Sunday, April 28, 2024

సరళీకృత విధానాల అపహాస్యం!

- Advertisement -
- Advertisement -

Controversy over Anandayya drug

సరళీకృత విధానాల పేరుతో లాభదాయకమైన ప్రభుత్వ రంగ సంస్థలను వరుసగా ప్రైవేట్‌పరం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. ఆర్ధిక సంస్కరణలు అంటే కార్పొరేట్ సంస్థలకు మొత్తం ఆర్ధిక వ్యవస్థను అప్పచెప్పి ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం అనే విచిత్రమైన భాష్యం ఆచరణలో చెబుతున్నారు. అసలు ఆయా రంగాలలో ఏమాత్రం అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు వరుసపెట్టి దేశంలోని భారీ మౌలిక సదుపాయాలను కట్టబెడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వంలో ఎటువంటి పారదర్శకత గాని, జవాబుదారీతనం గాని కనబడటం లేదు.

కానీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న జనానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆనందయ్య ఉచితంగా మందు ఇస్తుంటే, అల్లోపతి వైద్యం దోపిడీకి కృంగిపోతున్న జనం ఆశతో జనం ఎగబడుతుంటే ప్రభుత్వం ఎందుకు ఖంగారు పడుతుందో అర్ధం కావడం లేదు. ఆ ముందుకు అనుమతి ఉందా? అంటూ లేనిపోని ప్రశ్నలు తలెత్తుతుంది. సరళీకృత విధానాలు అంటే ప్రభుత్వ అనాలోచిత నియంత్రణల నుండి ప్రజలకు విముక్తి కలిగించడం అనే కనీస పరిజ్ఞానం మన నేతలకు ఉన్నట్లు కనిపించడం లేదు.

ప్రభుత్వం నియంత్రణలను సరళీకృతం చేయకుండా, ప్రభుత్వం రంగ సంస్థలను కార్పొరేట్ వారికి కారుచవుకగా అమ్మివేయడమే ఆర్ధిక సంస్కరణలు అనే దురభిప్రాయంగా ప్రభుత్వాలు నడవడం దురదృష్టకరం. ఆనందయ్య మందులో వాడుతున్న మందులో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని, ఆ మందును వాడిన వారెవ్వరికీ హాని జరిగిన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని స్వయంగా ఆయుష్ కమిషనర్ రాములు చెప్పారు. అయినా ఆ మందుకు భారత వైద్య పరిశోధన సంస్థ (ఐసిఎంఆర్) అనుమతి కావాలని పట్టుబడుతున్నారు.

పైగా దీనిని నాటు మందు అని ఆయుష్ కమిషనర్ రాములు తేల్చడంతో దీని పంపిణీకి ప్రభుత్వ అనుమతి కూడా అవసరం లేదని స్వయంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా స్పష్టం చేశారు. అయినా ఇంకా ఎందుకు పంపిణీకి అడ్డుకొంటున్నారు? భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఐసిఎంఆర్ సంచాలకులు ప్రొఫెసర్ బలరాం భార్గవ్ ఫోన్‌లో మాట్లాడితే ఆనందయ్య మందు ఆయుష్ పరిధిలో వస్తుందనీ, ఇప్పటికే ఆ విభాగం పరిశోధన ప్రారంభించినందున తమ విచారణ అవసరం లేదని స్పష్టం చేయడం గమనార్హం.

రెండు, మూడు రోజులలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న ఆయుష్ పది రోజులు దాటినా ఇవ్వలేదు. ఎవ్వరికీ అభ్యంతరం లేని ఈ మందు పంపిణీకి అసలు ప్రభుత్వ అనుమతి ఎందుకు? మన ఇళ్లల్లో, గ్రామాలలో, గిరిజన ప్రాంతాలలో అనేక చిట్కా వైద్యాలు అనుసరిస్తున్నాము. వాటికి ప్రభుత్వ అనుమతి ఇస్తుందా? ఇప్పటి మందు తీసుకున్న వారెవ్వరిలో దుష్ఫలితాలు కలిగించిన సూచనలు లేకపోయినా ఇంకా మందు పంపిణీకి అడ్డంకులు కల్పించడంలో అర్ధం లేదు. ఆనందయ్య మందుపై వివాదం చెలరేగడానికి మూలకారకుడు తమ అధికార పరిధిలోని లేని ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జోక్యం చేసుకోవడమే అనే అభిప్రాయం కూడా పలు వర్గాలలో వినిపిస్తున్నది. ప్రభుత్వ నిధుల వినియోగంలో జరిగే అవినీతిపై దృష్టి సారించవలసిన ఈ వ్యవస్థ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉచితంగా మందు ఇస్తున్న వ్యక్తిని వేధింపులకు గురిచేయడంతో సూత్రధారి కావడం విస్మయం కలిగిస్తున్నది.

