Sunday, April 28, 2024

ప్రధాని మోడీ మహిళా దినోత్సవ కానుక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు మరి కొద్ది వారాలలో జరగనున్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు శుభవార్త చెప్పింది. ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వంటగ్యాసు సిలిండర్‌పై (ఎల్‌పిజి) రూ. 100 తగ్గిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. తగ్గిన ధర శుక్రవారం అర్ధరాత్రి(తెల్లారితే శనివారం) నుంచి అమలులోకి రానున్నది. 14.2 కిలోల సబ్సిడీ రహిత ఎల్‌పిజి సిలిండర్ ధర దేశ రాజధానిలో రూ. 803గా ఉండనున్నది. స్థానిక పన్నుల దృష్టా ఎల్‌పిజి సిలిండర్ ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండనున్నది.

అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గిన కారనంగా ఎల్‌పిజి సిలిండర్ ధరను కేంద్రం తగ్గించింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలలో మాత్రం ఎటువంటి మార్పును కేంద్రం ప్రకటించలేదు. గడచిన 23 నెలలుగా వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి. దేవమంతటా ప్రజలు ప్రస్తుతం సబ్సిడీ లేని ఎల్‌పిజి సిలిండర్‌నే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాసు కనెక్షన్లు పొందిన పేద మహిళలు, మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలకు మాత్రం ఎల్‌పిజి సిలిండర్‌పై సబ్సిడీ వారి బ్యాంకు ఖాతాలలో పడుతోంది.

మహిళా దినోత్సవం సందర్భంగా ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 100 చొప్పున ధరను తగ్గించాలని తన ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని, ముఖ్యంగా ఇది నారీ శక్తికి లబ్ధి చేకూరుస్తుందని ప్రధాని తెలిపారు. గత ఆరు నెలలలో సబ్సిడీ రహిత ఎల్‌పిజి సిలిండర్‌పై ధరను తగ్గించడం ఇది రెండవసారి. గత ఆగస్టులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్టా ఎల్‌పిజి సిలిండర్‌పై రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం ధర తగ్గించింది. దీంతో రూ. 1,103 ఉన్న 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 903కి చేరుకుంది. తాజాగా రూ. 100 చొప్పున తగ్గించడంతో సిలిండర్ ధర రూ. 803కి చేరుకుంది. వంట గ్యాసును మరింత అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలోని కోట్లాది కుటుంబాల సంక్షేమానికి చేయూతనివ్వడంతోపాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకురావాలన్న ప్రభుత్వ లక్షం నెరవేరుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

మహిళా సాధికారత పట్ల మా చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని, అంతేగాక మహిళల సులభతర జీవనానికి ఈ చర్య దోహదపడుతుందని ఆయన తెలిపారు. కాగా,..ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఇక 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 300 తగ్గింపు ఉండనున్నది. వారికి రూ. 503కే ఎల్‌పిజి సిలిండర్ ఢిల్లీలో లభించనున్నది. ఉజ్వల లబ్ధిదారులకు రూ. 503కి, ఇతర వినియోగదారులకు రూ. 803కి ఎల్‌పిజి సిలిండర్ ఇక లభిస్తుందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఎక్స్ పోస్టులో తెలిపారు. కాగా&గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఉజ్వల యోజన కింద ఎల్‌పిజి సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీని మరో 2025 మార్చి వరకు సొడిగించాలని నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News