ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మ కంగా నిర్మించారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ స్వరకర్తగా వ్యవహ రించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మరి తన అభిమాన కథానాయకుడిని దర్శకుడు సుజీత్ ఎలా చూపించాడు? ఆకాశాన్నంటే అంచ నాలను ‘ఓజీ’ అందుకుందా? తెలుసుకుందాం.
కథ: ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్) ఒక అనాథ. జపాన్‌లో సమురాయిల సమూహంలో పెరిగి పెద్దవాడవుతూ మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న అతను.. అక్కడి నుంచి అనుకోని పరిస్థితుల్లో శరణార్థిగా ముంబయికి బయల్దేరతాడు. ఆ ప్రయాణంలో తన మనుషులను.. తన సంపదను కాపాడిన ఓజాస్ ను సొంత కొడుకులా చూసుకుంటాడు సత్య దాదా (ప్రకాష్ రాజ్). ముంబయిలో పోర్టు పెట్టి వేల మందికి ఉపాధి కల్పించిన సత్య దాదాను ఓజాస్ జాగ్రత్తగా కాపాడు కుంటూ వస్తుంటాడు. అలాంటి వాడు కొన్ని కారణాలతో సత్య దాదాకు దూరమై.. ముంబయిని వదిలి వెళ్లిపోతాడు. పదేళ్లకు పైగా ఆ నగరం వైపు చూడడు. కానీ ఓమి బవు (ఇమ్రాన్ హష్మి) అనే మాఫియా డాన్ కారణంగా సత్య దాదా కుటుంబంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుని.. పోర్టు ప్రమాదంలో పడ్డ స్థితిలో ఓజీ తిరిగి రావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇంతకీ ఓమి ఎవరు.. అతడి లక్ష్యమేంటి.. తన వల్ల సత్య దాదాకు వచ్చిన కష్టమేంటి.. ముంబయికి తిరిగొచ్చిన ఓజీ.. ఓమిని ఢీకొని గెలిచాడా.. అన్ని సమస్యలనూ పరిష్కరించాడా.. అన్నది మిగతా కథ.
కథనం, విశ్లేషణ: ఒక సగటు అభిమాని కోణంలో పవన్ నుంచి ది బెస్ట్ రాబట్టుకోవడానికి దర్శకుడు సుజీత్ ఏం చేయాలో అంతా చేశాడు. జపాన్ నేపథ్యం తీసుకుని సమురాయిల శిక్షణలో రాటుదేలిన కుర్రాడిగా హీరో పాత్రను కాస్త భిన్నమైన నేపథ్యంతో మొదలుపెట్టి సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించాడు సుజీత్. పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ తరహా ట్రీట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఓజి సినిమా మంచి విందు భోజనం లాంటిదని చెప్పవచ్చు. సినిమాలో సత్యా దాదా కుటుంబానికి ఓజీ దూరం కావడం, అజ్ఞాతంలో అతను గడిపిన జీవితం, భార్యతో అనుబంధం, కూతురు కోసం పరితపించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఆద్యంతం ఎన్నో మలుపులు తిరుగుతూ ఈ చిత్రం ప్రేక్షకులను మైమరపించింది.
1993లో ముంబయినగరాన్ని కుదిపేసిన బాంబు పేలుళ్లను సంఘటనను జ్ఞప్తికి తెచ్చేలా ఈ కథను సుజీత్ అద్భుతంగా రాసుకున్నాడు. ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ తన అద్భుత నటన, భారీ పోరాటాలతో అభిమానులను మైమరిపించాడు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. తమన్ అద్భుతమైన ఆర్.ఆర్.తో కట్టి పడేశాడు. పవన్ కళ్యాణ్ తో చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు మించి పోయేలా నేపథ్య సంగీతం అందించాడు. మొత్తానికి యాక్షన్ సన్నివేశాలు, విభిన్నమైన భావోద్వేగాలతో ‘ఓజీ’ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించి సరికొత్త అనుభూతిని కలిగించింది.
Also Read: ఫ్యాన్స్‌కు పండగే.. OG యూనివర్స్‌లోకి ప్రభాస్!