అభివృద్ధి చేయాల్సింది రాష్ర్ట ప్రభుత్వాలు, దేశం మొత్తం మానవాభివృద్ధి సూచికలో వెనుక బడిందంటే రాష్ట్రాలు కారణం తప్ప నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎలా తప్పు పడతారు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

నిజమే కదా! నరేంద్ర మోడీని ఎలా తప్పు పడతాం !! మెజారిటీ రాష్ట్రాలు బిజెపి ఏలుబడిలో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పదిహేను సంవత్సరాలు, అంతకు మించి ఆ పార్టీ అధికారంలో ఉంది. అవన్నీ మానవాభివృద్ధిలో ముందు వరుసలో ఉండి ప్రతిపక్షపాలిత రాష్ట్రాలు వెనుకబడి ఉంటే మోడీని, బిజెపిని తప్పుపట్టలేము, కానీ దానికి విరుద్ధంగా ఉన్నపుడు ఎవరిని తప్పు పట్టాలి? రాష్ట్రాల్లో అధికారం కోసం పడుతున్న తిప్పలు రాష్ట్రాల అభివృద్ధి మీద చూపి ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? కేంద్రం, రాష్ట్రాలు ఎవరు ఖర్చు చేసినా అది మానవాభివృద్ధి సూచికల్లో మన దేశ స్థానాన్ని సూచించేదే. ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 2002 నుంచి 2018 వరకు కొన్ని దేశాలు వెచ్చిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. పిపిపి పద్ధతిలో అమెరికన్ డాలర్లలో విలువలు. ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం 2019లో వివిధ దేశాలు చేసిన ఖర్చు విలువ డాలర్లలో ఉంది.

పిండి కొద్దీ రొట్టె, తిండి కొద్దీ పిల్లలు అన్నట్లుగా మానవాభివృద్ధికి అవసరమైన రంగాలకు తగినన్ని నిధులు కేటాయించకుండా, ప్రపంచ కుబేరుల్లో మనకూ స్థానం వచ్చిందని సంబరపడ్డా, ఫలానా దేశాన్ని వెనక్కు నెట్టి జిడిపిలో ముందుకు పోయినట్లు ఛాతీని ఉప్పొంగించినా, మన జబ్బలు మనమే చరుచుకుంటే చాలదు. సరైన పారిశుధ్య పరిస్థితులు లేని కారణంగా మన దేశ జిడిపిలో 6.4 శాతం (2006లో 53.8 బిలియన్ డాలర్లు లేదా రూ. 2.4 లక్షల కోట్లు నష్టపోతున్నట్లు ప్రపంచ బ్యాంకు చెప్పింది. ఈ మొత్తం 2016 నాటికి జిడిపిలో 5.2 శాతం, డాలర్లలో 106.7 బి.డాలర్లుగా అంచనా. గాలి కాలుష్యం కారణంగా జిడిపికి 7 శాతం లేదా 14 లక్షల కోట్ల రూపాయల నష్టం. మానసిక ఆర్యో సమస్యల కారణంగా 2012 2030 మధ్య మన దేశం 6.2 లక్షల కోట్ల డాలర్ల మేర నష్టపోతామని 2015లో హెల్త్‌కేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఆరోగ్య భారత్ అనే నివేదికలో పేర్కొన్నది. అధికారంలో ఎవరున్నప్పటికీ ప్రజారోగ్య ఖర్చు జిడిపిలో ఒక శాతానికి అటూ ఇటూగా ఉండటం మినహా మించటం లేదు. 2004లో నాటి సర్కార్ ఐదు సంవత్సరాల కాలంలో జిడిపిలో కనీసం 23 శాతానికి ఖర్చు పెంచుతామని చెప్పింది.

ఆ సర్కార్‌ను తీవ్రంగా విమర్శించిన నేటి పాలకులు 2017 లో జాతీయ ఆరోగ్య విధాన ప్రకటన చేస్తూ 2025 నాటికి జిడిపిలో ఖర్చును 2.5 శాతానికి పెంచుతామని చెప్పారు. వట్టిస్తరి మంచినీళ్లు తప్ప మరేమీ కనిపించటం లేదు. దేశంలో మానవాభివృద్ధి మెరుగ్గా లేదని నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినపుడే తెలుసు. అన్ని రాష్ట్రాలను మెరుగుపరిచేందుకు ఒక జాతీయ విధానాన్ని ఎనిమిదేండ్లవుతున్నా ఎందుకు తీసుకురాలేదు. కాంగ్రెస్ ఐదు సంవత్సరాల్లో చేయలేని వాటిని తొలి ఐదేండ్లలోనే తాము చేశామని మోడీ గణం చెప్పుకుంది. అత్యంత కీలకమైన ఈ అంశాన్ని ఎలా విస్మరించారు? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు తీర్చేదెవరు? విద్యుత్ సంస్కరణల్లో భాగంగా రైతుల వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు పెడితే అప్పులు తీసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తాం అని రాష్ట్రాలకు చెప్పిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు మానవాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటే ప్రోత్సాహకాలిస్తాం అని చెప్పలేదేం ?

దేశం పేరు 2002 2010 2018 ప్రపంచ బాంకు
భారత్ 102 145 275 63.75
చైనా 152 381 935 535.13
శ్రీలంక 228 322 517 160.70
బంగ్లాదేశ్ 33 66 110 45.86
పాకిస్తాన్ 86 104 178 39.50
క్యూబా 711 2,042 2,519 1,032
వియత్నాం 108 259 440 180.72
బ్రిటన్ 2,338 3,645 4,620 4,312.89

 

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News