Friday, April 26, 2024

అదానీపై రాజకీయ ప్రకంపనలు!

- Advertisement -
- Advertisement -

అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక భారత ఆర్ధిక వ్యవస్థను ఓ కుదుపు కుదుపుతున్నది. ప్రపంచంలో మూడో పెద్ద కుబేరుడుగా పేరొందిన అదానీ వేగంగా తన స్థాయి నుండి దిగజారుతున్నాడు. ఆరు రోజులలోనే అదానీ కంపెనీల మార్కెట్ విలువ 40 శాతానికి పడిపోవడంతో సంక్షోభం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నది.

ఈ సందర్భంగా అదానీకి భారీ మొత్తాలలో పెట్టుబడులు సమకూర్చిన ప్రభుత్వరంగ బ్యాంకులు, జీవిత బీమా సంస్థ వంటి ఆర్ధిక సంస్థల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్నది. అవి కుప్పకూలిపోతే భారత ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వంపైననే కాకుండా, రాజకీయ సుస్థిరతపై సహితం ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తుండడం, కనీసం పార్లమెంట్‌లో ఈ విషయంలో ఓ ప్రకటన చేయడానికి గాని, చర్చించడానికి గాని సుముఖంగా లేకపోవడంతో రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రభుత్వ అండదండలతోనే అకస్మాత్తుగా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నుడిగా ఎదిగిన అదానీకి దూరం జరిగి, తన విశ్వసనీయతను పెంపొందింప చేసుకొనే అవకాశం ఇది అంటూ ప్రముఖ ఆర్థికవేత్త, బిజెపి మాజీ ఎంపి డా. సుబ్రమణియన్ స్వామి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు చెప్పారు.

అదానీ తనపై వచ్చిన ఆరోపణల నుండి కోర్టు ద్వారా విముక్తుడయ్యే వరకు అతనికి దూరంగా మోడీ జరగడం బిజెపి ప్రయోజనాల దృష్ట్యా చాలా అవసరమని డా. స్వామి స్పష్టం చేశారు. లేకుంటే వాటర్‌గేట్ స్కామ్‌లో 1973 -79లో రిపబ్లికన్‌లు తీవ్రం గా నష్టపోయిన విధంగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి కూడా తీవ్రంగా నష్టపోతుందని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజులలో ఈ కుంభకోణాలకు సంబంధించి మరి అనేక కోణాలు సహితం బహిర్గతమయ్యే అవకాశంఉందని ఆయన సూచించారు. పారిశ్రామిక వేత్తలు, ఆర్ధికపరమైన అక్రమాలకు పాల్పడిన వారు రాజకీయ పలుకుబడులు ఉపయోగించుకోవడం మన దేశంలో కొత్త ఏమీ కాదు. ఎవ్వరు అధికారంలో ఉంటె వారికి సన్నిహితంగా ఉంటూ చట్టాల ఇబ్బందుల నుండి సులభంగా బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. ఆ విధంగా ధీరూభాయి అంబానీకి మొదటగా ఆపన్నహస్తం అందించిన నాడు కేంద్రంలో వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ. ఆ తర్వాత కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయనను కాదని వెళ్లలేని పరిస్థితులు ఏర్పరచుకున్నారు.

అదానీ సహితం తనకు మొదటగా తోడ్పడింది రాజీవ్ గాంధీ ఉదారవాద విధానాలని బహిరంగంగానే చెప్పారు. ఆ తర్వాత కేంద్రంలోని ప్రతి ప్రభుత్వం తనకు సహకరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి మోడీతో ఏర్పర్చుకున్న సాన్నిహిత్యాన్ని ఆసరా చేసుకొని ప్రభుత్వ విధానాలను విశేషంగా ప్రభావితం చేస్తూ ఎవ్వరూ ఊహించనిరీతిలో తన సంపదను పెంచుకొంటూ ఉండడంతో అందరి దృష్టిని ఆకట్టుకొంటున్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా మోడీ జరిపిన ప్రతి విదేశీ పర్యటనలో అదానీ కీలక పాత్ర వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన స్వయంగా గాని లేదా ఆయన కంపెనీలకు చెందిన సీనియర్ వ్యక్తి గాని, అధికార ప్రతినిధివర్గంతో కాకుండా, వ్యక్తిగత హోదాలో ప్రధానితో పాటు వెళ్లి, ఆయన కార్యక్రలాపాలపై ప్రభావం చూపుతున్నట్లు కూడా చెబుతున్నారు. అందుకనే ఈ నివేదిక రాజకీయంగా సహితం కలకలం రేపుతున్నది.

