Monday, April 29, 2024

చై.క.పా సభలపై వక్రీకరణ!

- Advertisement -
- Advertisement -

Anti-Muslim propaganda in name of terrorism in media

చైనా ముస్లింల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని, లక్షలాది మందిని నిర్బంధించారని గిన్ని పిగ్స్ లాగా వారిని చూస్తున్నారని వాషింగ్టన్ పోస్టు (17.10. 2022 ) పేర్కొన్నది. ఇది పాత పాటే. వాస్తవాలేమిటి? గత 30 ఏళ్లలో టెర్రరిజంపై యుద్ధం పేరిట పదుల లక్షల సంఖ్యలో సివిలియన్ ముస్లింలను చంపింది అమెరికా. ఒక్క ఇరాక్‌లోనే ఐదు లక్షల మంది బాలలు చనిపోయారు. చైనా నిర్బంధాల గురించిన తప్పుడు రిపోర్టుల్లో కూడా వారిని అలా చంపేశారు అన్న ఆరోపణ లేదన్నది గమనార్హం. కేవలం మదర్సాల్లో మతపర చదువులు కాక, అక్కడ ముస్లింలకి ముఖ్యంగా విద్యార్థులకి ఆధునిక విద్య, సైన్సు బోధన నిర్బంధం చేశారు. బోధనే ముఖ్య సాధనంగా టెర్రరిజంపై వారు పోరాడుతున్నారు. దాన్నే నిర్బంధ శిబిరాలని, వారు గినీ పిగ్స్ అనీ వక్రీకరిస్తున్నారు. కొద్ది ఏళ్ళ క్రితం వివిధ (ముస్లిం) దేశాల వారిని, విదేశీ మీడియాని- యూరోపియన్‌లను కూడా -ఆహ్వానించి, సింకియాంగు వంటి ముస్లిం ప్రాంతాల్లో తిప్పి చూపించారు. అయినా దురుద్దేశ పూర్వకమైన తప్పుడు కథనాలు అలాగే ఉన్నాయి. ఐరాస మానవ హక్కుల కమిటీలో ఈ ఆరోపణలపై ఈ అక్టోబరు 6న చర్చ జరిగింది. ఆ తర్వాత జరిగిన ఓటింగులో 47 దేశాలు పాల్గొన్నాయి. చైనాని ఖండిస్తూ చేసిన తీర్మానం అందులో వీగిపోయింది.
కేవలం 17 దేశాలు -అమెరికా, యూరప్ దేశాలు, జపాన్, కెనడా మొ. – చైనాని ఖండించాయి.

19 దేశాలు తీర్మానాన్ని తిరస్కరించాయి. వాటిలో ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న పాకిస్తాన్, ఇండోనేషియాలతో పాటు ఖతార్, యుఎఇ, కజకస్థాన్ వంటి ముస్లిం దేశాలు న్నాయి. 11 దేశాలు చైనా వ్యతిరేక తీర్మానాన్ని బలపరచకుండా ఓటింగ్‌కి దూరంగా ఉండి పోయాయి. వాటిలో ఇండియాతో పాటు మలేషియా వంటి ముస్లిం జనాభా గల దేశాలున్నాయి. కమ్యూనిస్టు వ్యతిరేక దేశాలే అయినా అమెరికా శిబిరం ప్రతిపాదించిన తీర్మానాన్ని వారు బలపరచ లేదు. అయినా అసత్య ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. గమనార్హం ఏమంటే 47 లో ఒక్క ముస్లిం దేశం కూడా అమెరికా ప్రోత్సహించిన తీర్మానాన్ని బల పరచలేదు. పాశ్చాత్య పెత్తనంలో ఉన్న మన మీడియాలో టెర్రరిజం పేరిట ముస్లిం వ్యతిరేక ప్రచారం అనేక రూపాల్లో సాగుతూనే ఉన్నది. ముస్లిం దేశాలూ నమ్మకపోయినా చైనా వ్యతిరేక ఉన్మాదాన్ని ప్రచారంలో పెట్టి, తమ వ్యూహాలు నెరవేర్చుకోటానికే ఇదంతా.

కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధం, ఆంక్షల వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని, అభివృద్ధి రేటు తగ్గిపోతుందనీ, చైనాలో నిరుద్యోగం పెరిగిపోతోందని కూడా పై రిపోర్టులో పేర్కొన్నారు. 2012లో జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చిన కాలంతో పోలిస్తే నేడు చైనా ఎకానమీ, జిడిపి రెట్టింపు అయిందన్న వాస్తవాన్ని అదే రిపోర్టులో పేర్కొనాల్సి వచ్చింది. కొవిడ్ తర్వాత కూడా చైనా ఎకానమీ బలంగానే ఉన్నది. ఈ హయాంలోనే మరో 10 కోట్ల మంది పేదరికంలో నుంచి బయటపడ్డట్టూ పేర్కొన్నారు. అమెరికాలో 2008 సంక్షోభం, 1930 నాటి డిప్రెషన్ పరిస్థితిని గుర్తు చేసే మాంద్యం పరిస్థితులు, తీవ్ర నిరుద్యోగం ఉన్నాయని ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని దేశాల్లో నెగెటివ్ గ్రోత్ రేట్స్ కూడా నమోదైనాయి. కాగా చైనా వృద్ధి రేటు, ఐఎంఎఫ్ తగ్గించిన దాని ప్రకారం కూడా 2022లో 3.2% ఉంటుందని అంచనా. ఆ వృద్ధి శాతం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న చాలా పెద్ద జిడిపి పునాదిపై అనీ గమనించాలి.

