Tuesday, April 30, 2024

శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

New Zealand win over Sri Lanka

 

పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న మహిళల టి20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో భాగంగా శనివారం పెర్త్‌లోని వాకా స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాట్ చేసిన శ్రీలంకకు ఓపెనర్లు చమరి అట్టపట్టు, హాసిని మదుశిక శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేస్తుందనిపించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్ హేలే జెన్సన్ అద్భుత బౌలింగ్‌తో శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. 31 బంతుల్లో 41 పరుగులు చేసిన అనంతరం కెప్టెన్ చమరి అట్టపట్టు ఔటవడంతో శ్రీలంక ఇన్నింగ్స్ కుదేలు కావడం మొదలైంది. జెన్సన్ కేవలం 16 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో లంక పరుగుల వేగం మందగించింది. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన కివీస్ స్టార్ బ్యాట్స్‌మన్ సోఫీ డెవిన్ అదుబత బ్యాటింగ్ కారణంగా సునాయాసంగా విజయం సాధించింది. సోఫీ 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమెకు టి20లలో ఇది వరసగా ఆరో అర్ధ సెంచరీ కావడం గమనార్హం.

పసికూన క్రీడాస్ఫూర్తి
అంతకు ముందు సిడ్నీలో జరిగిన మరో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో పసి కూన అయిన థాయిలాండ్‌పై వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. తొలుత బ్యాట్ చేసిన థాయిలాండ్ 9 వికెట్ల నష్టానికి 78 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో కొంచెరోయిన్‌కై(33),నరుయిమోల్‌చైవై (13) బ్యాటింగ్‌లో రాణించారు.విండీస్ ఈ సులభ లక్షాన్ని16.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (26), క్యాంప్‌బెల్ (25) అజేయంగా నిలిచారు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ థాయిలాండ్ జట్టు మంచి క్రీడాస్ఫూర్తిని చాటింది.విశ్వ వేదికపై తమ ఉనికిని చాటుకునేందుకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. మైదానంలోకి అడుగుపెట్టినప్పటినుంచి చివరి వరకు చిరునవ్వులు చిందిస్తూనే ఉన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ వరసగా నిలబడి మైదానం నలువైపులకు నమస్కారం చేశారు.

New Zealand win over Sri Lanka
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News