అదానీ హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న ఆరోపణలకు నిర్దుష్ట ఆధారాలు లేవని, భారత దేశ ఆర్థిక వ్యవస్థను మట్టుపెట్టేందుకు, అంతర్జాతీయంగా గొప్ప నేతగా ఎదుగుతున్న నరేంద్ర మోడీని రాజకీయంగా అణగద్రొక్కేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమని ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. స్వయంగా అదానీ ఈ దాడి తనపై జరుగుతున్నది కాదని, భారత దేశంపై జరుగుతున్న దాడిగా ఖండించారు. అయితే, ‘దేశభక్తి’ ఆయుధంతో ఆరోపణల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఈ ఆరోపణలు చేయడంలో హిండెన్ బర్గ్‌కు వ్యక్తిగతమైన స్వార్థ, ఆర్ధిక ప్రయోజనాలు ఉండవచ్చు. కానీ భారతీయ చట్టాలను అధిగమిస్తూ, ఇక్కడి వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ, ఆర్థికపరమైన దోపిడీకి దిగుతున్నట్లు వచ్చిన ఆరోపణలను అంత తేలికగా తీసిపారవేయలేము.

నేడు మనీలాండరింగ్ ఆరోపణలతో నిర్దిష్టమైన సాక్ష్యాధారాలు లేకుండా ఎందరినో అరెస్టులు చేస్తున్నారు. అకారణంగా దీర్ఘకాలం జైళ్లలో ఉంచుతున్నారు. ప్రభుత్వం నమోదు చేసిన కేసులలో 3 నుండి 5 శాతం లోపు మాత్రమే న్యాయస్థానం ముందు నిలుస్తున్నాయి. అటువంటిది మొత్తం భారతీయ ఆర్ధిక వ్యవస్థను కుంగదీస్తున్న ఆరోపణలు తెరపైకి వస్తే భారత దర్యాప్తు సంస్థలు ప్రేక్షక పాత్ర వహించడం విస్మయం కలిగిస్తోంది. ఆదానీకి భారతీయ ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లక్షల కోట్ల రూపాయల రుణాలు సమకూర్చిన్నట్లు కథనాలు వస్తున్నాయి. వాటిల్లో ఎక్కువగా స్టేట్ బ్యాంకు 2.6 బిలియన్ డాలర్లు సమకూర్చినట్లు చెబుతున్నారు. జీవిత బీమా సంస్థ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన్నట్లు వెల్లడైనది. అయితే నిబంధనలు ప్రకారమే పెట్టామని, తమ పెట్టుబడుల విలువ తగ్గినా, తాము పెట్టిన పెట్టుబడులకు మించే ఇంకా వాటి విలువ ఉన్నట్లు ఓ ప్రకటనలో ఎల్‌ఐసి చెబుతున్నది.

కానీ, ఇక్కడ తెలియాల్సింది ఏ రూపంలో ఈ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి? ఆ విధంగా పెట్టుబడులు సమకూర్చడం కోసం అనుసరించిన విధానాలు ఏమిటి? ఆస్ట్రేలియాలో అక్కడి ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు మన స్టేట్ బ్యాంకు గతంలో ఆదుకొంది. ప్రస్తుత సంక్షోభం నుండి ఈ గ్రూప్‌ను ఆదుకోవడానికి సౌదీ అరేబియాకు చెందిన కంపెనీలు విశేష ప్రయత్నం చేసిన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. గల్ఫ్ దేశాలతో అదానీకి సన్నిహిత సంబంధాలున్నట్లు వెల్లడైంది.
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పిఒ) ను ఉపసంహరించుకోవడం సహితం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎఫ్‌పిఒ పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయినా రిటైల్‌గా, గ్రూప్ ఉద్యోగులకు కేటాయించిన షేర్లు మాత్రం అమ్ముడు పోకపోవడం గమనార్హం. అంటే కృత్రిమంగా డిమాండ్ సృష్టించే ప్రయత్నం జరిగిందా? తద్వారా హిండెన్‌బర్గ్ ఆరోపణల సునామీ నుండి తప్పించుకునే ప్రయత్నం సఫలం కాకపోవడంతో ఉపసంహరించుకున్నారా?

