Sunday, May 5, 2024

పట్టణ ప్రగతిలో అన్ని మున్సిపాలిటీలకు రూ.2,734.84 కోట్లు

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే 85 శాతం నిధులను ఖర్చు చేసిన అధికారులు
ప్రతి నెలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.112 కోట్లు
గ్రీన్‌బడ్జెట్ కింద 10శాతం నిధులు అదనంగా కేటాయింపు


మనతెలంగాణ/హైదరాబాద్:  పట్టణాలను సుందరంగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు ప్రభుత్వం తలపెట్టిన పట్టణ ప్రగతి మంచి ఫలితాలు ఇస్తోంది. పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని మున్సిపాలిటీలకు కలిపి రూ.2,734.84 కోట్లు విడుదల కాగా, ఇందులో 85 శాతం నిధులను ఇప్పటికే ఖర్చు చేశారు. ప్రభుత్వం ప్రతి నెలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.112 కోట్లను విడుదల చేస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీల సంఖ్య 68 నుంచి 142కు, వార్డుల సంఖ్య 2,369 నుంచి 3,618కి పెరిగింది. వీటిలో మున్సిపాలిటీలు 62 నుంచి 129కి, కార్పొరేషన్లు 6 నుంచి 13కు పెరిగాయి. దీంతోపాటు అదనంగా గ్రీన్‌బడ్జెట్ కింద 10 శాతం నిధులను కేటాయిస్తున్నారు. వచ్చే నెల 03వ తేదీ నుంచి జరగనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు మరింత అభివృద్ధి చెందుతాయని పురపాలక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పట్టణాల అభివృద్ధికి రూ.67,500 కోట్లు

2020 అక్టోబర్ నాటికి పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.67 వేల కోట్లు వెచ్చించగా, ఎస్‌ఆర్డీపి కింద రూ.6వేల కోట్లను వెచ్చించారు. హెచ్‌ఎండిఏ పరిధిలో మొదటిదశలో రూ.858 కోట్లతో నాలాలను పటిష్టం చేశారు. దీంతోపాటు గండిపేట చెరువు నిర్మించి వందేండ్లు పూర్తవుతున్న సందర్భంగా రూ.36.5 కోట్లతో అభివృద్ధి చేశారు. వీటితో పాటు ఔటర్ చుట్టూ ఎల్‌ఈడీ లైట్లు, రూ.387 కోట్లతో సర్వీసు రోడ్లను విస్తరిస్తున్నారు.

పట్టణాల్లో వినూత్న కార్యక్రమాలు

ఆపరి శుభ్రత లేకుండా ఆరోగ్యంగా జీవించేందుకు పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణాల్లో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. వెయ్యిమందికి ఒక టాయిలెట్ చొప్పున ఇప్పటివరకు 15వేల టాయిలెట్లు నిర్మించారు. వివిధ పట్టణాల్లో 37లక్షల చెత్తబుట్టలు, హైదరాబాద్‌లో తడిచెత్త, పొడి చెత్త సేకరణ కోసం 44 లక్షల చెత్తబుట్టలను పంపిణీ చేశారు. గతంలో 3,400 టన్నుల చెత్తసేకరణ జరిగేది. ప్రస్తుతం 6,500 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. కొత్తగా 2,200 స్వచ్ఛఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏ రాష్ట్రంలో చేయని విధంగా 100శాతం సీవరేజీ ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్‌లో ఉత్పత్తయ్యే 1,600 ఎంఎల్‌డిల మురుగునీటి నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.3,866 కోట్లను కేటాయించింది. దక్షిణభారతంలోనే అతిపెద్ద మొట్టమొదటి వేస్ట్ టు ఎనర్జీప్లాంట్‌ను మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో ప్రభుత్వం ఏర్పాటుచేయడంతో పాటు అక్కడ ఇప్పటికే 20 మెగావాట్ల ప్లాంట్‌ను ప్రారంభించి మరో 20 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటు ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. దీనికి కేంద్ర పర్యావరణ శాఖ సైతం అనుమతులు మంజూరుచేసింది. దుండిగల్లో మరో 15 మెగావాట్ల సామర్థ్యంగల ప్లాంట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.

ప్రత్యేక ప్రోత్సాహం కింద 54,776 మంది కార్మికులకు

కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమంలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి జీహె చ్‌ఎంసీ పరిధిలో రూ. 7,500 చొప్పున, ఇతర పురపాలక సంఘాల్లో రూ.5,000ల చొప్పున మొత్తం రూ.71.38 కోట్లు, ప్రత్యేక ప్రోత్సాహం కింద 54,776 మంది కార్మికులకు ప్రభుత్వం అందించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కో కార్మికుడికి వర్కర్ వెల్ఫేర్ కింద రూ.4,800 విలువైన కిట్ ను ఇవ్వడంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.11 కోట్లు, ఇతర మున్సిపాలిటీల్లో మరో రూ.7-8 కోట్లు దీని కోసం ప్రభుత్వం ఖర్చుచేసింది. ప్రతి నెలా కార్మికులకు రూ.12 వేలు తగ్గకుండా వేతనాలు అందించడంతో పాటు ఈఎస్‌ఎస్‌ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది.

పట్టణాల్లో కొత్తగా 18.45 లక్షల కొత్త కనెక్షన్లు

ఎల్‌ఈడీ లైట్లు ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర నగరాల్లోనూ ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏడాదికి హైదరాబాద్‌లో రూ.130 కోట్లు, ఇతర మున్సిపాలిటీల్లో రూ.81 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నాయి. పట్టణంలోని ప్రతి ఇంటికి నల్లా నీటిని అందించేందుకు అర్భన్ మిషన్ భగీరథలో రూ.5,978 కోట్లు, జిహెచ్‌ఎంసిలో విలీన మున్సిపాలిటీల్లో రూ.3,285 కోట్లు కోట్లతో ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటినందించేకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నగరం విస్తరిస్తుండడంతో మిగిలిపోయిన కాలనీలకు నీళ్లందించేందుకు రూ.1,200 కోట్లను ఇప్పటికే మంజూరు చేయగా రూ.4,700 కోట్లతో కేశవాపూర్ రిజర్వాయర్, రూ.1,450 కోట్లతో సుంకిశాల నుంచి మరో పైపులైన్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. రాష్ట్ర ఆవిర్భవానికి ముందు పట్టణాల్లో 11.40 లక్షల నల్లా కనెక్షన్లు ఉంటే కొత్తగా 18.45 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చారు. దీంతోపాటు పేదవారికి రూపాయికే నల్లా కనెక్షన్, మిగతా వారికి రూ.100లకే ఇస్తూ ఇంటింటికి త్రాగునీరు అందించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతోంది. వచ్చేనెల 03వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరగనున్న పట్టణ ప్రగతి మరోసారి పట్టణాల అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News