Sunday, April 28, 2024

పనిచేయరు.. చేయనివ్వరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విచ్ఛిన్నకర, ప్రతికూల రాజకీయాలకు దిగుతున్న ప్రతిపక్షాల తీరుపై క్విట్‌ఇండియా పిలుపు సమయోచితం సందర్బోచితం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలోని ప్రతిపక్షాలు కొన్నింటికి ఈ దేశం ముందుకు వెళ్లడం రుచించడం లేదన్నారు. ప్రతిపక్షాలు ప్రతికూల ధోరణితో ప్రజలు విసుగెత్తారని స్పందించారు. దేశం మొత్తం ఇప్పుడు అవినీతి, బందుప్రీతి, వారసత్వరాజకీయాలు , బుజ్జగింపుల రాజకీయాల ధోరణులను వ్యతిరేకిస్తోంది.

ఈ క్రమంలో ఇప్పుడు ఈ పాతుకుపోయిన పద్ధతుల పట్ల క్విట్ ఇండియా నినాదం మార్మోగుతోందని ప్రధాని ప్రతిపక్ష కూటమి ఇండియాను దృష్టిలో పెట్టుకుని తెలిపారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో అవినీతిపై పోరు సాగుతుందని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియ ద్వారా దేశంలోని 508 రైల్వే స్టేషన్లకు మెరుగులు , పునఃనిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రతిపక్షాల ధోరణి చాలా విచిత్రంగా ఉందని, ఓ వర్గం ప్రతిపక్షం ఇప్పుడు తాము పనిచేయరు. పనిచేసే వారిని చేయనివ్వరు పద్ధతిగా వ్యవహరిస్తోందన్నారు. ఈ డొంకతిరుగుడు పద్ధతికి వారు అలవాటుపడిపొయ్యారని విమర్శించారు. ఇది దురదృష్టకర పరిణామం అన్నారు.

ప్రతిపక్షాల ఆటంకపు ధోరణికి పలు ఉదాహరణలు ఉన్నాయని, దేశ ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన పార్లమెంట్ నూతన భవన నిర్మాణం జరిగినప్పుడు , పార్లమెంట్‌కు ప్రతిపక్షం, ప్రభుత్వం రెండూ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు దీనిని కూడా ప్రతిపక్షాలు బహిష్కరించాయని తెలిపారు, మునుపటి రాజ్‌పథ్ రాజరిక గుర్తులను చెరిపేస్తూ తాము కర్తవ్యపథ్‌ను తీసుకువస్తే దీనిని కూడా కాదన్నారని , సర్దార్ పటేల్ దేశానికి ఉక్కుమనిషిగా నిలిచారని, ఆయనకు చిహ్నంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా పటేల్ విగ్రహం రూపొందిందని, అయితే ఈ ప్రతిపక్షాలలో కొందరు నేతలే అక్కడికి వెళ్లారని , మిగిలిన వారు కేవలం ఎన్నికలప్పుడే పటేల్‌కు మొక్కుబడి నివాళ్లు అర్పిస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. 70 ఏళ్లు అయింది. ఇప్పటికీ వారు తమ హయాంలో అమరవీరులకు స్మారకస్థలిని నిర్మించలేదని, మరి దీనిని తమ ప్రభుత్వం నిర్మిస్తే దీనికి వారు వంకలు పెడుతున్నారని ఇదేం పద్ధతి అని విమర్శించారు.

పాత చెడు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఇప్పుడు తాము దేశ ప్రగతిని ఓ యజ్ఞంగా తలపెట్టామని, ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా దేశ సమగ్ర ప్రగతికి ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మనమంతా ఆగస్టు 9వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవాన్ని ప్రస్తావించుకోవల్సి ఉంటుందని, అప్పుడు దేశం పరాయి పాలనకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా పిలుపు ఇచ్చిందని, ఇది దేశ స్వాతంత్య్ర ఉద్యమ ఘట్టంలో సరికొత్త శక్తిని అందించిందని, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిందని తెలిపారు.

ఇప్పుడు కూడా మనం మరో విధంగా క్విట్ ఇండియాను పలు విధాలుగా వర్తింపచేసుకుంటున్నామని, అన్ని రకాల చెడుల పట్ల క్విట్ ఇండియా వర్తిస్తుంది. బంధుప్రీతికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా, అవినీతికి , ఓటుబ్యాంకు రాజకీయాలకు ఈ విధంగా పలు రకాల తెగుళ్ల పట్ల క్విట్ ఇండియాను సరికొత్త నినాదంగా అన్వయింపచేసుకోవల్సి ఉందన్నారు.ఈ క్రమంలోనే అవినీతి , బంధుప్రీతి, తన తరువాత తన వారు అనే రాజకీయాలు, కొన్ని వర్గాల ప్రసన్నతల తీరుతో సాగే కొన్ని ప్రతిపక్షాల పార్టీల పట్ల కూడా ఇప్పుడు దేశంలో క్విట్ ఇండియా భావన తీవ్రతరం అయిందని ప్రతిపక్ష కూటమిపై మోడీ నిప్పులు చెరిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News