Tuesday, September 17, 2024

ఆస్తులపై హక్కులు

- Advertisement -
- Advertisement -

Modi launches distribution of property cards across India

 

దేశవ్యాప్తంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రారంభించిన ప్రధాని మోడీ

తొలి విడతలో ఆరు రాష్ట్రాల్లోని లక్ష మందికి కార్డులు

న్యూఢిల్లీ : గ్రామీణ పేదలకు సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సర్వే ఆఫ్ విలేజస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్‌డ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వామిత్వ) పథకంలో భాగంగా ప్రాపర్టీ కార్డుల పంపిణీని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామీణ భారతం సాధికారత సాధించడంలో ఈ పథకం ఎంతో చరిత్రాత్మకమైందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. తొలుత ఆరు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రజలకు ఈ కార్డులను అందజేస్తారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్నాటక రాష్ట్రాల్లోని దాదాపు లక్షమంది గ్రామీణ ప్రజలకు ఈ ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ పథకంలో గ్రామీణ ప్రజల ప్రాపర్టీని ఆర్థిక సంపదగా గుర్తిస్తారు. దీంతో బ్యాంకుల్లో రుణాలు పొందడంతో పాటుగా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందడం సులువు అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం కింద ఆరు రాష్ట్రాల్లోని 763 గ్రామాల ప్రజలు లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

దాదాపు లక్షమంది లబ్ధిదారుల మొబైల్ ఫోన్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా లింక్ పంపించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. వీరందరికీ ఆయా రాష్ట్రప్రభుత్వాలు ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేస్తాయి. ‘ ప్రాపర్టీ యాజమాన్య హక్కులు దేశాభివృద్ధిలో గణనీయమైన పాత్ర పోషిస్తుందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు’ అని ప్రధాని చెప్పారు. ప్రంచంలో మూడో వంతు ప్రజలు మాత్రమే తమ ఆస్తులకు సంబంధించిన న్యాయమైన రికార్డులు కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో స్పష్టమైన భూమి యాజమాన్య హక్కులు కలిగి ఉండడం చాలా అవసరమని కూడా ప్రధాని చెప్పారు. రాబోయే మూడు నాలుగేళ్లలో దేశంలోని ప్రతి కుటుంబానికి ఇలాంటి ప్రాపర్టీ కార్డులను ఇవ్వడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

స్వామిత్ర ద్వారా గ్రామాల్లోని ప్రజల వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటుగా ప్రభుత్వ రంగ ఆస్తుల వివరాలను కూడా సరిహద్దులతో సహా నిర్ణయిస్తారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి ఇంటితో పాటుగా రోడ్లు, చెరువులు, పార్కులు, దేవాలయాలు, అంగన్‌వాడీ, హెల్త్ సెంటర్, పంచాయతీ కార్యాలయం వంటి అన్ని ఆస్తులను ఈ సర్వేలోకి చేర్చనున్నారు. సరైన దస్తావేజులు లేని కారణంగా తమ సొంత ఇళ్లపై బ్యాంకుల్లో ఆర్థిక లావాదేవీలు జరపలేకుండా ఉన్న వారికి స్వామిత్ర ప్రాపర్టీ కారుల ద్వారా ఆ లోటును భర్తీ చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News