Saturday, April 27, 2024

ఎసిబి వలలో కార్మిక శాఖ అధికారులు

- Advertisement -
- Advertisement -

Labor Department

 

మన తెలంగాణ/ముషీరాబాద్ : కార్మిక శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తూ మౌలాలి ప్రాంతానికి అసిస్టెంట్ లేబర్ అధికారి (ఎఎల్‌ఒ) గా ఇటీవల పదోన్నతి పొందిన అధికారిని ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎసిబి డిఎస్‌పి బివి.సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 4న మల్కాజిగిరికి చెందిన మ్యాన్‌పవన్ కన్సల్టెన్సీ ఏజెన్సీ నిర్వాహకుడు బలరామ్ ప్రసాద్ లేబర్ లైసెన్సు రెన్యువల్ కోసం రంగారెడ్డి జోన్ పరిధిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అబ్దుల్ షఫియుద్ధీన్‌ను కలిశారు. ఈ సేవా ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశానని, అప్రూవ్ చేయాలని కోరారు. దీంతో అబ్దుల్ షఫియుద్ధీన్ లేబర్ లైసెన్సు రెన్యువల్ కోసం రూ. 10 వేలు చెల్లించాలని సూచించారు. ఈ నెల 10న వచ్చిన బలరామ్ ప్రసాద్‌ను ముందుగా జేబులో ఎంత ఉందో చెప్పు అంటూ నిలువుదోపిడీ తరహాలో అతని వద్ద ఉన్న రూ. 4 వేల రూపాయలను అబ్దుల్ షఫియుద్ధీన్ తీసేసుకున్నాడు.

తిరిగి ఈ నెల 14వ తేదీన వచ్చిన బలరామ్‌ప్రసాద్ లేబర్ లైసెన్సు అప్రూవ్ కాలేదని షఫియుద్ధీన్ దృష్టికి తీసుకొచ్చారు. మరో రూ. 4 వేలు ఇవ్వాలని కోరగా, అంత ఇచ్చుకోలేనని బలరామ్‌ప్రసాద్ చెప్పడంతో రూ. 3 వేలకు బేరం కుదిరింది. బాధితుడు ఈ విషయంపై ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న డిసిఎల్ ( డిప్యూటీ లేబర్ కమిషనర్ ) షఫియుద్ధీన్‌ను పిలిచి చివాట్లు పెట్టడంతో ఈనెల 14న సాయంత్రం బలరామ్ ప్రసాద్ లేబర్‌లైసెన్సు అప్రూవల్ అయిపోయింది.

అయితే షఫియుద్ధీన్‌తో బాధితుడు మాట్లాడిన విషయాలు, షఫియుద్ధీన్ డిమాండ్ తదితర అంశాలు ఆధారాలతో పాటు రికార్డు కావడంతో ఎసిబి డిజి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని అబ్దుల్ షఫియుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్‌పి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఎసిబి డిఎస్‌పి సత్యనారాయణ మాట్లాడుతూ… కార్మిక శాఖపై పలు సందర్భాల్లో అవినీతి ఆరోపణలు తమ దృష్టికి వస్తున్నాయని తెలిపారు. ఎవరైనా అంచం అడిగినట్లయితే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఎలాంటి ఆరోపణలున్నా 1064కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ దాడుల్లో ఎసిబి ఇన్‌స్పెక్టర్లు పి.రఘునందన్, వి.రవీంద్ర రెడ్డి, ఎం.రాజేశ్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Labor Department officials in ACB trap
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News