Saturday, May 11, 2024

అటవీ రక్షణ చట్టానికి కేంద్రం తూట్లు

- Advertisement -
- Advertisement -

భూసేకరణకు గ్రామసభ తీర్మానమే తొలిమెట్టు. నిర్వాసితులకు పరిహార చెల్లింపు కేసుల్లో కూడా మేజిస్ట్రేటు ముందుగా గ్రామసభ తీర్మానాన్ని పరిశీలిస్తారు. అయితే కేంద్రం అటవీ చట్టానికి తెచ్చిన కొత్త సవరణల ప్రకారం అడవిని ఆక్రమించేందుకు నివాసితుల గ్రామసభ తీర్మానం అక్కర లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా అడవి అప్పగింత కేంద్రం స్థాయిలోనే జరిగిపోతుంది. పైగా కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శిరసావహిస్తూ కేంద్రం కేటాయించిన భూమిని ఖాళీ చేయించి నిర్వాసితులకు మరో చోట పునరావాసం కల్పించాలి. దేశంలో జాతీయ పార్టీల కొరత ఉన్నందున ఇలాంటి నిర్ణయాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ ఈ చర్యను ఖండిస్తూ దేశంలోని అటవీసంపదకు, ఆదివాసీ బతుకులకు ఇది గొడ్డలిపెట్టు అని ప్రకటించారు.

