Saturday, April 27, 2024

పాకిస్థాన్ గెలిచిందోచ్..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ప్రపంచకప్‌లో వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. మంగళవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ మైదానంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఏడు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. పాక్‌కు ఇది ఈ టోర్నీలో మూడో విజయం. మరోవైపు బంగ్లాదేశ్ వరుసగా ఆరో ఓటమిని మూటగట్టుకుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. అయితే పాకిస్థాన్ బౌలర్లు అసాధరణ రీతిలో చెలరేగడంతో బంగ్లా ఇన్నింగ్స్ 45.1 ఓవర్లలో కేవలం 204 పరుగుల వద్దే ముగిసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 32.3 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

శుభారంభం..
ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫిక్, ఫకర్ జమాన్‌లు శుభారంభం అందించారు. ఇద్దరు బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటు షఫిక్ అటు ఫకర్ ధాటిగా ఆడడంతో స్కోరు వేగంగా పరిగెత్తింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన షఫిక్ 69 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు.

మరోవైపు ఫకర్ అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగి పోయాడు. బంగ్లా బౌలర్లను హడలెత్తించిన ఫకర్ జమాన్ వరుస సిక్సర్లతో అలరించాడు. అతన్ని కట్టడి చేయడంలో బంగ్లా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. చెలరేగి ఆడిన ఫకర్ జమాన్ 74 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, 3 బౌండరీలతో 81 పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. అయితే వికెట్ కీపర్ రిజ్వాన్ 26 (నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ 17 (నాటౌట్) మెరుగైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్‌కు ఘన విజయం సాధించి పెట్టారు. ఈ గెలుపుతో పాకిస్థాన్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

చెలరేగిన షహీన్..
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పాక్ బౌలర్లు సఫలమయ్యారు. స్టార్ బౌలర్ షహీన్ అఫ్రిది ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికే బంగ్లా వికెట్‌ను తీశాడు. తంజీద్ హసన్ (0)ను షహీన్ ఔట్ చేశాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న తంజీద్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తర్వాతి ఓవర్‌లో షహీన్ మరో వికెట్‌ను పడగొట్టాడు. వన్‌డౌన్లో వచ్చిన నజ్ముల్ హుస్సేన్ షాంటోను అతను వెనక్కి పంపాడు. నజ్ముల్ 4 పరుగులు మాత్రమే చేశాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ ముష్ఫికుర్ రహీం (5) కూడా ఔటయ్యాడు. అతన్ని హారిస్ రవూఫ్ పెవిలియన్ పంపించాడు.

దీంతో బంగ్లాదేశ్ 23 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఓపెనర్ లిటన్ దాస్, మహ్మదుల్లా అద్భుత బ్యాటింగ్‌తో వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన దాస్ 6 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. ఇక మహ్మదుల్లా ఆరు బౌండరీలు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు సాధించాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన షకిబ్ అల్ హసన్ 4 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. మెహదీ హసన్ మీరాజ్ (25) తనవంతు పాత్ర పోషించాడు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది, వసీం జూనియర్ మూడేసి వికెట్లు తీశారు. హారిస్ రవూఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News