Tuesday, April 30, 2024

సిజెఐ చంద్రచూడ్‌పై ఆన్‌లైన్ ట్రోలింగ్.. చర్యలకై రాష్ట్రపతికి ఎంపీల లేఖ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) డివై చంద్రచూడ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ 13 మంది ప్రతిపక్ష నాయకులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ పనితీరు పోక్యాన్ని నిరోధించాలని వారు తమ లేఖలో కోరారు.

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, గవర్నర్ జోక్యంపై దాఖలైన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోందని, ఈ దశలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న పార్టీకి మద్దతుదారులుగా భావిస్తున్న ట్రోల్ ఆర్మీ సిజెఐకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తోందని ప్రతిపక్ష నాయకులు తమ లేఖలో పేర్కొన్నారు. ట్రోలింగ్ ఆర్మీ ఉపయోగిస్తున్న భాష, సారాంశం చాలా నీచంగా ఉన్నాయని, ఇవి వివిధ సామాజిక మాధ్యమాలలో లక్షలాది మంది చూస్తున్నారని మార్చి 16న రాసిన లేఖలో వారు పేర్కొన్నారు.

మహారాష్ట్రలో శివసేన పార్టీ రెండుగా చీలిపోవడం, అసెంబ్లీలో బలపరీక్షకు అప్పటి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశాలు ఇవ్వడంతో అప్పటి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేనలో ఒక వర్గానికి ఉద్ధవ్ థాక్రే సారథ్యం వహిస్తుండగా మరో వర్గానికి ఏక్‌నాథ్ షిండే నేతృత్వం వహిస్తున్నారు. ఏక్‌నాథ్ షిండే వర్గంతో కలిసి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కాంగ్రెస్ ఎంపి వివేక్ టంఖా రాసిన ఈ లేఖపై ఆ పార్టీ ఎంపీలు దిగ్విజయ సింగ్, శక్తిసింహ్ గోహిల్, ప్రమోడ్ తివారీ, అమీ యాజ్ఞిక్, రంజిత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, ఆప్ ఎంపి రాఘవ్ ఛద్దా, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ఎంపి ప్రియాక చతుర్వేది, సమాజ్‌వాది పార్టీ ఎంపిలు జయా బచ్చన్, రాం గోపాల్ యాదవ్, టంకా దాస్ సంతకాలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News