Podu Farmer

తెలంగాణలో పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు 11 తేదీన ఉదయం రెండు గంటల మౌన దీక్షలో కూర్చుంటే అంతకు కొన్ని రోజుల ముందే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టానికి తెచ్చిన నష్టకారక నిబంధనలకు దేశమే మౌనసాక్షిగా నిలిచింది. జూన్ 28న కేంద్రం చేపట్టిన అటవీ పరిరక్షణ చట్టం, 2008లో విధి విధానాల మార్పు వల్ల దేశంలోని అడవి పూర్తిగా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం అయ్యే అవకాశం ఉంది. ఆ చట్టానికి 2022 సవరణలు పేరిట తెచ్చిన మార్పులతో పరిశ్రమల వ్యవస్థాపకులు ఎక్కడి అడవినైనా యథేచ్ఛగా నరికివేయవచ్చు. దేశ సంపద దోపిడీ కోసం కేంద్రం ప్రైవేటు శక్తులకు వేస్తున్న మరో ఎర్ర తివాసి ఆహ్వానంగా ఈ నిర్ణయాన్ని భావించవచ్చు.
ఇలాంటి కీలక నిర్ణయాల కోసం పార్లమెంటులో చర్చ, స్థాయీ సంఘాల భేటీ, నిపుణులతో సంప్రదింపులు, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా తప్పనిసరి. అయితే కేంద్రంలో ఇందుకు భిన్నంగా, ఏకపక్షంగా భారీ మార్పు లు జరిగిపోతున్నాయి.బిజెపికి పార్లమెంటులో కావాల్సినంత మెజారిటీ ఉన్నా చర్చల వల్ల తమ అసలు రంగు లోకానికి తెలుస్తుందన్న వెరుపుతో ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలను దాటేస్తూ అనుకూల నిర్ణయాలు, చట్ట సవరణలు తెస్తోంది.
దేశంలో ఎలాంటి ప్రాజెక్టుల నిర్మాణానికి గాని, పరిశ్రమల స్థాపనకు గాని నివాస, వృత్తిపర స్థలాలను ఉపయోగించేందుకు ఆయా గ్రామ సభల తీర్మానం ప్రధానమైనది. గ్రామసభ చట్టసభ కాకున్నా గ్రామస్థులందరు చర్చించుకొని ఒక అభిప్రాయానికి రావడానికి ఇది వీలు కల్పిస్తుంది కాబట్టి గ్రామసభకు అంత ప్రాధాన్యత ఉంది. భూసేకరణకు గ్రామసభ తీర్మానమే తొలిమెట్టు. నిర్వాసితులకు పరిహార చెల్లింపు కేసుల్లో కూడా మేజిస్ట్రేటు ముందుగా గ్రామసభ తీర్మానాన్ని పరిశీలిస్తారు. అయితే కేంద్రం అటవీ చట్టానికి తెచ్చిన కొత్త సవరణల ప్రకారం అడవిని ఆక్రమించేందుకు నివాసితుల గ్రామసభ తీర్మానం అక్కర లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా అడవి అప్పగింత కేంద్రం స్థాయిలోనే జరిగిపోతుంది. పైగా కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శిరసావహిస్తూ కేంద్రం కేటాయించిన భూమిని ఖాళీ చేయించి నిర్వాసితులకు మరో చోట పునరావాసం కల్పించాలి. దేశంలో జాతీయ పార్టీల కొరత ఉన్నందున ఇలాంటి నిర్ణయాలపై పెద్దగా చర్చ జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్ గాంధీ ఈ చర్యను ఖండిస్తూ దేశంలోని అటవీసంపదకు, ఆదివాసీ బతుకులకు ఇది గొడ్డలిపెట్టు అని ప్రకటించారు. ఆయన ఖండన చిన్న వార్తగా మిగిలిపోయింది. ఈ నిర్ణయాన్ని గట్టిగా తిరస్కరించే సాహసం కూడా కాంగ్రెస్ చేయకపోవచ్చు. నిజానికి తమ హయాంలో కూడా అటవీ పరిరక్షణ చట్టం, 2008 సవరణలకు కాంగ్రెస్ పూనుకుంది. ఆనాటి అటవీ, పర్యావరణ, పరిశ్రమల మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ముం దుకు సాగలేదు. 2011- 14 మధ్యకాలంలో కేంద్రంలో గిరిజన సంక్షేమ మంత్రిగా ఉన్న వై. కిషోర్ చంద్ర దేవ్ అడవి భూముల కేటాయింపులపై తన వద్దకు వచ్చిన చాలా ప్రతిపాదనలను తిప్పిపంపేవారట.
నిజానికి అటవీ పరిరక్షణ చట్టం, 2008 ప్రకారం కేంద్రం ప్రైవేటు ప్రాజెక్టులకు అనుమతినిచ్చే ముందే అడవి బిడ్డల అంగీకారం తీసుకొని, వారి హక్కులకు భంగం కలుగకుండా చూసుకోవాలి. కొత్త సవరణ ప్రకారం చూస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు పోడు సాగుకు భూములు పంపిణీ చేసినా ఆ భూముల్ని సైతం కేంద్రం ఎవరి అనుమతి లేకుండా అప్పగించవచ్చు. దీని వల్ల 2006లో వచ్చిన ఆదివాసీ, ఇతర సాంప్రదాయిక అడవి నివాసుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా అడవి బిడ్డలకు సంక్రమించిన హక్కు లు కూడా కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ గిరిజనుల సంక్షేమం కోసం పోడు భూమిపై హక్కు పత్రాలు ఇచ్చినా ఆ భూమిని కేంద్రం ఒక్క పెన్ను పోటుతో ఇతరుల పాలు చేయవచ్చు. తిరిగి ఆ నిర్వాసితులకు పరిహారంగా ఇచ్చే భూమిని కేటాయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. అంతా అయ్యాక ఆ భూమి కూడా లబ్ధిదారుకి దక్కేది ఎన్నాళ్ళో చెప్పే వీలు లేదు. కేంద్రం అదే భూమి మరో ప్రాజెక్టుకు అప్పగిస్తే ఖాళీ చేయాల్సిందే. ఈ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అటవీ భూముల్లో పరిశ్రమల స్థాపన కోసం కేంద్రంలో ఉండే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీని సంప్రదించాలి.
2012లో ఆ నాటి కేంద్ర ప్రభుత్వం అడవి భూముల్లో రోడ్లు, పైపులైన్లు, రైలు పట్టాలు వేసేందుకు గ్రామసభ తీర్మానాలు అవసరం లేదని ఆ చట్టానికి ఒక సవరణ చేసింది. ప్రజావసరాలు, ప్రభుత్వ పనులు జాప్యం కావద్దని ఆ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. అయితే దానినే దృష్టిలో పెట్టుకొని 2014 నుండే మోడీ ప్రభుత్వం అటవీ పరిరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో పడింది. అక్టోబర్ 2014లో జరిగిన సమావేశంలో గిరిజన, పర్యావరణ శాఖలు ఆదివాసీ హక్కుల చట్టం, 2006లో గ్రామసభ తీర్మానాల మినహాయింపు లేదని చెప్పడంతో రంగం ముందు కు సాగలేదు.
నిజానికి 1927 లో బ్రిటిష్ వాళ్లు అడవిలో రోడ్లు, రైలు పట్టాలు వేసేందుకు, పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ ఇష్టానుసారంగా ఓ చట్టాన్ని తెచ్చారు. అయితే దాని నుండి అడవిని, ఆదివాసీల హక్కులను రక్షించేందుకే కొత్త సొంత చట్టాలు వచ్చాయి. వాటిలో గ్రామసభ తీర్మానానికి ప్రముఖ స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడు కేంద్రం తీసుకొన్న సవరణల వల్ల తిరిగి బ్రిటిష్ చట్టానికి ప్రాణం పోసినట్లవుతుంది. ఈ సవరణల ప్రకారం కేంద్రంలో ఐదుగురు సభ్యుల కమిటీ నెలకు రెండు సార్లు సమావేశమై ప్రభుత్వానికి చేరిన కొత్త ప్రైవేటు ప్రాజెక్టులను పరిశీలించి అటవీ భూముల కేటాయింపుకు కాల పరిమితిని పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతుంది.
ఈ సవరణలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నామ మాత్రంగా కేంద్ర పర్యావరణ శాఖ అక్టోబర్ 2, 2021 రోజున చిన్న ప్రకటనని ఇచ్చింది. దీనిపై 5 వేలకు పైగా అభిప్రాయాలు, సూచనలు వచ్చాయి. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడింది. 22% అరణ్య వ్యాప్తమైన మన దేశంలో 33% అడవి ఉండాలని ఒక వైపు పర్యావరణ శాఖ అంటుండగా ఆమాత్రం కూడా దక్కకుండా అదే ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయి. అడవిపై ఆయా రాష్ట్రాలకు, అక్కడి ప్రజలకు ఎలాంటి హక్కు లేకుండా చేసిన ఈ చట్ట సవరణలు దేశంలో ప్రైవేటు శక్తుల వీరంగానికి కేంద్రం వేస్తున్న మరో అడుగుగా భావించాలి.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News