Wednesday, May 8, 2024

పెంచే వారినే కాటేసే ఉగ్రవాదం

- Advertisement -
- Advertisement -
PM Modi addresses the 76th session of UNGA
నాడు రైల్వేస్టేషన్‌లో చాయ్ అమ్మాను
ఇప్పుడు మీ ఎదుట నిలిచి ప్రసంగిస్తున్నాను
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం 76వ సభలో ప్రధాని మోడీ
కొన్ని దేశాలు ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాయి
వాటి తిరోగమన ఆలోచన
విధానం ప్రపంచానికి ముప్పు
తెస్తున్నది ఉగ్రవాదాన్ని అవి
రాజకీయ ఆయుధంగా
వాడుకుంటున్నాయి
అఫ్గాన్‌లో పరిస్థితిని ఏ
దేశమూ స్వప్రయోజనాలకు
వాడుకోరాదు

న్యూయార్క్ (ఐరాస వేదిక నుంచి ): ప్రస్తుత ప్రపంచంలో కొన్ని దేశాల తిరోగమన ఆలోచనా విధానం శాంతిభద్రతలకు విఘాతం అయిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి 76వ సర్వసభ్య సమావేశంలో శనివారంభారత ప్రధాని ప్రసంగించారు. కొన్ని దేశాలు ప్రమాదకర రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయి. ఇది ఎంతటి ప్రమాదకర అస్త్రమనేది ఆయాదేశాలకు తెలిసిరావడం లేదని ప్రధాని మోడీ పరోక్షంగా పాకిస్థాన్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యానించారు. తమ ఉనికి కోసం ఉగ్రవాదాన్ని వాడుకుంటున్న దేశాలకు చివరికి ఈ ఉగ్రవాద శక్తే పిడుగుపాటుగా దెబ్బతీస్తుందనే అంశం అర్థం చేసుకోవాలని సూచించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ పొరుగుదేశాలలో కల్లోలానికి ఊతం అందించే దేశాలు ఉగ్రవాదం ప్రమాదకరమైన పాము అంతకు మించినదనే విషయం తెలిసివస్తే మంచిదని తెలిపారు.

టెర్రరిస్టులకు సాయం అందిస్తూ పాకిస్థాన్ దుష్ట పన్నాగాలకు దిగుతోందని భారత్ ఇతర పొరుగుదేశాలు తరచూ విమర్శిస్తోన్న విషయం తెలిసిందే. అఫ్ఘనిస్థాన్‌లో పరిస్థితి గురించి ప్రధాని ప్రస్తావించారు. అక్కడి సునిశిత, సంక్లిష్ట స్థితిని ఏ దేశం కూడా తన స్వార్థానికి వాడుకోరాదని దీని వల్ల అందరికీ నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేశారు. ఒక దేశ వాతావరణాన్ని తమ అనుకూలతకు వినియోగించుకోవాలనుకోవడం స్వార్థాన్ని మించిన రాజకీయ ప్రాబల్యపు రాక్షసత్వం అవుతుందని తెలిపారు.

తిరోగమనవాదులతో పలు సవాళ్లు

పురోగామ ప్రపంచానికి ఇప్పుడు తిరోగమన ఆలోచనలు తీవ్రవాదం సవాలుగా మారాయి. పలు ఇతర సమస్యలతో ప్రపంచం ముందుకు సాగని స్థితి ఉండగా , మానవ వక్రబుద్థితో తలెత్తే పరిణామాలు మనిషి ముందుకు సాగలేని అగాధాలకు దారితీస్తున్నాయని ప్రధాని ఈ కీలక సర్వసభ్య భేటీలో తెలిపారు. ప్రపంచం అంతా కూడా శాస్త్రీయ దృక్పథంతో అంతకు మించి హేతువాదపు , అభ్యుదయపు ఆలోచనలతో ఉండాలి. ఇదే ప్రగతికి ప్రాతిపదిక అవుతుంది. అయితే ఇందుకు విరుద్ధమైన ఆలోచనలు సంబంధిత వేదికలు బలోపేతం కావడం బాధాకరం అన్నారు. భారత్ ఎప్పుడూ ప్రపంచం పట్ల నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. శాస్త్రీయ ప్రాతిపదిక దృక్పథం, అనుభవాల సారపు అధ్యయనంతో కూడిన విధానాలను సృష్టించుకొంటోందని తెలిపారు. అఫ్ఘనిస్థాన్ ప్రాంతం ఘర్షణలు, ఉగ్రవాదం, ఆత్మాహుతి దాడులు , విషబీజాల ప్రచారానికి నెలవు కాకుండ చూసుకోవల్సి ఉందన్నారు. ఈ విధంగా అంతా అఫ్ఘనిస్థాన్ పట్ల బాధ్యతాయుతంగా ఉండటం అత్యవసరం అన్నారు.

