Sunday, April 28, 2024

స్వల్పకాల ప్రధాని!

- Advertisement -
- Advertisement -

Prime Minister Liz Truss has been in office for just 44 days

బ్రిటన్ పరిస్థితి వచ్చే ప్రధాని, పోయే ప్రధాని అన్నట్టుంది. కేవలం 44 రోజు ల పాటు పని చేసి ప్రధాని లిజ్ ట్రస్ తలవంచుకొని తప్పుకున్నారు. తనకు అప్పజెప్పిన అధికార బాధ్యతలను నిర్వహించడంలో విఫలమయ్యానంటూ గురువారం నాడు రాజీనామా సమర్పించారు. తాను ఏ నేపథ్యంలో ప్రధాని పదవిని చేపట్టానో, తన ముందున్న పరిస్థితులు ఎటువంటివో సవ్యంగా అర్థం చేసుకోలేక తప్పుటడుగులు వేసి దేశ ఆర్థిక వ్యవస్థకు వున్నట్టుండి వణుకు పుట్టించిన ట్రస్ దాని ప్రకంపనాలకు బలైపోయారు. పరిణతిలేని ప్రధాని అనిపించుకొని దిగిపోయారు. సంపన్నుల మీద పన్నులను తగ్గిస్తూ ఆమె ప్రతిపాదించిన మినీ బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను పతనం చేసింది. ఆర్థిక వ్యవస్థనే అతలాకుతలం చేసింది. 45 బిలియన్ పౌండ్ల మేరకు పన్నులు తగ్గించబోయారు. అందువల్ల కలిగే ఆదాయ నష్టాన్ని అప్పుల ద్వారా భర్తీ చేస్తానన్నారు. దానితో స్టాక్ మార్కెట్లు తీవ్ర అసంతృప్తిని ప్రకటించాయి. పర్యవసానంగా పడిపోయిన పౌండ్‌ను కాపాడడానికి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ అసంతృప్తిని వ్యక్తం చేసింది.

వెంటనే ట్రస్ తన చర్యలను వెనక్కి తీసుకొన్నప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్థిక మంత్రి క్వార్టెంగ్‌ను తొలగించి జెరెమీ హంట్‌ను నియమించినా ఆమెకు ఊరట కలగలేదు. మరో మంత్రి బ్రేవర్‌మన్ వలస వాసులపై అసంతృప్తి ప్రకటించడంతో ఆమెను హోం మంత్రిత్వం నుంచి ట్రస్ తొలగించారు. భారత దేశంతో కుదుర్చుకోడానికి సిద్ధంగా వున్న వాణిజ్య ఒప్పందం వల్ల బ్రిటన్‌లోకి వలసలు పెరుగుతాయని, ఇప్పటికే భారతీయులు మితిమించి వున్నారని బ్రేవర్‌మన్ ప్రకటించడంతో ఆమెకు, ట్రస్‌కు భేదాభిప్రాయాలు తలెత్తాయని దానితో ఆమె రాజీనామా అనివార్యమైందని చెబుతున్నారు. ఇలా అనతి కాలంలోనే బడ్జెట్ భంగపాటు, ఇద్దరు మంత్రులు తప్పుకోవలసి రావడం ట్రస్ సామర్థంపై నీలినీడలు పరిచాయి. పార్టీలో ఆమె ప్రతిష్ఠ మసకబారింది. పూర్వ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన ట్రస్ సంప్రదాయ ఆర్థిక విధానాలను విడనాడి వ్యవస్థకు కొత్త చైతన్యాన్ని ఎక్కిస్తానని, పన్నులు తగ్గిస్తానని ప్రభుత్వ యంత్రాంగంలోని నిర్ణయ జాప్యాన్ని అంతమొందిస్తానని చెప్పడంతో ఆమె పట్ల కన్జర్వేటివ్ పార్టీ నమ్మకం పెంచుకొన్నది.

