Saturday, April 27, 2024

నీ బ్యాటింగ్ విన్యాసాలు కళ్లారా చూశాను

- Advertisement -
- Advertisement -

నీ బ్యాటింగ్ విన్యాసాలు కళ్లారా చూశాను.. రైనాకు ప్రధాని మోడీ అభినందన లేఖ

న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత స్టార్ క్రికెటర్ సురేశ్ రైనాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రెండు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. గురువారం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ప్రధాన ట్విటర్ వేదికగా లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న ధోనీతో పాటు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత క్రికెట్‌కు రైనా అందించిన సేవలను ప్రధాని తన లేఖలో గుర్తు చేసుకున్నారు. డియర్ సురేశ్..ఆగస్టు 15న మీరు తీసుకున్న నిర్ణయం మీ జీవితంలోనే అత్యంత కఠినమైనదిగా భావిస్తున్నా. మీరు చేసిన పనిని రిటైర్మెంట్ అనే పదంతో పేర్కొనలేను. ఎందుకంటే మరికొంత కాలం క్రికెట్ ఆడే సత్తా మీకుంది. మరి కొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడే శక్తి సామర్థాలు మీలు ఉన్నాయి. మీరు ఇంకా యువకుడిగానే ఉన్నారు. మైదానంలో ఎన్నో అద్భుత విజయాలు అందించిన మీరు ఇకపై జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతన్నారని నేను భావిస్తున్నా. క్రికెట్‌లో మీరు జీవించారు. చిన్నతనం నుంచే మీకు ఆటపై పట్టు దక్కింది. మురాద్‌నగర్ వంటి చిన్న పట్టణం నుంచి మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ టీమిండియాలో చేరిన తీరు ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. దేశం గర్వించదగ్గ క్రికెటర్‌గా మీరు ఎదిగారు. అతి తక్కువ సమయంలో భారత జట్టులోని అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకడిగా స్థానం దక్కించుకున్నారు. మీ ప్రయాణం ఎంతో గొప్పగా సాగింది. ఈ దేశం మిమ్మల్ని ఓ బ్యాట్స్‌మన్‌గానే గుర్తుంచుకోదు. అవసరమైన సమయంలో బంతితోనూ సత్తా చాటారు. ఇక ఫీల్డిండ్ విన్యాసాలను ఎంత పొగిడినా తక్కువే.

ప్రపంచ క్రికెట్‌లోనే మీరు ఓ గొప్ప ఫీల్డర్‌గా మిగిలిపోతారని చెప్పాలి. మైదానంలో మీరు పట్టిన క్యాచ్‌లు చిరకాలం అందరికి తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. ఇక అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో మీరు ఆపిన పరుగులను లెక్క పెట్టాలంటే రోజులు సరిపోవు. వన్డేల్లో, టెస్టుల్లో, టి20 ఫార్మాట్‌లో మీరు ఎదురులేని బ్యాట్స్‌మన్‌గా కొనసాగారు. ముఖ్యంగా 2011 వన్డే వరల్డ్‌కప్‌లో కీలక సమయాల్లో మీరు ఆడిన ఇన్నింగ్స్‌లు భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచి పోవడం ఖాయం. భారత్ రెండో సారి విశ్వ విజేతగా నిలిచిందంటే దానిలో మీ పాత్ర కూడా చాలా కీలకమని ప్రధాని ప్రశంసించారు. వరల్డ్‌కప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మీరు ఆడిన ఇన్నింగ్స్‌ను నేను ప్రత్యక్షంగా తిలకించాను. ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను భారత్ గెలిచిందంటే దానికి మీరు ఆడిన ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించిందని ప్రధాని కొనియాడారు. ఇక క్రికెటర్‌గా మీరు యువతపై చెరగని ముద్ర వేశారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది యువకులు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్‌కు లభించిన అత్యుత్తమ క్రీడాకారుల్లో మీ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది. మీలోని పోరాడే లక్షణం యువతకు ప్రేరణగా నిలవడం ఖాయం. ఇక టీమిండియాలో మీరు పోషించిన పాత్ర మాటల్లో వర్ణించలేనిది. వికెట్ పడిన సందర్భంలో మీరు సహచరులతో కలిసి సందడి చూడముచ్చటగా ఉంటుంది.

దీన్ని బట్టి ఆటపై మీకున్న ప్రేమ అర్థమవుతుంది. క్రికెట్‌పైనే కాకుండా సమాజంపై కూడా మీకు ఎంతో ప్రేమ ఉందనే విషయం నేను గుర్తించాను. సమాజంపై ఎన్న ప్రేమతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. మహిళా సాధికారిత విషయంలోనూ స్పందించారు. మీ కార్యక్రమాలతో యువతకు ఆదర్శంగా నిలిచారు. అందుకు నేనెంతో సంతోషిస్తున్నా. ఇక భవిష్యత్తులో మీరు ఏమీ చేయాలనకుంటున్నారో ఆ ప్రయాణం సాఫీగా సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ భార్య ప్రియాంక, కూతురు గ్రేసియా, కొడుకు రియోతో కలిసి జీవితంలోని ప్రతి ఆనందాన్ని అనుభవించాలని ఆకాంక్షిస్తున్నా. చివర్లో భారత క్రికెట్‌కు మీరు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీలాంటి క్రికెటర్ దొరకడం భారత్ అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని లేఖపై రైనా స్పందించాడు. తనపై ఎంతో ప్రేమానురాగాలు కురిపించిన ప్రధానికి ధన్యావాదాలు తెలిపాడు. ప్రధాని లేఖ రాయడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు రైనా పేర్కొన్నాడు.

PM Modi writes letter to Suresh Raina after retirement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News