Sunday, April 28, 2024

విషవిద్వేషాల కాలుష్యపు ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

heartbreaking

 

చావు భయం ఎందరినో తరిమింది
4వ అంతస్తు నుంచి దూకిన తల్లికూతుళ్లు
యాసిడ్ దాడితో ఒళ్లుకాలిన యువకుడు
మురికికాలువలో శవాలైన సోదరులు
ఓ కాన్వెంటు స్కూలు భగ్గుమంది

న్యూఢిల్లీ : ఎటుపోతె ఏమవుతుందో తెలియని స్థితిలో వైషమ్యాల కాలుష్యపు కాటుకు గురయిన ఢిల్లీలో మరెన్నో హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఘర్షణలు చెలరేగడం, అల్లరిమూకలు దూసుకురావడంతో తాము నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకినట్లు 45 ఏండ్ల మహిళ ఒకరు ఇప్పుడు తెలిపారు. కిందపడితే ఎముకలు విరుగుతాయని, ఒంటికి దుప్పట్లు చుట్టుకుని కిందికి దూకినట్లు చెప్పారు. ఆమె తన ఇద్దరు కూతుళ్లతో పాటు చావు భయంతో ఈ దారుణానికి పాల్పడింది.తీవ్రంగా గాయపడి ఇప్పుడు స్థానిక అల్ హింద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అల్లరి మూకలు తమ ఇంటిపై దాడికి దిగినట్లు, తలుపులు తోసుకుని లోపలికి చొరబడినట్లు తెలిపారు. దీనితో తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని మేడపైకి కిందికి దూకినట్లు చెప్పారు.

బుధవారం రాత్రి ముస్లింలు ఎక్కువగా ఉండే గల్లీలో ఈ భయానక ఘటన జరిగింది. దుండగులు తన కూతుళ్ల బట్టలు చింపి, లైంగిక దాడికి దిగారని తల్లి వాపోయింది. ఆమె ఈ ప్రాంతంలో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నడిపిస్తోంది. ఏదో విధంగా వారి బారినుంచి కూతుళ్లు బయటపడ్డారని, తరువాత తామంతా కలిసి కిందికి దూకామని, అయితే ఈ గుంపు తమను చాలా దూరం వరకూ తరుముకుంటూ వచ్చిందని తెలిపారు. తాము తమకు తెలిసిన దుకాణాదారు ఆయుబ్ అహ్మద్ ఇంట్లో ఆ రాత్రి తలదాచుకున్నామని వివరించారు. అక్కడ తమకు భోజనం పెట్టి, ఆశ్రయం ఇచ్చారని వెల్లడించారు. తరువాత తమను ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దుండగులను తాను గుర్తించగలనని వెల్లడించారు. ఈ కుటుంబం ఇప్పుడు భయంతో తల్లడిల్లుతోందని అహ్మద్ తెలిపారు.

ఇటువంటి భయానక పరిస్థితుల్లోనే పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పలువురు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. 20 ఏళ్ల సల్మాన్ ఖాన్ తన బాధను తెలియచేసుకున్నారు. తాను కరవాల్ నగర్‌లో ఇంటివద్ద నిలబడి ఉండగా కొందరు తన వెన్నుపై యాసిడ్ పోశారని, కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యానని తెలిపారు. అది యాసిడా? లేక మరోటా అనేది తనకు తెలియదని అన్నారు. అయితే చాలా వేడిగా ఉందని, మీదపడగానే ఒళ్లు కాలిందని చెప్పారు. అఖిల్ సైఫీ మాట్లాడుతూ గోకుల్‌పురిలో కొందరు తనను తీవ్రంగా కొట్టారని అన్నారు.

