Friday, September 20, 2024

జిఎస్‌టిపై హెచ్చరిక: శెభాష్ గడ్కరీ

- Advertisement -
- Advertisement -

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలు, పన్నుల శ్లాబ్, గూడ్స్ సర్వీస్ టాక్స్ (జిఎస్‌టి) వసూలు చేస్తున్న తీరు అత్యధిక శాతం ప్రజలకే కాదు, సహచర కేంద్ర మంత్రులకు కూడా సంతృప్తి కలిగించడం లేదు. ఇప్పుడు తాజాగా తోటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఇదే అభిప్రాయం లో ఉంటున్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమా (లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్) ప్రీమియం చెల్లింపులపై 18% జిఎస్‌టిని వసూలు చేస్తుండటాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీతారామన్‌కు లేఖ రాశారు. ఇది చర్చనీయాంశమవుతోంది.

సాక్షాత్తు కేంద్ర మంత్రే జిఎస్‌టిని ఉపసంహరించుకోవాలని సూచించడం ప్రభుత్వాన్ని ఒక విధంగా హెచ్చరించడమే. జీవిత బీమా, ఆరోగ్య బీమా ఈ రెండిటిపైనా జిఎస్‌టిని విధించడం ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇబ్బందికరంగా పరిణమించిందని పేర్కొన్నారు. మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై ఏకంగా 18% జిఎస్‌టి విధించడం దేశప్రజల ఆరోగ్యభద్రతను ప్రభావితం చేస్తున్నట్టు గడ్కరీ అభిప్రాయపడ్డారు. ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులపై జిఎస్‌టి వసూలు చేయడం ప్రతిబంధకంగా మారిందని లేఖలో స్పష్టం చేశారు. ప్రీమియం చెల్లింపులపై జిఎస్‌టిని విధించడంతో బీమారంగం తీవ్రంగా దెబ్బతింటోందని, నాగపూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్‌ఐసి) ఎంప్లాయిస్ యూనియన్ నితిన్ గడ్కరీకి ఇటీవలనే ఓ వినతి పత్రాన్ని సమర్పించింది.

అది గడ్కరీని తీవ్రంగా ప్రభావితం చేసింది. నాగ్‌పూర్ నుంచే నితిన్ గడ్కరీ లోక్‌సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. జీవిత బీమా ప్రీమియంపై జిఎస్‌టి విధించడం అంటే ప్రజలను అనిశ్చిత వాతావరణంలోకి నెట్టేసినట్టయిందని, కుటుంబానికి ఎంతో కొంత రక్షణ కల్పించాలనుకునే ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు దీనివల్ల తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాడని, నాగ్‌పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ స్పష్టం చేసింది. ప్రీమియంపై జిఎస్‌టి ఎత్తివేస్తే వారిని మళ్లీ జీవిత బీమా, ఆరోగ్య బీమా కవరేజీల వైపు ఆకర్షితులను చేయవచ్చని తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని నితిన్ గడ్కరీ.. నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో వివరించారు.

భారత దేశంలో బీమా, పెన్షన్ ఫండ్ ఆస్తులు జిడిపిలో క్రమంగా 19%, 5%వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. దీనికి భిన్నంగా అమెరికాలో 52%, 122%, బ్రిటన్‌లో 112%, 80 శాతంగా ఉన్నాయి. ఆర్థిక సర్వే ప్రకారం జిడిపిలో వాటాగా బీమా వ్యాప్తి 2023 ఆర్థిక సంవత్సరంలో 3.8% నుండి 2035 ఆర్థిక సంవత్సరానికి 4.3% పెరుగుతుందని ఒక అంచనా. అయితే ఇంతలో జీవిత బీమా ప్రీమియంలు 2024 నుండి 2028 వరకు 6.7 శాతం వార్షిక రేటుతో పెరుగుతాయని అంచనా వేయబడింది. ఇది తక్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా కవరేజీని పొందాలనుకునే టర్మ్‌లైఫ్ కవరేజీకి, యువ జనాభాకు సంబంధించి (యూత్‌ఫుల్ డెమోగ్రాఫిక్, ఇన్‌సర్‌టెక్‌లో) పురోగతికి ఆజ్యం పోసింది. అంతేకాకుండా జీవిత బీమా ద్వారా పొదుపుకు అవసరమైన చికిత్స, ఆరోగ్య బీమా ప్రీమియం కోసం ఐటి మినహాయింపును తిరిగి ప్రవేశపెట్టడం, ప్రభుత్వరంగ, సాధారణ బీమా కంపెనీల ఏకీకరణ విధానాలపై యూనియన్ ఆందోళన చెందుతున్న విషయాన్ని కూడా గడ్కరీ తన లేఖలో లేవనెత్తారు.

ఇదిలా ఉండగా బీమా ఉత్పత్తులపై, ముఖ్యంగా ఆరోగ్యం, టర్మ్ ఇన్సూరెన్స్‌పై జిఎస్‌టిని హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని మాజీ ఆర్థికసహాయ మంత్రి జయంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. రూ. 40 వేల కోట్ల నుంచి 50 వేల కోట్లగా నిర్ణయించిన బీమా పరిశ్రమ మూలధన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం తరఫున రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆన్ ట్యాప్ ’ బాండ్లను జారీ చేయవచ్చని కూడా సూచించింది. జిఎస్‌టి అధిక రేట్ల వలన ప్రీమియం భారం అధికమవుతుందని, ఇది బీమా పాలసీలను పొందడంలో ఆటంకానికి దారి తీస్తున్నదని కమిటీ సూచించింది.

ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు రిటైల్ పాలసీలు, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎంజెఎవై) అనే కేంద్ర ఆరోగ్యపథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా సమకూరే రూ. 5 లక్షల పరిమితికి జిఎస్‌టి రేట్లు వర్తిస్తాయని సిఫార్సు చేసింది. టర్మెపాలసీలను తగ్గించాలని సూచించింది. ఆరోగ్యబీమా ప్రీమియంలపై జిఎస్‌టి ఉపసంహరణ సూచనను పరిశీలించాలని ఆర్థికమంత్రి సీతారామన్‌ను అభ్యర్థించడం ఇదే మొదటిసారి కాదు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై జిఎస్‌టిని 18% నుంచి 5 శాతానికి తగ్గించాలని ఈ ఏడాది జూన్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News