Tuesday, April 30, 2024

లక్షద్వీప్ వేదన

- Advertisement -
- Advertisement -

Monopoly of corporate powers in Lakshadweep

 

సాధారణంగా వార్తలకెక్కడానికి భయపడే లక్షద్వీప్ ఇప్పుడు ప్రముఖంగా మీడియాలో కనిపిస్తున్నది. కేరళ తీరానికి 360 కి.మీ దూరంలో అరేబియా సముద్రంలో గల 36 దీవుల సముదాయమే లక్షద్వీప్. లక్క దీవులు అని కూడా పిలుస్తారు. కేవలం 70 వేల మంది జనాభాతో అతి తక్కువ నేరాలతో, ప్రకృతి శోభతో ప్రశాంతంగా బతికే ఈ దీవుల్లోని 90 శాతం జనాభా సూఫీ ముస్లింలే. భాష మలయాళం. సంస్కృతీ, సంప్రదాయాలు కేరళీయులవే. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ పాలనలో ఉన్న ఈ దీవులు 1799లో ఆయన మరణించిన తర్వాత బ్రిటీష్ వారి హస్తగతమై 1956 నుంచి స్వతంత్ర భారత దేశంలో అంతర్భాగంగా, అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటున్నాయి. గత డిసెంబర్‌లో ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి పాలకుడుగా (అడ్మినిస్ట్రేటర్) గుజరాత్‌కు చెందిన రాజకీయ నాయకుడు, ప్రఫుల్ కోడా పటేల్‌ను నియమించినప్పటి నుంచి అక్కడి ప్రజల్లో అభద్రతా భావం పెరగడం ప్రారంభమైంది. ఈయన గతంలో నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేశారు. పటేల్ అడ్మినిస్ట్రేటర్ కాక ముందు ఆ పదవిలో ఐఎఎస్ అధికారులు ఉండేవారు.

ఈయన అడుగుపెట్టడంతోనే కేంద్ర పాలక పక్షం బిజెపి విధానాలకు అనుగుణంగా ఆ ప్రాంత రూపు రేఖలను మార్చివేసే వ్యూహానికి పదును పెట్టడం మొదలు పెట్టారు. కేవలం 32 చదరపు కి.మీల అతి తక్కువ విస్తీర్ణంలోని ఈ దీవులకు ఆధునిక అంతర్జాతీయ వాణిజ్య స్థాయి పర్యాటక కేంద్ర రూపును కల్పించడం కోసం లక్షద్వీప్ డెవలప్‌మెంట్ అధారిటీ (ఎల్‌డిఎ) ని నెలకొల్పారు. జన సమ్మర్దం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వందలాది చెట్లను, ఇళ్లను కూల్చివేసే పనిని పటేల్ తలపెట్టారు. ఇందుకోసం సంబంధించిన వారి అనుమతి లేకుండా ఎక్కడి ఎటువంటి భూమినైనా స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఎల్‌డిఎ ద్వారా అడ్మినిస్ట్రేటర్ సంక్రమింప చేసుకున్నారు. కారణం చెప్పకుండా ఎవరినైనా అరెస్టు చేసి ఏడాది పాటు నిర్బంధించడానికి అవకాశమిస్తున్న సంఘ వ్యతిరేక చర్యల క్రమబద్ధీకరణ చట్టాన్ని తీసుకు వచ్చారు. అడ్మినిస్ట్రేటర్ చర్యలను చట్టబద్ధంగా, ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రశ్నించే వారిని కూడా జైళ్లలో తోయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది.

ఇక్కడితో ఆగకుండా లక్షద్వీప్ జంతు సంరక్షణ చట్టాన్ని కూడా తీసుకు వచ్చారు. ఇది బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమల్లో గల గోవధ నిషేధ చట్టాలకు నకలు. జంతువులను చంపాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సు తీసుకోడం తప్పనిసరి చేశారు. ఇక్కడి జనం ఆవులను వ్యవసాయానికీ, పాడి అవసరాలకు వినియోగిస్తారు. ఆవు మాంసం తింటారు. ఈ చట్టం ద్వారా వారి ఆహార అలవాట్లలో జోక్యం చేసుకోదలచారని స్పష్టపడుతున్నది. అంతేకాక పశు సంవర్ధక శాఖను రద్దు చేసి అందులో పని చేస్తూ వచ్చిన వారిరందరినీ రోడ్ల మీదకి తరిమేశారు. పెద్దపెద్ద పాడి ఉత్పత్తి క్షేత్రాలను మూయించి వేస్తున్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్ పాల విక్రయాన్ని ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. దాదాపు మొత్తం ప్రజలందరూ సూఫీ ముస్లింలే కావడం వల్ల వారు మద్య నిషేధాన్ని స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. ఒకే ఒక్క దీవిలో మాత్రమే పర్యాటకుల కోసం మద్యం లభిస్తుంది. పటేల్ ప్రభుత్వం మరి మూడు దీవుల్లో మద్యపానాన్ని అనుమతించింది.

ఈ విధంగా అక్కడ భౌగోళిక విభజన వంటి పరిస్థితిని సృష్టిస్తోందని విమర్శలు బయలుదేరాయి. ఇంకొక వైపు మత్సకారుల పడవల యార్డులను అక్రమ నిర్మాణాలంటూ కూల్చివేస్తున్నారు. అంగన్‌వాడీలను మూయించి వేశారు. మొత్తంగా లక్షద్వీప్‌లో కార్పొరేట్ శక్తుల గుత్తాధిపత్యానికి దారులు వేస్తున్నారు. అన్నింటికీ మించి పటేల్ చర్యల వల్ల ఎన్నడూ లేని విధంగా కరోనా విజృంభించిందనే భావన ప్రజల్లో భయోత్పాతాన్ని నిరసనను పెంచింది. అంతవరకు అమల్లో ఉండిన కొవిడ్ నిరోధక పద్ధతిని పటేల్ ప్రభుత్వం మార్చి వేసింది. బయటి నుంచి వచ్చే వారికి ఆర్‌టిపిసిఆర్ పరీక్ష చేసి వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచే విధానాన్ని అప్పటి వరకు ప్రజల ఏకగ్రీవ సమ్మతితో అవలంబించేవారు. దాని వల్ల దీవులు కొవిడ్ రహితంగా చాలా కాలం ఉండగలిగాయి. ఇప్పుడు అక్కడ దాని వ్యాప్తి తీవ్రమైంది. దీనితో ప్రజల అసంతృప్తి మరింత పేట్రేగింది. పటేల్ ప్రవేశపెడుతున్న పద్ధతులు తమ జీవన విధానాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అంతిమంగా అక్కడ తన ఉనికికి ముప్పు కలిగిస్తాయని వారు అభిప్రాయపడుతున్నారు.

లక్షద్వీప్‌తో సన్నిహిత సంబంధాలున్న కేరళలో అక్కడి పరిణామాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీవుల్లో జరుగుతున్నది కేవలం అడ్మినిస్ట్రేటర్ మాత్రమే చేయిస్తున్నది కాదని కేంద్ర పాలకులు తమ సంఘ్ పరివార్ విధానాల అమలు కోసం జరిపిస్తున్న సాంస్కృతిక దాడి అని కేరళలోని పాలక, ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ప్రజలను కాదని పటేల్ అమలు చేస్తున్న విధానాలను ప్రధాని మోడీ పరిశీలించి తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News