చైనాలో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు, హై టెక్కు కంపెనీలు తుడిచిపెట్టుకు పోయాయని, అందువల్ల అభివృద్ధి కుంటుపడటం ఖాయమని రిపోర్టు చేశారు. చైనా ఆర్ధిక విధానాలు ప్రజల సంక్షేమం ఆధారంగా రూపొందించబడుతున్నాయి. వాణిజ్య లాభాల్ని పట్టించుకోకుండా కొవిడ్ పట్ల జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నారు. చట్టాలను ఉల్లంఘించిన, సమాజాన్ని, యువతరాన్ని కలుషితం చేస్తున్న కంపెనీలను నిర్దాక్షిణ్యంగా మూయించారు లేదా అదుపు చేశారు. ఉదాహరణకి ఆలీబాబా -జాక్ మా, యాంట్ మా వంటి చైనా కంపెనీలు, ఆలీ పే, వియ్ చాట్ వంటి పాపులర్ డిజిటల్ పే కంపెనీలు, డిడి చూక్సీంగ్ వంటి (ఊబర్ లాటి) రవాణా కంపెనీలు.

కంప్యూటర్ జూదము, హానికరమైన గేమ్స్ నడుపుతున్న టెన్సెంట్ హోల్డింగ్స్ వంటి కంపెనీలు – ఇవన్నీ చైనాలో ఆంక్షలకి గురవుతున్నాయి. అమెరికాలోలా, మన వంటి దేశాల్లో వలే ఆ భారీ కంపెనీలు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేక పోతున్నాయి. అక్కడ నిరుద్యోగం ప్రపంచంలో ఏ దేశంలో కన్నా తక్కువే. ఇండియా ప్రభుత్వ రంగంలో ఉన్న పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్యతో సుమారు సమానంగా మూడున్నర కోట్ల మంది వికలాంగులు చైనాలో ఉద్యోగాల్లో ఉన్నారు. మహిళా ఉపాధిలో కూడా చైనా అగ్రస్థానంలో ఉంది. గ్రామీణ నిరుద్యోగాన్ని వ్యవసాయ విప్లవం -దున్నేవాడికే భూమి ద్వారా రద్దు చేశారు. వారి గురించి అసత్యాలు చెప్తే మన సమస్యలు తీరవు కదా!

ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణను చైనా బలపరుస్తున్నట్టుగా రిపోర్టులో పేర్కొన్నారు. అమెరికా, నాటోలు ఉక్రెయిన్ యుద్ధాన్ని రగిలించి కొనసాగిస్తున్నాయని చెప్పిన చైనా ఆ మేరకు రష్యాని బలపరుస్తున్న మాట నిజమే. కానీ ప్రాదేశిక సమగ్రత ఉల్లంఘనలని బలపరచము అని చైనా స్పష్టంగా ప్రకటించింది. ఈ విషయంలో ఐరాస ఓటింగులో రెండు సార్లు రష్యాని బలపరచకుండా చైనా తటస్థంగా ఉన్నదని గమనించాలి. ఇండియా కూడా తన కారణాలతో తాను ఆ పనే చేసింది. ‘ఇది యుద్ధాల యుగంకాదు, శాంతియుత చర్చల ద్వారానే పరిష్కారం అన్న ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలోనే ఇలా ఓటు వేశాం’ అని ఐరాసలో భారత ప్రతినిధి చెప్పారు. మరి చైనా, పాకిస్తాన్‌ల తోనూ ఇదే విధానం అనుసరించాలి కదా! మన మీడియా కూడా అలాగే ఉండాలి. కానీ ‘వాయిస్ ఆఫ్ అమెరికా’ లా పని చేయట మెందుకు?

