Sunday, April 28, 2024

కారికేచర్ల సిద్ధహస్తుడు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ కార్టూనిస్ట్, చిత్రకారుడు అజిత్ నైనన్ మాథ్యూ సెప్టెంబర్ 8న మైసూరులో మరణించారు. చిన్ననాటి నుండి ఆయనకు చిత్రకళపై ఎంతో ఆసక్తి ఉండేది. అయిదేళ్ల వయసులోనే స్కూల్లో మొదటి కార్టూన్ వేశారు. ఇంత అభిరుచి ఉన్నా బిఎ, ఎంఎ చదివే రోజుల్లో ఆయనకు ఐఎఎస్ కావాలనే లక్ష్యమే ఉండేదట. అయినా చదువు, చిత్ర రచన ఏకకాలంలో సాగేవి. నలుగురితో మాట్లాడుతున్నప్పుడు కూడా సంభాషణ ముగిసాక ఆయన చేతిలో ఒకరి క్యారికేచర్ లేదా చర్చించిన టాపిక్ పై ఓ కార్టూన్ ఉండేదట. కాలేజీలో చేరినప్పుడు తన సీనియర్లు ర్యాగింగ్‌కి వస్తే వారి క్యారికేచర్లు వేసి తప్పించుకునేవాడట. అయితే దేశంలో ఎమర్జెన్సీ (1975- 77) తరవాత ఆయన ఆలోచన మారింది. మన దేశ రాజకీయ పరిస్థితులే ఆయనను కుంచె పట్టి నిలదీయాలనే ఆలోచనకు పురికొల్పాయి. తన బంధువుల్లాగా ఉన్నతాధికారి కావాలనుకున్న ఆలోచన వదిలేసి 1980లో ‘ఇండియా టుడే’ లో కార్టూనిస్టుగా చేరిపోయారు. అంతకు ముందు చెన్నైలో కార్టూన్ల ద్వారా వ్యాపార ప్రకటనలు వేసేవారు.

అలా చిత్రకారుడిగా మొదలైన ఆయన జీవితమంతా పెన్ను, పెన్సిల్, కాగితంతో ముడిపడి సాగింది. ‘ఇండియా టుడే’లో ఉన్నప్పుడు వారి మూడు పత్రికలకు ఆయనే కార్టూన్లు వేసేవారు. ‘ఇండియా టుడే’లో ‘సెంటర్ స్టేజ్’ అనే ఎడిటోరియల్ కార్టూన్ వేసేవారు. ‘ఇండియా టుడే’ గ్రూప్ నుండి టార్గెట్ అనే ఇంగ్లీష్ మాసపత్రిక 1979 నుండి 1995 దాకా వచ్చింది. పిల్లల పత్రిక అయిన ‘టార్గెట్’ కోసం డిటెక్టివ్ మూచ్ వాలా, ఆయన కుక్క పుచ్ అనే పాత్రలతో కామిక్ స్ట్రిప్ సృష్టించారు. అవెంతో ప్రాచుర్యం పొందాయి. ‘ఇండియా టుడే’ తో ఆయన అనుబంధం ముప్పై ఏళ్ళు. ఆ పత్రిక కోసం వేల కొద్దీ కార్టూన్లు, ఇల్లస్ట్రేషన్లు వేశారు. ఆఫీసుకు రావడంతోనే మొదట పని పూర్తి చేయడం ఆయనకు అలవాటు. ఇండియా టుడే సంపాదక సిబ్బందిని కలిపి ఒకే బొమ్మగా వారి విధుల ఆధారంగా సంగీత కచేరి ఇస్తున్నట్లు వేసిన క్యారికేచర్ ఆయన సృజన కళకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ లో చేరాక ‘నైనన్స్ వరల్డ్’, ‘జస్ట్ లైక్ దట్’ అనే పాకెట్ కార్టూన్ వేసేవారు.‘ఇండియా టుడే’ తర్వాత ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘అవుట్ లుక్’, ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’లలో పని చేశారు.

