Tuesday, May 7, 2024

స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi lights the golden victory torch

 

1971 యుద్ధంలో భారత్ విజయానికి 50 ఏళ్లు
ఏడాదిపాటు జరగనున్న ఉత్సవాలు

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ వార్షికోత్సవాలను ప్రారంభించారు. 1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత సేన సాధించిన విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్‌ను జరపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాదిపాటు జరిగే విజయోత్సవాలను ప్రధాని మోడీ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఆ యుద్ధం 13 రోజులపాటు సాగింది. డిసెంబర్ 16న 93,000మంది పాక్ సైనికులతోపాటు వారికి నేతృత్వం వహించిన జనరల్ అమీర్ అబ్దుల్లా నియాజీ భారత సేనకు లొంగిపోయారు. దాంతో, బంగ్లాదేశ్ ఏర్పాటైంది.

విజయ్ దివస్ సందర్భంగా ఆనాటి యుద్ధంలో మన సైన్యం పోరాడిన తీరును కొనియాడుతూ ప్రధాని మోడీ ట్విట్ చేశారు. ఆ యుద్ధంలో త్యాగాలు చేసిన సైనికులకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నివాళులర్పించారు. చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్‌తోపాటు త్రివిధ దళాల అధిపతులు యుద్ధ వీరులకు నివాళులర్పించారు. ఏడాదిపాటు జరిగే కార్యక్రమాలను గుర్తు చేస్తూ దేశం నలుమూలలకూ నాలుగు జ్యోతుల్ని(కాగడాల్ని) తీసుకువెళ్తున్నారు. విజయ్ దివస్ సందర్భంగా సైనికుల త్యాగాలను ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ గుర్తు చేసింది. సింహంలాంటి ఇందిరాగాంధీ(ఆనాటి ప్రధాని) నాయకత్వంలో భారత సైన్యం 1971యుద్ధంలో విజయం సాధించిందని కాంగ్రెస్ కొనియాడింది. పాకిస్థాన్‌పై చారిత్రక విజయం సాధించామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ట్విట్ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ప్రజలకు భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌లోనూ విజయ్ దివస్‌ను జరుపుకుంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News