Friday, May 3, 2024

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

- Advertisement -
- Advertisement -

18 వరకు దరఖాస్తులకు అవకాశం
మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ రాజీనామా
కొనసాగుతున్న సభ్యురాలు కోట్ల అరుణ కుమారి
ప్రస్తుతం కమిషన్‌లో ఒక్కరే సభ్యురాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) చైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు www.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చేసుకుని, తమ దరఖాస్తులకు secy ser gad@telangana.gov.inకు ఈమెయిల్ పంపించాలని తెలిపారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అన్నారు. టిఎస్‌పిఎస్‌సి చైర్మన్, సభ్యుల ఎంపిక ప్రక్రియ వచ్చిన దరఖాస్తుల ద్వారా, లేదా ప్రభుత్వం నియమించే స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుందని తెలిపారు.
గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించిన సుమిత్రా ఆనంద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తనోబా తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం మారడం.. ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కలతచెందిన ఆమె శుక్రవారం గవర్నర్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. వ్యక్తుల కారణంగా వ్యవస్థపై మచ్చ పడిందని సుమిత్రా ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన దుష్పరిణామాలకు సభ్యులుగా తమ ప్రమేయం ఏమీ లేదని, అయినా కమిషన్ మార్పే ప్రక్షాళన అనే స్థాయిలో జరిగిన ప్రచారం తీవ్రంగా బాధించింది అని సుమిత్రా ఆనంద్ పేర్కొన్నారు.

ఉద్యోగ నామ సంవత్సరం అనుకున్న సంవత్సరమే ఎన్నికల సంవత్సరం కావడం వల్ల తాము ఉద్యోగ నియామక ప్రక్రియను సజావుగా జరపలేకపోయామని ఆమె విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ పౌరసమాజంలో అసంతృప్తిగా ఉన్న వర్గం నిరుద్యోగులే అని గుర్తించిన నాటి ప్రభుత్వం సత్వరంగా ఉద్యోగ నియమకాలు చేపట్టాలని, ఆ దిశలో అడుగులు వేసిందని తెలిపారు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలు, వివిధ పార్టీలు ఉద్యోగార్థుల పక్షం వహించి పరీక్షల వాయిదాల కోసం రకరకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచి గ్రూప్-2 వాయిదా వేయించగలిగాయని పేర్కొన్నారు. లీకేజీ వంటి ఇతరత్రా కారణాలు అన్నీ కలగలిపి కమిషన్ ప్రక్షాళన జరగాలి అనే ప్రచారం విస్తృత స్థాయిలో జరిగిందని అన్నారు. అసలు ప్రక్షాళన అనే పదం కమిషన్ ఉద్దేశించి వాడటంతో తాను తీవ్రంగా కలత చెందినట్లు సుమిత్రా ఆనంద్ పేర్కొన్నారు.
మలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన సుమిత్రా ఆనంద్
వృత్తిరీత్యా ప్రభుత్వ టీచర్ అయిన సుమిత్ర ఆనంద్ తనోబా టెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉపాధ్యాయులను సమీకరించి అనేక ఉద్యమాలకు నేతృత్వం వహించారు. భాషను అవమానిస్తున్న తీరు పట్ల కలతచెందిన ఆమె, తెలంగాణ యాసను కాపాడుకునేందుకు తెలంగాణ భాషా వేదికను నిర్వహించి, పోరాడారు. తన మాటా పాటలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రజలలో ఉద్యమ ఆకాంక్షను పెంపొందించగలిగారు. తెలంగాణ రచయితల వేదికలో క్రియాశీల పాత్రను పోషించారు. అక్షరాస్యత, సారా నిషేదం, మధ్యపాన వ్యతిరేకోధ్యమం, బాల్య వివాహాలను అరికట్టేందుకు అనేక ఉద్యమాలను నిర్వహించారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్‌లలో పాల్గొన్నారు. మహిళగా ఆమె పోరాటాన్ని గుర్తించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ టిఎస్‌పిఎస్‌సి సభ్యురాలిగా అవకాశం కల్పించారు. పూర్తి పదవీ కాలం ఆరేండ్లు కమిషన్ సభ్యురాలిగా ఉండాల్సి ఉండగా, రెండున్నరేండ్లకే రాజీనామా చేశారు.
నీళ్ళు, నిధులు, నియమకాలు అనే ప్రధాన డిమాండ్లతో సాగిన మలిదశ ఉద్యమంలో క్రీయశీల పాత్ర పోషించిన తనకు నియామక ప్రక్రియలో పని చేసే అవకాశం కల్పించిన ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సుమిత్రా ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు.
కొనసాగుతున్న మరో సభ్యులు కోట్ల అరుణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో చైర్మన్‌తోపాటు ఐదుగురు సభ్యులు ఉండగా, ఇప్పటికే టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ డాక్టర్ బి.జనార్ధన్‌ రెడ్డి, సభ్యులు బండి లింగా రెడ్డి, ఆర్ సత్యనారాయణ, కారం రవీందర్‌ రెడ్డిలు రాజీనామాలను ఇటీవలే గవర్నర్ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సుమిత్ర ఆనంద్ తనోబా శుక్రవారం టిఎస్‌పిఎస్‌సి కార్యాలయానికి చేరుకుని, తన సిబ్బంది ద్వారా గవర్నర్‌కు రాజీనామా లేఖను పంపించారు. ప్రస్తుతం కోట్ల అరుణకుమారి ఒక్కరే కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. మిగిలిన ఒక్క సభ్యురాలు కమిషన్‌లోనే కొనసాగుతారా? లేక ఆమె కూడా రాజీనామా చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News