2009 ఎన్నికల సందర్భంలో పోలిట్రిక్స్ అనే కార్టూన్ సిరీస్‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో కొనసాగించారు.
రాజకీయ నేతల కారికేచర్లు వేయడంలో అజిత్ కుంచె ఆరితేరిందనవచ్చు. రైలు ఇంజిన్ నుండి కప్పల దాకా ఆయన రాజకీయ నాయకుల ముఖాలుగా చిత్రించారు. వస్తువుల్లో, జంతువుల్లో రాజకీయ నేతల ముఖాల పోలికలు పసిగట్టడంలో అజిత్ నైనన్ నేర్పరి. రైల్వే బడ్జెట్ రోజు ఆర్థిక మంత్రి రైలింజిన్ ముఖంతో దూసుకుపోయినట్లు, బుల్డోజర్ రూపంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ఓ బిల్డింగ్‌ను కూల్చేస్తున్నట్లు గీయడం ఆయనకే చెల్లింది. ప్రధాని మోడీ పెదాల చుట్టూ వచ్చే తెల్లగడ్డం, కళ్ళజోడును బుల్‌గా, బుల్డోజర్‌గా మార్చిన బ్రష్ పవర్ ఆయనది. ఏ వస్తువుగానైనా మార్చడానికి సౌకర్యంగా ఉండే మోడీ ముఖాన్ని రకరకాల హావభావాలతో ఇరవై ఐదు రకాలుగా గీసి తన ‘ఫేస్ బ్యాంక్’ ఫోల్డర్‌లో పెట్టుకున్నారట. పది మంది ప్రధాన మంత్రుల బొమ్మలేసిన ఆయన పివి బొమ్మ వేయడానికి ఇష్టపడేవారట. ఎప్పుడైనా ఏదైనా స్టోరీకి సంబంధించిన ఫొటోలు పత్రికకు సమయానికి అందకున్నా, సరిపోకున్నా తన బొమ్మలతో ఆ స్థానాన్ని పూరించి వ్యాసానికి నిండుదనం తెచ్చేవారు.

‘నిత్యజీవితంలో హాస్యాన్ని పట్టుకో.. లేదంటే సొంతంగా సృష్టించు’ అనేది ఆయన ఆచరించిన సూత్రం. వీలు చిక్కినప్పుడు బస్సుల్లో ప్రయాణించి తోటివారి ముఖాలను పరిశీలించేవారట. మనుషుల ముఖాల గురించి ప్లాస్టిక్ సర్జన్ కన్నా ఎక్కువగా పరిజ్ఞానమున్నవాడుగా ఆయన గుర్తించబడ్డారు. ముఖ కవళికలు కాకుండా ఆ ముఖం వెనకాల గల ఆలోచనలు కూడా ఆయన వేసిన బొమ్మలో ప్రస్ఫుటమవుతాయి. ఎలాంటి వివరణలు, మాటలు అవసరం లేకుండా ఆయన కార్టూన్లే మాట్లాడుతాయి. న్యూరోసర్జన్ కన్నా మనుషుల మెదళ్ల గురించి నైనన్‌కు ఎక్కువ తెలుసనీ జెజె ఆర్ట్ కాలేజీ ప్రొఫెసర్లు స్టూడెంట్స్‌కి చెప్పేవారు. రాజకీయ నాయకులతో పాటు సామాన్యుల జీవితాలు, ఒత్తిడి, ఇబ్బందులు, ఇంటి ఖర్చులు, పిల్లల పెంపకం లాంటి వి ఆయన కార్టూన్ల వస్తువులుగా ఉండేవి.గీత ధర్మరాజన్ రాసిన బెస్ట్ సెల్లర్ ‘మై బిగ్ బుక్ ఆఫ్ గర్ల్స’ అనే పుస్తకంలోని బొమ్మలు నైనన్ వే. ఆమె రాసిన ‘ఏ ట్రిక్ ఆన్ టిప్పు’ అనే పంచతంత్రం లాంటి పిల్లల కథల బొమ్మల సిరీస్ పుస్తకాలకు కూడా చిత్రాలు వేశారు. వాటిలో వన్య మృగాల హావభావాలను అద్భుతంగా పండించారు.

1990 దశకం చివర్లో ఢిల్లీలోని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ ఆఫీసు మీదుగా వెళ్లేవారు కొద్దీ సేపు దాని ముందు ఆగి అక్కడున్న పెయింటింగ్‌ను చూసి వెళ్లేవారట. ఒక పెద్ద చెట్టుపై వాలిన పక్షులు, ఒక్కో పక్షి ముఖంలో ఒక్కో ఉద్యోగి పోలికలు ఆ చిత్రంలో ఉండేవట. దానిని అజిత్ నైనన్ వేసిచ్చారు. గత ఏడాది బెంగళూరులోని ఐఐసి వారు ఆయనకు బర్తాన్ లైఫ్ టీం అచివ్‌మెంట్ అవార్డు ఇచ్చారు. 1987 లో సామాజిక సేవకు బహుకరించే సంస్కృతి అవార్డు ఆయనకు లభించింది. ఐసిసిఆర్ తరఫున దేశ కళాకార ప్రతినిధిగా ఆఫ్రికా సందర్శించారు. ప్రముఖ కార్టూనిస్టు అబూ అబ్రహంకు అజిత్ మేనల్లుడు. ఇటీవలే ఢిల్లీని వదిలేసి మైసూర్‌లో స్థిరపడ్డ ఆయన 69 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి చెందారు. చిత్రకళపై పట్టు సాధించి రకరకాల బొమ్మలు వేయడం వేరు, సామాజిక స్పృహతో రాజకీయ విమర్శ కోసం కుంచెను అంకితం చేయడం వేరు. అజిత్ నైనన్ ప్రజా జీవనాన్ని బొమ్మల్లో ప్రదర్శించిన ప్రజాస్వామ్య పక్షపాతి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News