భారత దేశానికి వివిధ మౌలిక ప్రాజెక్ట్‌లకు పెద్ద ఎత్తున పెట్టుబడులు సమకూర్చిన అదానీని విదేశీ కుట్రలలో భాగంగా అపఖ్యాతిపాలు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో విశేషమైన సానుభూతి కురిపిస్తున్నారు. నిజమే కావచ్చు. భారత్‌లో, ఆసియాలో అతిపెద్ద సంపన్నుడు, ప్రపంచంలో మూడో పెద్ద సంపన్నుడు మన పారిశ్రామికవేత్త కావడం మనకు గర్వకారణమే. ఆ సంపద అంతా సక్రమంగా సమకూర్చుకొని ఉంటె, ఆమేరకు ప్రభుత్వానికి ఎందుకని పన్నులు చెల్లించడంలేదు? అనే సందేహం వస్తుంది. ప్రపంచంలో మూడో పెద్ద సంపన్నుడైన, దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లించే తొలి 15 మందిలో కూడా లేరే? హిండెన్‌బర్గ్ ఆరోపించినట్లు అకౌంటింగ్ మాయాజాలంతో సంపదను పెంచుకున్నారా? తెలియాల్సి ఉంది. పైగా, ప్రభుత్వం ఆయన కోసం అనేక సమయాలలో నిబంధనలను అడ్డదిడ్డంగా మార్చివేయడం కూడా ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఉదాహరణకు మూడేళ్ళ క్రితం దేశంలో 8 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు నీతి ఆయోగ్, ఆర్ధిక మంత్రిత్వ శాఖ రూపొందించిన నిబంధనలను అతిక్రమించి, వాటిలో ఆరు విమానాశ్రయాలను ఏ విధంగా ధారాదత్తం చేశారు?

పారిశ్రామిక వేత్తలు ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలలో అక్రమాలకు ఒంటరిగా పాల్పడలేరు. రాజకీయ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం తప్పదు. బలమైన రాజకీయ నాయకత్వం అండదండలు ఉన్నవారు చట్టాలకు అతీతంగా మనుగడ సాగింపగలుగుతున్నారు. మన దేశంలో కేవలం సత్యం రామలింగరాజు మాత్రమే ఇటువంటి ఆరోపణలపై ఆరేళ్ల పాటు జైలులో గడపవలసి రావడమే కాకుండా, తన కంపెనీని కూడా పోగొట్టుకున్నారు. అయితే, ఈ సందర్భంగా రామలింగరాజు ఓ బలమైన రాజకీయ నాయకుడిని ధిక్కరించి అతని వత్తిడులకు లెక్కచేయలేని పక్షంలో చట్టంముందు దోషిగా నిలబడవలసి రావడం బహిరంగ రహస్యమే. ఇప్పుడు అదానీకి అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. అయితే, పరిస్థితులు శృతిమించితే అటువంటి అండదండలు ఏ మేరకు కొనసాగుతాయి అన్నది ప్రశ్నార్థకరమే. ఈ సంక్షోభం కారణంగా అదానీ ఆర్ధిక భవిష్యత్ ఏంటన్నది మనకు అవసరం లేదు.

కానీ మన ఆర్థిక వ్యవస్థపై పడబోయే పెను ప్రభావమే ఆందోళన కలిగిస్తుంది. ఇంత ఆందోళన దేశంలో వ్యక్తం అవుతున్నా ఆర్ధిక అక్రమాలను కట్టడి చేయవలసిన ఆర్‌బిఐ, సెబీ వంటివి దాదాపు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి. అదానీ గ్రూప్ కంపెనీలకు సమకూర్చిన రుణాల వివరాలు ఇవ్వమని బ్యాంకులను కోరడం మినహా ఆర్‌బిఐ ఏమీ చేయడం లేదు. వాస్తవానికి ప్రతి బ్యాంకు బోర్డులో ఆర్‌బిఐ ప్రతినిధులు ఇద్దరు ఉంటారు. కార్పొరేట్ సంస్థలకు నిబంధనలను అధిగమించి బ్యాంకులు భారీ రుణాలు సమకూరుస్తున్న సమయంలో వీరు అడ్డుపడిన సందర్భాలు మనకు పెద్దగా కనిపించవు. అంటే మన ఆర్థిక సంస్థలు నిబద్ధతతో పని చేయలేకపోతున్నట్టు స్పష్టం అవుతుంది. మార్కెట్ కథనాల ప్రకారం ముకేశ్ అంబానీ సహితం అదానీ మార్గంలోనే భారీ రుణాలను సమకూర్చుకున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆయన తన రుణాలను నెమ్మదిగా ఈక్విటీ షేర్లుగా మార్చుకుంటూ వస్తున్నారని, అదానీ మాదిరిగా తనను అడిగే వారెవ్వరు అన్న ధీమాతో రుణాలను పెంచుకుంటూ పోవడం లేదని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News