ఒక ప్రక్క ఆ మందు శాస్త్రీయత గురించి ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రభుత్వం మరో వంక ఆ మందు ఫార్ములా ఇవ్వమని తనను వేధిస్తున్నట్లు ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఆ ఫార్ములా తీసుకొని కార్పొరేట్ శక్తులు భారీ వ్యాపారం చేసుకొనే విధంగా సౌలభ్యం సమకూర్చే ప్రయత్నం జరుగుతుందా? అందుకనే గత రెండు వారాలుగా ఆ మందును పంపిణి చేయకుండా అడ్డుకొంటున్నారు? ఇటువంటి పలు అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా మహమ్మారి ప్రపంచంలో అల్లోపతి వైద్యం అస్తిత్వం ప్రశ్నార్ధకరంగా మారుతున్నది. ఇప్పటి వరకు కరోనా కట్టడికి నిర్దిష్టమైన మందును సూచింపలేక పోతున్నారు. ఇతర భారతీయ వైద్య విధానాలు పలు రకాల వైద్య పరిష్కారాలు సూచిస్తున్నాయి. చైనాలో వలే సాంప్రదాయ, భారతీయ వైద్య విధానాలను సమ్మిళతం చేసి ఒక భారతీయ వైద్య విధానంను అభివృద్ధి చేసే ప్రయత్నం భారత ప్రభుత్వం చేయడానికి ఇదొక్క సువర్ణ అవకాశం అని చెప్పవచ్చు.

మన దేశీయ వైద్య విధానాలను ‘నాటు వైద్యం’గా కొట్టిపారవేసి, నూన్యతాపరచే కుట్రలను మనం ఛేదించాలి. ఆనందయ్య మందు విషయంలోనూ అటువంటి ప్రయత్నమే జరుగుతున్నది. గత ఏడాది కాలంలో కరోనాకు అల్లోపతిలో అనేక చికిత్సా విధానాలు సూచించారు. తిరిగి ఆ వైద్య నిపుణులే ఆ విధానాలు పనికి రావని చెబుతున్నారు. ఈలోగా ఆయా విధానాలకు వందల, వేల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకొన్నారు. అందుకు ఎవ్వరిని బాధ్యులుగా చేయాలి? వారెవ్వరినీ ప్రశ్నిపలేని వారు ఆనందయ్యను దోషిగా చూపు ప్రయత్నం క్షంతవ్యం కానేకాదు. ఇటువంటి ఖరీదు లేని మందులు ప్రజాదరణ పొందితే కార్పొరేట్ ఆసుపత్రులు, ఔషధాల పేరుతో జరుగుతున్న వేల కోట్ల రూపాయల నిలువు దోపిడీకి అడ్డు పడుతుందనే భయంతో ఈ విధంగా చేస్తున్నట్లు భావింపవలసి వస్తున్నది. మన దేశంలో వంశపారంపర్యంగా అనేక వృత్తులు చిరకాలంగా కొనసాగుతున్నాయి. వాటిలో వైద్య వృత్తి ఒక్కటి. వారెవ్వరికీ ఆధునిక డిగ్రీలు లేకపోవచ్చు.

కానీ యూనివర్శిటీలలో శిక్షణ పొందిన వారికన్నా వారు మెరుగైన ఫలితాలు చేపడం మనందరికీ తెలుసు. అటువంటి వారికి ప్రోత్సహించాలి. వారి విజ్ఞానంకు మెరుగులు దిద్దాలి. ఆధునికతను జోడించాలి. అంతేగాని అటువంటి వృత్తులే ఉండడానికి అడ్డుకోవడం భావ్యం కాదు. ఆనందయ్య మందుకు ప్రభుత్వం ఏజెన్సీల అనుమతి కావాలని కోరుతున్న వారికి అసలు ప్రభుత్వంకు పారదర్శకమైన, నిర్దిష్టమైన విధానం అంటూ ఉందా? అని తెలుసుకోవాలి. ఇప్పటికి మన దేశం నుండి రెండే కరోనా టీకాలు వచ్చాయి. ఒక టీకాకు క్లినికల్ ట్రైల్స్ పూర్తి కాకుండానే అనుమతి ఇచ్చారు.

విదేశాల నుండి పలు దేశాలు ఆమోదించిన పలు టీకాలు ఏడు నెలలుగా అనుమతులు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతున్నారు. నిర్దిష్టమైన ప్రమాణాలను ప్రభుత్వం, ప్రభుత్వ నియంత్రణ సంస్థలే పాటించడం లేదని స్పష్టం అవుతుంది. సరళీకృత విధానాలను మూడు దశాబ్దాలుగా అమలు చేస్తున్నామని చెబుతున్నా వారి స్ఫూర్తికి అనువుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడచుకోవడం లేదని ఆనందయ్య వ్యవహారం వెల్లడి చేస్తున్నది. సరళీకృత విధానాలు అంటే ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను, ఆస్తులను కారుచవుకగా అమ్ముకోవడం కాదని, ఔత్సాహిక వ్యక్తుల కృషికి ప్రభుత్వం అడ్డురాకపోవడం అని ఇప్పటికైనా గ్రహించాలి. ప్రభుత్వం ‘సదుపాయం’ కల్పించే వ్యవస్థగా ఉండాలి తప్ప, నియంత్రణల పేరుతో అడుగడుగునా అడ్డంకులు కల్పించే గుత్తాధిపత్య వ్యవస్థగా ఉండరాదని తెలుసుకోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News