Saturday, April 27, 2024

సిబిఐ కొత్త డైరెక్టర్ ప్రవీణ్ సూద్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తదుపరి డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియమితులు అయ్యారు. 59 సంవత్సరాల ప్రవీణ్ సూద్ ఇప్పుడు కర్నాటక డిజిపిగా ఉన్నారు. సిబిఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం ఈ నెల 25తో ముగుస్తుంది. జైస్వాల్ స్థానంలో సూద్‌ను సిబిఐ డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. పదవీబాధ్యతల స్వీకరణ నాటి నుంచి సూద్ సిబిఐ డైరెక్టర్‌గా రెండేళ్ల పాటు బాధ్యతలలో ఉంటారు. దేశంలో జైస్వాల్ తరువాత సీనియర్ ఐపిఎస్ ఆఫీసరు అయిన సూద్ 1986 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన అత్యున్నత సంబంధిత నియామక కమిటీ భేటీలో సూద్ నియామకానికి అనుమతి దక్కింది.

అయితే సిబిఐ తదుపరి డైరెక్టర్‌గా సూద్ నియామకం పట్ల అధీర్ రంజన్ చౌదరి తమ అసమ్మతి తెలియచేసినట్లు తెలిసింది. కానీ ఇది అధికారికంగా నిర్థారణ కాలేదు. సూద్ అత్యున్నత విద్యావంతులు. ఐఐటి ఢిల్లీ, ఐఐఎం బెంగళూరు, న్యూయార్క్‌లోని సిరాక్యూస్ యూనివర్శిటీ పూర్వపు విద్యార్థి. వయోపరిమితి రీత్యా సూద్ 2024లోనే రిటైర్ కావాల్సి ఉంటుంది. అయితే సిబిఐ డైరెక్టర్‌గా ఆయనకు నిర్ణీతంగా రెండేళ్ల పదవీకాలం ఉంటుంది.
ప్రస్తుతం కర్నాటక డిజిపి హోదాలో ఉన్న సూద్ అంతకు ముందు బళ్లారి, రాయ్‌చూర్ జిల్లాల ఎస్‌పిగా ఉన్నారు. బెంగళూరు, మైసూరు సిటీల పోలీసు, ట్రాఫిక్ కంట్రోలు బాధ్యతలను కూడా నిర్వర్తించిన దశలు ఉన్నాయి.

పోలీసు విభాగంలో ప్రవేశించిన తరువాత ఆయన తొలిసారి మైసూర్ ఎఎస్‌పిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా 1999లో ఆయన డిప్యూటేషన్‌పై మారిషస్‌లో పోలీసు సలహాదారుడిగా నియమితులు అయ్యారు. అక్కడ మూడేళ్లు ఈ బాధ్యతల్లో ఉన్నారు. మారిషస్‌లో పాక్‌సంతతికి చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు దక్కాయి. 1996లో చీఫ్ మినిస్టర్ గోల్డ్ మోడల్, 2002లో పోలీసు మోడల్, 2011లో ప్రెసిడెంట్ పోలీసు మోడల్, 2006లో ప్రిన్స్ మైకెల్ ఇంటర్నేషనల్ సెఫ్టీ అవార్డు, 2011లోనే నేషనల్ ఈ గవర్నెస్ స్వర్ణ పురస్కారం కూడా అందుకున్నారు. ఆయన గతంలో కర్నాటక హోం శాఖ ముఖ్య కారద్శరిగా, అడిషనల్ డిజిపిగా, రిజర్వ్ పోలీసు అడిషనల్ డైరెక్టర్ జనరల్‌గా కూడా వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News