అందువల్లనే తన ప్రత్యర్థి అయిన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ పై చివరి దశలో ఆధిక్యాన్ని సాధించి ట్రస్ ప్రధాని కాగలిగారు. ఆమె రాజీనామాతో ఆరేళ్లలో బ్రిటన్‌కు ఐదవ ప్రధాని బాధ్యతలు చేపట్టవలసి వస్తున్నది. అధికార పక్షం అధ్యక్షులే ప్రధానిగా వుండే సంప్రదాయం వల్ల కొత్త ప్రధాని ఎన్నిక ఆ పార్టీలోనే జరగవలసి వుంటుంది. బ్రిటన్ వ్యాప్తంగా లక్ష 50 వేల ఓట్లున్న కన్జర్వేటివ్ పార్టీలో అంచెలంచెలుగా జరిగే అధినేత ఎన్నిక ప్రక్రియ సుదీర్ఘంగా సాగి కొన్ని మాసాలు పట్టే అవకాశముంది. బోరిస్ జాన్సన్ రాజీనామా ఇచ్చిన తర్వాత కొత్త ప్రధానిని పార్టీలో ఎన్నుకోడానికి రెండు మాసాలు పట్టింది. ఈసారి తొందరలోనే ఆ ప్రక్రియ పూర్తి అవుతుందని అంటున్నారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో విఫలం కావడం వల్ల కన్జర్వేటివ్ పార్టీ ప్రతిష్ఠ దిగజారిపోయింది. ఇప్పటికిప్పుడు బ్రిటన్‌లో ఎన్నికలు జరిగితే ఈ పార్టీకి కేవలం 20 శాతం మందే ఓటు వేస్తారని, ప్రతిపక్ష లేబర్ పార్టీకి 56 శాతం ఓట్లు పడతాయని ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడి కావడం గమనార్హం.

అత్యంత క్లిష్టమైన బ్రెగ్జిట్ ఊగిసలాట నుంచి బయటపడవేయగలిగిన బోరిస్ జాన్సన్ వ్యక్తిగత బలహీనతల కారణంగా దిగిపోవలసి వచ్చింది. చేతగానితనం వల్ల ట్రస్ నిష్క్రమించారు. కొత్త అధ్యక్షుని కోసం కన్జర్వేటివ్ పార్టీలో జరిగే ఎన్నికలో బోరిస్ జాన్సన్ మళ్లీ పాల్గొనవచ్చని వినవస్తున్నది. ఆయన గతంలో ప్రధాని పదవి నుంచి దిగిపోతూ తాను మళ్లీ వస్తానని ప్రకటించారు. అది అలా జరగబోతుందని అనుకోడం సరి కాదు. కాని ఈసారి తిరిగి జాన్సన్‌ను తెచ్చుకోడమో లేక ఎన్నికలకు తెర లేపడమో తప్ప కన్జర్వేటివ్ పార్టీకి వేరే మార్గం లేదని అంటున్నారు. జాన్సన్‌కు అనుకూలంగా అనేక మంది కన్జర్వేటివ్ ఎంపిలు ట్వీట్లు చేశారు. బ్రెగ్జిట్ సంక్షోభంలో సంప్రదాయ విరుద్ధంగా మధ్యంతర ఎన్నికలు జరిపించి గెలిచిన వ్యక్తి ఆయనేనని, దేశ వ్యాప్తంగా ఆయనకు మద్దతు వుందని వీరు ఈ ట్వీట్లలో అభిప్రాయపడ్డారు. ఈసారి పోటీలో రిషి సునక్, పెన్నీ మోర్డాంట్ కూడా వుంటారని అభిప్రాయపడుతున్నారు. ధరలు ఆకాశానికంటడం, డాలర్‌తో పౌండ్ క్షీణించిపోడం బ్రిటన్‌ను పీడిస్తున్న ప్రధాన సమస్యలు. ఈ దశలో కన్జర్వేటివ్ పార్టీ ప్రజల్లో నమ్మకం కలిగించడానికి ఏమి చేస్తుందో, తదుపరి ప్రధానిగా అది ఎన్నుకునే వ్యక్తి ఈ పరీక్షలో ఏ మేరకు నెగ్గగలుగుతారో చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News