తెలంగాణ అస్తిత్వం సృజన రంగం -7 ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలు పెట్టాం. అందులో భాగంగా ఈ సారి ప్రముఖ సాహితీవేత్త, కవి, రాజకీయ విశ్లేషకులు, వీక్షణం పత్రిక సంపాదకులు ఎన్.వేణుగోపాల్ అభిప్రాయాలు ఈ వారం మెహఫిల్లో.
తెలంగాణ అస్తిత్వం అన్న మాటకి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి?
అస్తిత్వం అనేది తన గురించి తనకు ఉండే గుర్తింపు, అదే సమయంలో తన గురించి ఇతరులకు ఉండే గుర్తింపు, ఇతరుల నుంచి తాను కోరుకునే గుర్తింపుల సమ్మేళనం కూడా. ‘అస్తిత్వం, ఉనికి అనేది ఏకైకమూ, సార్వకాలికమూ కాదు’. మనిషికైనా, సమాజానికైనా ఉండే అనేక అస్తిత్వాలలో ఆయా స్థల కాలాలను బట్టి ఒక అస్తిత్వం ప్రధానంగా ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం అంటే ఇప్పటివరకూ, ప్రధానంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వల్ల, ఈ ప్రాంతంలో పుట్టుక అనే అర్థం రూఢీ అయింది. ప్రాదేశికత కీలకమైనదే అయినప్పటికీ, అస్తిత్వం ఒక స్థలంలో పుట్టుకకు పరిమితం చెయ్యగలిగినది కాదు.
తెలంగాణలో పుట్టినవారందరూ తెలంగాణ అస్తిత్వం ఉన్నవారు కాదు తెలంగాణలో పుట్టని వారికి కూడా తెలంగాణ అస్తిత్వ స్పృహ ఉండవచ్చు. తెలంగాణ ప్రాంతపు చరిత్రను, సంస్కృతిని, సాహిత్యాన్ని, కళలను గౌరవించే, తమవిగా భావించే, తెలంగాణ ప్రజా జీవన అభ్యున్నతిని కోరుకునే దృక్పథాన్ని నేను తెలంగాణ అస్తిత్వంగా భావిస్తాను.
సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో ఆ అస్థిత్వ, ప్రతిఫలం, ప్రయోజనం, విస్తృతి ఎలా ఉంది? ఎలా ఉండాలి అని మీరు అనుకుంటారు?
Also Read : ప్లాన్ బీ అవసరమే!
అసలు ప్రాంతీయ అస్తిత్వం అన్నప్పుడే మనం ఒక వైరుధ్యంతో వ్యవహరిస్తున్నాం. ఒక ప్రాంతంలో ఉన్న సమాజం అంతరాల సమాజం అయినప్పుడు ఆ ప్రాంతానికంతా వర్తించే ఉమ్మడి అస్తిత్వం అనే మాటను జాగ్రత్తగా వాడాలి. ఆ జాగ్రత్త చెపుతూనే, తెలంగాణ అస్తిత్వం అనబడేది ఉంది. వెయ్యి సం వత్సరాల సామాజిక చరిత్రలో అది మంచి బతుకు కోసం తండ్లాట, ఆ తండ్లాట నుంచి వికసించే ఆత్మగౌరవం, ధిక్కారం అనే కొన్ని ధాతువుల సమాహారంగా చూడవచ్చు. ఆ ధాతువులు ఏదో ఒక స్థాయిలో ప్రతిఫలించే సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాల అభివ్యక్తిని అస్తిత్వ చైతన్యం అనవ చ్చు. అది విస్తారంగా ప్రవహించిన కాలాలూ ఉన్నాయి. ఎండిపోయి సన్నటి ధారగా ప్రవహించిన కాలాలూ ఉన్నాయి. ఆ అస్తిత్వ చైతన్య ప్రవా హం ఎప్పుడూ ఒకే లాగా ఉంటుందని అనుకోలేం. దాన్ని పరిమాణంతో లెక్కించడం కాక, గుణంతో లెక్కించాలి. అంటే ప్రజల మధ్య ఐక్యతనూ, ఆత్మగౌరవాన్నీ, చైతన్యాన్నీ, ఆధిపత్యం పట్ల ధిక్కారా న్నీ, సామాజిక న్యాయాన్నీ ప్రతిఫలించే విధంగా ఉండాలి.