మురికి కాలువలో సోదరుల మృతదేహాలు
ఘర్షణల నడుమ ఇంటి నుంచి బయటకు వెళ్లిన 26 ఏండ్ల అమీర్, 16 ఏండ్ల హషీమ్ సోదరులు ఇప్పుడు శవాలు అయ్యారు. ఢిల్లీలో గజియాబాద్‌కు చెందిన మెహమ్మద్ అమీర్ కుటుంబానికి ఢిల్లీ ఘర్షణలు భయానక జ్ఞాపకాలను మిగిల్చాయి. పెద్దన్నయ్య షైరుద్దిన్ వద్దని చెపుతున్నా అమీర్, హషీమ్‌లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడు వారు ఘర్షణలలో మృతి చెందారు. జిటిబి ఆసుపత్రికి వెళ్లిన కుటుంబ పెద్దలు వీరి శవాలను గుర్తించారు. ఒక మురికికాలువలో వీరి భౌతిక కాయాలు పడి ఉండగా స్వాధీనం చేసుకుని, ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

వేయి మంది పిల్లల స్కూలు బుగ్గి
ఢిల్లీలోని శివ్ విహార్ ప్రాంతంలో డిఆర్‌పి కాన్వెంట్ స్కూల్‌ను దుండగులు తగులబెట్టారు. ఘర్షణల నడుమ స్కూలు మూసివేశారు. అయితే దుండగులు కొందరు సమీపంలోని మరో స్కూలులోకి చొరబడి అక్కడి నుంచి నిచ్చెనల ద్వారా ఈ స్కూల్లోకి వెళ్లారు. ముందు బ్లాక్‌బోర్డులు , ఫర్నీచర్ అన్నింటిని విరగగొట్టారు. లైబ్రరీలోని పుస్తకాల రాక్‌లను కిందపడేశారు. తరువాత తగులబెట్టారని స్కూల్ నిర్వాహకులు ధర్మేష్ శర్మ తెలిపారు. వేయి మంది పిల్లలు చదివే ఈ స్కూలులో ఇప్పుడు ఎటుచూసినా కింద పడి ఉన్న రికార్డులు, పుస్తకాలు , పిల్లల వస్తువులు పడి ఉన్నాయి. సోమవారం స్కూలులో విధ్వంసకాండ, దగ్ధకాండ జరిగింది. ఆ రోజే విద్యార్థులకు పరీక్షలు. అవి కాగానే విద్యార్థులు, సిబ్బంది ఇళ్లకు వెళ్లారు. తరువాత కొద్దిసేపటికే స్కూలు ఈ దుండగుల బారిన పడింది. విద్యార్థుల పరీక్షా పత్రాలు కూడా చల్లాచెదరుగా పడి ఉన్నాయి.

నాలుగు రోజుల తర్వాత కన్న వారిని కలుసుకొన్న బాలిక

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో స్కూలుకు వెళ్లాక నాలుగు రోజులుగా జాడ తెలియకుండా పోయిన 13 ఏళ్ల బాలిక శుక్రవారం తిరిగితమ తల్లిదండ్రుల వద్దకు చేరుకుందని అధికారులు చెప్పారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలిక సోనియా విహార్‌లోని తన ఇంటికి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోని ఖాజురి ఖాస్ ప్రాంతంలో స్కూల్లో చదువుతోంది. గత సోమవారం పరీక్ష రాయడం కోసం స్కూలుకు వెళ్లిన బాలిక అప్పటినుంచి ఇంటికి తిరిగి రాలేదు. ఆ రోజు సాయంత్రం 5.20 గంటలకు తన కుమార్తెను తీసుకు రావడానికి తాను వెళ్లాల్సి ఉండిందని, అయితే అల్లర్ల కారణంగా చిక్కుపడిపోయాయని రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేసే ఆమె తండ్రి చెప్పాడు. కాగా ఈ రోజు ఆ బాలిక జాడ తెలిసిందని, ఆమె స్టేట్‌మెంట్ కోసం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నారని దర్యాప్తుతో సంబంధం ఉన్న పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

More heartbreaking events in Delhi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News