ప్రపంచంలోనే పెద్ద దౌర్జన్యపరుని (bully) వలే చైనా దేశం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. అనేక దేశాల్లో డజన్ల సంఖ్యలో అమెరికా యుద్ధ శిబిరాలు, నౌకలు, అణ్వాయుధాలు దశాబ్దాలుగా తిష్ట వేసుకుని ఉన్నాయి. చైనాకు ఇతర దేశాల్లో అలాంటివేమీ లేవు. ఇతర దేశాలపై వారు దాడి చేసిన ఘటనలూ లేవు (1962 భారత యుద్ధం, 1978 వియత్నాంతో ఘర్షణ తప్ప); చైనాకు దశాబ్దాలుగా యుద్ధరంగ అనుభవమే లేకపోయిందని కొందరు యుద్ధ నిపుణులు వ్యాఖ్యానించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా దురాక్రమణల గురించి, కోట్ల ప్రాణాల్ని హరించిన సంగతీ వివరిస్తూ డజన్ల కొద్దీ గ్రంథాలు ప్రచురితమయ్యాయి మీడియాలో వాటిని పేర్కొనరు. చైనా దేశం ‘ప్రమాదకరం’ అనే ప్రచారం తప్ప, వారు దాడులు చేసిన సంఘటనలు ఏమీ లేవు. గల్వాన్ ఘర్షణలోనూ ఇరుపక్షాలూ తుపాకులను ప్రయోగించలేదు. ఏడాది పాటు సాగిన హాంకాంగ్ అల్లర్లలో లక్షల మంది పాల్గొన్నప్పటికీ ఆ ఘర్షణల్లో -పాశ్చాత్య రిపోర్టుల ప్రకారం కూడా- ఒకరిద్దరు మాత్రమే మరణించారు. తైవాన్ తమదే అని చైనా చెప్తున్నదని, వారి స్వాతంత్య్రాన్ని చైనా గుర్తించడం లేదని పై రిపోర్టులోనూ మళ్లీ ఆరోపించారు.

పాశ్చాత్య ప్రచారం వల్ల నేడు అత్యధికులకు- విద్యావంతులైన యువ తరానికి కూడా- అంతగా తెలియని విషయం ఇదీ: ఐరాసలోని దాదాపు 195 సభ్య దేశాల్లో తైవాన్ని గుర్తించేవి 10 లోపే ఉన్నాయి. అవన్నీ పేర్లు కూడా తెలియని అమెరికా అనుకూల చిన్న దీవులు మాత్రమే. యూరప్ దేశాల్లో ఏ ఒక్కటీ అమెరికా, ఇండియాలు కూడా తైవాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించటం లేదు. ఈనాడే కాదు, గత యాభై ఏళ్ళ నుంచీ పరిస్థితి ఇదే. తైవాన్‌లో కూడా ప్రజలు, గణనీయమైన రాజకీయ శక్తులు, పార్టీలూ చైనాతో శాంతియుత పునరేకీకరణనే కోరుకుంటున్నాయి. ప్రస్తుతమున్న తైవాన్ ప్రభుత్వం ఇటీవలే అమెరికా ప్రోత్సాహంతో చైనా వ్యతిరేక వైఖరితో ఉంటున్నది. అమెరికన్ స్పీకర్ పెలోసి ఆగస్టులో పర్యటించారు. కానీ చాటుమాటుగా లైట్లు ఆర్పి విమానాశ్రయంలో దిగి వెళ్లారు. బైడెన్, పెంటగాన్, కూడా తొలి దశలో ఆమె పర్యటనని బలపరచ లేదు. ట్రంపు వంటివారే కాక , కిస్సింజరు వంటి రాజనీతిజ్ఞులూ ఆమె పర్యటన అనవసరమైన కవ్వింపు చర్యగా ఖండించారు. పారిపోయి 1949 చైనా విముక్తి సందర్భంగా ఓడిపోయిన అమెరికా అనుకూల శక్తులు తైవాన్ ప్రాంతంలో తలదాచుకున్నాయి.

అమెరికా ఆర్థిక సాంకేతిక, మిలటరీ బలంతో, వారి అణుబాంబుల రక్షణలో ఉన్న తైవాన్ని అమెరికా తన నయా వలసగా భావిస్తున్నది. దాని పట్ల, పెలోసీ పర్యటన పట్ల తైవాన్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయని మీడియాలో చూపెట్టటం లేదు. శాంతియుత పునరేకీకరణే చైనా మార్గం అని జాతీయ కాంగెస్ సభలో కూడా జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. క్వాడ్, ఆకస్ వంటి వ్యవస్థలతో, ఏషియన్ నాటో ప్రతిపాదనతో, మిలటరీ పద్ధతులతో చైనా వ్యతిరేక వ్యూహాలతో అమెరికా వివిధ చర్యలకు పాల్పడుతున్నది. వాటిని ఎదుర్కోటానికే ‘మిలటరీ ప్రయోగం ఉండదు అని గ్యారెంటీ ఇవ్వజాలము’ అని చైనా ప్రకటించింది. ఇది కూడా కొత్తది కాదు, పాత విధానమే. అయినా అమెరికా యుద్ధోన్మాద శక్తులను రెచ్చగొట్టి తన సామ్రాజ్య వాద, అగ్రరాజ్య ప్రయోజనాల్ని ఆయుధ వ్యాపారాల్ని కాపాడుకోజూస్తున్నది. ఈ వాస్తవాలను చూడకుండా మన లాంటి పెద్ద దేశం, భారీ మీడియా ఉన్నా పాశ్చాత్య రిపోర్టుల పైనే ప్రధానంగా ఆధారపడుతున్నది తప్ప మన రిపోర్టర్ల స్వంత ప్రత్యక్ష కథనాలు చాలా వరకు నామమాత్రమే. మన స్వదేశీ స్ఫూర్తి ఇదేనా?

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News