తెలంగాణ ఏర్పాటు అనంతరం సృజన రంగంలో తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకి, విస్తరణకి చోటు దొరి కిందా? ఎలాంటి నూతన మార్పులు జరిగాయి అని అనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమ స్వభావం వల్ల, దాని నాయక త్వ వర్గ స్వభావం వల్ల అసలు తెలంగాణ అస్తిత్వం అనే మాటకే విశాల, ప్రగతిశీల అర్థం చెప్పుకోలేదు. అప్పటి ఉద్యమ అవసరాల రీత్యా పుట్టుకకు ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆ మాత్రం సంకుచిత అర్థంలో కూడా అస్తిత్వ పరిరక్షణ, విస్తరణ జరగలేదు. ప్రధానంగా రాజకీయ, ఆర్థిక, చారిత్రక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో విశాలంగా జరగవలసిన కృషి బదులు, కేవలం సాంస్కృతిక రంగంలో పరిమిత అర్థంలో కొన్ని పనులు మాత్రమే జరిగాయి.
కొన్ని పండుగలకు, కొన్ని ఆహార పదార్థాలకు ప్రాధాన్యత పెరగ డం, కొన్ని రకాల భాషా వ్యవహారాలకు, కొన్ని చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ చిహ్నాలకు అధికారిక స్థానం దొరకడం వంటి స్వల్పమైన మార్పు లు జరిగాయి గానీ, జరగవలసిన పనితో పోలిస్తే అది చాలా చాలా తక్కువ. మరీ ముఖ్యంగా గ్లోబలీకరణ అనంతర పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సృజన రంగంలో, ఎంతో వేగవం తంగా, వివిధ రకాల సంస్కృతుల కలగలుపు జరు గుతున్న స్థితి ఉంది. తెలంగాణా స్వీయ అస్తిత్వేతర సంస్కృతులు, సాహిత్య, కళా రంగాల నుండి మంచి ని తెలుసుకోవడం, నేర్చుకోవడం, సృజనాత్మక రంగా ల్లో సమ్మిళితం చేసుకోవడం అవసరమని అనుకుం టున్నారా?
ఎప్పుడైనా ఆదాన ప్రదానాల ద్వారానే సాంస్కృతిక వికాసం జరుగుతుంది. అవతలి సంస్కృతిలో స్వీకరించగలిగిన మంచిని తెలుసుకోవడం, నేర్చుకోవడం, స్వీయ సంస్కృతిలో సమ్మిళితం చేసుకోవడం ఒక అనివార్యమైన, అవసరమైన పని. తెలంగాణ సంస్కృతిలో అటువంటి మార్పులూ, చేర్పు లూ ఎన్నో ఉన్నాయి. ఉద్యమ క్రమంలో అస్తిత్వానికి పరిమిత అర్థం చెప్పుకున్నందు వల్ల ఈ ఆదాన ప్రదానాలు జరగవలసినంతగా జరగలేదేమో. ప్రపంచీకరణ దూకుడు, ఒత్తిడి వల్ల కొత్త సాంస్కృతిక అంశాలు బలవంతం మీద వచ్చి చేరాయేమో. ఈ సమ్మేళనాన్ని ఆపడమూ కుదరదు, బలవంతం గా వచ్చిపడడాన్ని అంగీకరించడమూ సరైనది కాదు. ఆహ్వానించే, స్వీకరించే వైశాల్యం, పరిశీలిం చి, అవసరమైనదాన్ని మాత్రమే అంగీకరించే సమ్యగ్ దృక్పథం కావాలి.
తెలంగాణా అస్థిత్వం, సంస్కృతి పరిరక్షణ కోసం నిర్దిష్టంగా మీరు చేసే సూచనలు ఏమిటి?
మొట్టమొదట, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి విశాలమైనవని, వాటికి చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సామాజిక పునాది ఉంటుందని, అన్ని రంగాల్లోనూ పరిరక్షణ కృషి జరగాలనే స్పృహ ఉండాలి. చరిత్ర పొడవునా ఉన్న ఆ అస్తిత్వ, సంస్కృతీ చిహ్నాలలో ప్రజానుకూల, ప్రగతిశీల అంశాలను వేరు చేసి, వాటిని అభివృద్ధి చేయాలి. ఆ అస్తిత్వ, సంస్కృతీ చిహ్నాలలో వర్గ సమాజం, కుల అసమానతలు, మత మౌఢ్యం, భూస్వామ్య సంస్కృతి, వలసవాద ఆధునికత ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక, అభివృద్ధి నిరోధక అంశాలు ఉండే అవకాశం ఉందనే ఎరుకతో, వాటిని జాగ్రత్తగా పరిహరించాలి. సంస్కరించదగిన వాటిని సంస్కరించాలి. చరిత్ర, భాష, సాహిత్య, కళా, నిత్య జీవిత వ్యవహారాలలో తెలంగాణ అస్తిత్వ, సంస్కృ తీ చిహ్నాలను అన్వేషించి, పరిశోధించి, ప్రచారం లో పెట్టి, ఆ చిహ్నాలను గౌరవించడం, వినియోగించడం జాతి అస్తిత్వ ఆత్మగౌరవ స్థాపనలో ఎట్లా అంతర్భాగమో ప్రతి ఒక్కరికీ తెలిసేట్టు చేయాలి.