ప్రజాస్వామ్య మాతకు ప్రతినిధిని నేను

ప్రపంచంలోనే భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదనే పేరు ఉంది. ఈ ఘననీయ ప్రజాస్వామిక దేశానికి తాను ఈ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఐరాస వేదికపై ప్రధాని మోడీ ఉద్ఘాటించారు. పలు కాల పరీక్షలకు నిలిచి భారతదేశం ప్రజాస్వామిక కీలక దేశం అయిందని, ఇక్కడ అందరికి సమ అవకాశాలు ఉన్నాయని ప్రధాని తెలిపారు. రైల్వే స్టేషన్‌లో ఛాయ్ అమ్మిన తాను ఇప్పుడు దేశానికి ప్రధాని అయి కీలక స్థానంలో నిలిచి ఇక్కడ ప్రతినిధిగా వచ్చానని తెలిపారు. భారతదేశపు ప్రజాస్వామ్యానికి ఉన్న ఘనత ప్రపంచ ప్రఖ్యాతం అన్నారు.

భారత్‌కు ఉన్న ప్రజాస్వామిక ఘననీయ సాంప్రదాయం ఇప్పటిది కాదు వేలాది సంవత్సరాల కిందటిది అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రపు 75వ ఏడాదిలోకి వచ్చిందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యమే ప్రాణప్రదంగా సాగుతోందన్నారు. దేశపు వైవిధ్యమే పటిష్ట ప్రజాస్వామ్యపు భారత్‌కు ముఖచిత్రం అంతకు మించిన గుర్తింపు అన్నారు. ప్రభుత్వ సారధ్యపు బాధ్యతల్లో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రధాన మంత్రిగా తన ప్రజా సేవ అనుభవానికి త్వరలోనే 20 సంవత్సరాల ప్రాయం వస్తుందని ప్రధాని సభికులకు తెలిపారు. గుజరాత్‌కు ఎక్కువ కాలపు సిఎంగా , ఏడేళ్లుగా దేశ ప్రధానిగా ఉంటూ వస్తున్నానని ప్రధాని తెలియచేసుకున్నారు.

ఐరాస విశ్వసనీయత పెరిగితేనే ఔచిత్యత

కాలానికి అనుగుణంగా ఐరాస తన విశ్వసనీయతను ఇనుమడింపచేసుకోవాలి. సవాళ్లపై తగు విధంగా స్పందించాలి. సమర్థతను చాటుకుని తీరాలి. దీని వల్లనే విశ్వసనీయత పెరిగి, ఈ వేదిక ఔచిత్యత నిలుస్తుందన్నారు. ప్రాపంచిక సమాజ భద్రత, చట్టాలు, విలువల పరిరక్షణకు ఈ ప్రపంచ వేదిక రక్షణ కవచం అయితే అదే విశ్వశాంతికి వీలు కల్పిస్తుందన్నారు.

వ్యాక్సిన్ తయారీదార్లు భారత్‌కు రండి

కరోనా వైరస్ కట్టడితో వైరస్ తయారీలో భారతదేశం అపార అనుభవంతో నిలిచిందని, ఉత్పత్తి సామర్థం ఎక్కువగా ఉన్న ఇండియాకు ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ల తయారీదార్లు ముందుకు రావాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. కోవిడ్ మృతులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. భారతదేశం ఇప్పుడు టీకాల తయారీలో దేశీయ అవసరాలకు తగురీతిలో ముందుంది . ఆది నుంచి అవసరం అయిన దేశాలకు కరోనా టీకాలను అందిస్తూ వస్తోందని, ఈ టీకా సాయానికి భారత్ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News