Tuesday, April 30, 2024

నితీశ్ అధికార వైరాగ్యం!

- Advertisement -
- Advertisement -

Farmers concerned that no Minimum Support Price for Crops

‘ముఖ్యమంత్రి పదవి కోసం నేను పాకులాడలేదు, దాని మీద ఎటువంటి మమకారమూ లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయవచ్చు. బిజెపి తన సొంత మనిషిని ఆ పీఠం మీద కూచోబెట్టొచ్చు’ ఇటీవలే వరుసగా నాలుగోసారి బీహార్ అధికార పగ్గాలు చేపట్టిన నితీశ్ కుమార్ వెలిబుచ్చిన ఈ అభిప్రాయం బిజెపి జెడి(యు)ల ఐక్యతకు బీటలు వారడం మొదలైందని అనుకోడానికి ఆస్కారం కలిగించడం సహజం. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏడుగురు జెడి(యు) శాసన సభ్యులలో ఆరుగురు ఇటీవల పాలక బిజెపిలో చేరిపోయిన తర్వాత మొన్న ఆదివారం నాడు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నితీశ్ కుమార్ చేసిన ఈ ప్రకటన యాదృచ్ఛికంగా ఊడిపడినదేనని అనుకోలేము. అరుణాచల్ పరిణామాల తర్వాత ఆయన మొదటి సారిగా చేసిన వ్యాఖ్యలు అందులో ఈ వైరాగ్యం ధ్వనించలేదు. అక్కడి మార్పుల ప్రభావం బీహార్ రాజకీయాల మీద పడబోదని, పాట్నాలోని బిజెపి, జెడి(యు) ప్రభుత్వం ఎటువంటి పేచీలకు తావు లేకుండా నిక్షేపంగా కొనసాగుతున్నదని నితీశ్ అన్నారు. అలా వ్యక్తమైన తర్వాత అతి కొద్ది వ్యవధిలోనే నితీశ్ ముఖ్యమంత్రి పదవి మీద విరక్తిని ప్రకటిస్తూ మాట్లాడడం అర్ధరహితమైనది కాదు.

సిఎం పదవిని బిజెపి తన సొంత వ్యక్తికి కట్టబెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని నితీశ్ చేసిన తాజా ప్రకటన తన పాలక భాగస్వామి మీద దట్టించి పేల్చిన బాంబు వంటిదే అనడం అసత్యం కాబోదు. రెండు మాసాల క్రితం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గతానికి భిన్నంగా 74 స్థానాలు గెలుచుకొని బిజెపి పైచేయిగానూ, 43 సీట్లతో జెడి(యు) చిన్న భాగస్వామిగానూ అవతరించాయి. అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం నితీశ్ కుమార్‌కే ముఖ్యమంత్రి పీఠాన్ని బిజెపి విడిచిపెట్టింది. బీహార్‌లో అగ్రవర్ణాల ఓట్ల మీదనే ఆధారపడుతూ వచ్చిన బిజెపి ఆ రాష్ట్రంలోని బిసిలు పూర్తిగా ఆర్‌జెడి వైపు మళ్లిపోకుండా చూడడానికి నితీశ్ కుమార్ పార్టీతో పొత్తును కీలక ఆయుధంగా ఉపయోగించుకుంటున్నది. బిజెపి, జెడి(యు)ల ఐక్యకూటమి అధికారంలో కొనసాగడానికి, ఆర్‌జెడిని పాలక పీఠానికి దూరంగా ఉంచడానికి అది ఉపయోగపడుతున్నది.

అందుచేత బిజెపి నితీశ్‌ను ప్రాణ సఖుడి మాదిరిగా పరిగణిస్తూ వచ్చింది. అయితే నరేంద్ర మోడీని ప్రధాని పీఠం మీద చూడడానికి ససేమిరా సిద్ధంగా లేనంటూ గతంలో తనతో పొత్తుకు స్వస్తి చెప్పిన నితీశ్ కుమార్‌ను ఎలాగైనా బలహీన పర్చాలన్న లక్షంతో కావొచ్చు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలను బిజెపి అందుకు అనువుగా వినియోగించుకున్నదనే అభిప్రాయం ఏర్పడింది. ఎన్‌డిఎలో మరో భాగస్వామ్య పక్షమైన లోక్‌జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ నితీశ్ కుమార్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ప్రధాని మోడీని నెత్తిన పెట్టుకొంటూ ప్రచారం సాగించినా బిజెపి కిమ్మనలేదు. జెడి(యు) విజయావకాశాలను దెబ్బ తీయించడానికి బిజెపియే చిరాగ్ పాశ్వాన్‌ను పనికట్టుకొని ప్రోత్సహించిందనే భావన కలిగింది. లోక్‌జనశక్తి పార్టీ భవితవ్యాన్ని బిజెపియే నిర్ణయించాలని నితీశ్ కుమార్ ఒక దశలో అన్నారు.

ఎన్నికల్లో తాము దెబ్బతినడానికి ఎల్‌జెపియే కారణమని జెడి(యు) శ్రేణులు అనుకున్నాయి. అయినా చిరాగ్ పాశ్వాన్ పాత్రను బిజెపి తప్పుపట్టలేదు. అదే సమయంలో నితీశ్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసి జెడి(యు) పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నట్టు వ్యవహరించింది. కాని నితీశ్‌కు అత్యంత సన్నిహితుడనే ప్రచారం జరిగిన సుశీల్ కుమార్ మోడీని మళ్లీ ఉప ముఖ్యమంత్రిని చేయలేదు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చిన జెడి(యు) శాసన సభ్యులు ఏడుగురులో ఆరుగురిని చేర్చుకోడం ద్వారా ఆ పార్టీ పట్ల తనకు ఎటువంటి మక్కువ లేదని బిజెపి చాటింది. ఈ పరిణామం తర్వాత నేరుగా నితీశ్ కిందకే నీళ్లు రావడం ఖాయమని ప్రతిపక్షాలు వ్యాఖ్యానించడం గమనించదగినది. రానున్న ముప్పును గమనించి ప్రతిపక్షంతో పొత్తు వైపు అడుగులు వేయాలనే సలహా నితీశ్‌కు కాంగ్రెస్ నుంచి దూసుకు వచ్చింది.

బీహార్‌లోని జెడి(యు) శాసన సభ్యులను కూడా బిజెపి వదిలి పెట్టదనే హెచ్చరికలు బయలుదేరాయి. అరుణాచల్ ప్రదేశ్ జెడి(యు) విభాగమైతే ఐక్య సంఘటన ధర్మాన్ని బిజెపి కాలరాసిందని, వాజ్‌పేయి వారసత్వానికి తూట్లు పొడిచిందని వ్యాఖ్యానించింది.వాస్తవానికి అరుణాచల్‌లో జెడి(యు) సభ్యులను చేర్చుకొని తీరవలసిన స్థితి బిజెపికి లేదు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో బిజెపి బలం 48. అయినా మిత్రపక్షం ఉనికిని ఊడ్చిపెట్టడానికి అది వెనుకాడలేదంటే ఏకచ్ఛత్రాధిపత్యం మీద అది పెంచుకుంటున్న మితిమించిన కోరికను గమనించవచ్చు. నితీశ్ భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. తనపై ఉన్న అవినీతి కుంభకోణాల ఆరోపణలను ఎక్కుపెట్టి ఇరకాటంలో పెడుతుందేమోననే భయంతోనే ఆయన బిజెపిని అంటిపెట్టుకొని ముఖ్యమంత్రి పదవిలో అత్యంత అసౌకర్యంగా కొనసాగుతున్నారనే అభిప్రాయమూ ఉన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News