Wednesday, May 1, 2024

బైడెన్‌కు లైన్ క్లియర్

- Advertisement -
- Advertisement -

Electoral College announced Joe Biden as President of United States

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలెక్టోరల్ కాలేజీ అధికారికంగా జో బైడెన్ మెడలో విజయ పుష్పమాల వేసింది. న్యాయ పోరాటంలో గెలుపు సాధించి అధికారంలో కొనసాగవచ్చునని డొనాల్డ్ ట్రంప్ పెట్టుకున్న దింపుడు కళ్లం ఆశలు దీనితో అడుగంటాయి. ట్రంప్ స్వపక్షం రిపబ్లికన్ పార్టీ పెద్దలే బైడెన్‌కు పరంపరగా అభినందన సందేశాలు పంపుతున్నారు. ఆ పార్టీలో అత్యంత పలుకుబడి కలిగినవాడుగా పేరొందిన సెనెటర్ మెకోనెల్ ఎలెక్టోరల్ కాలేజీ నిర్ణయంతో ఏకీభవించారు. ఓటింగ్‌లో మోసాలు జరిగాయన్న ట్రంప్ వాదనకు దూరం జరిగారు. ఎలెక్టోరల్ కాలేజీలో బైడెన్‌కు 306, ట్రంప్‌కు 232 ఓట్లు వచ్చినట్టు మంగళవారం నాడు అధికారికంగా ధ్రువపడింది. సాధారణంగా ఎవరు తదుపరి అమెరికా అధ్యక్షుడనే విషయం ఎలెక్టోరల్ ఓట్ల లెక్కింపు క్రమంలో మెజారిటీ వెల్లడైన వెంటనే స్పష్టపడిపోతుంది. దానితో అమెరికాలో దిక్కులన్నీ విజేత వైపు తిరుగుతాయి. నూతన అధ్యక్ష విజేతకు దేశదేశాల నుంచి అభినందనలు వరుస కడతాయి. ఎలెక్టోరల్ కాలేజీ తీరిగ్గా అధికారిక ప్రకటన చేసేంత వరకు సందిగ్ధావస్థ కొనసాగదు.

ఈసారి పోస్టల్ ఓటింగ్‌లో, ఓట్ల లెక్కింపులో భారీ మోసాలు చోటు చేసుకున్నాయని గగ్గోలు పెడుతూ ట్రంప్ కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేయించడం వల్ల, ఆయన మద్దతుదార్లు వీధుల్లో వీరంగం వేయడం వల్ల ఎలెక్టోరల్ కాలేజీ అధికారిక నిర్ధారణకు ప్రాముఖ్యం ఏర్పడింది. గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన వెనువెంటనే ఆయనకు అభినందనలు తెలిపిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఈసారి బైడెన్ గెలుపును వెంటనే గుర్తించలేదు. మంగళవారం నాడు ఎలెక్టోరల్ కాలేజీ ప్రకటన వెలువడిన తర్వాతనే ఆయన బైడెన్‌ను అభినందించారు. చైనా కొంచెం ఆలస్యం చేసినప్పటికీ గత నెల లోనే బైడెన్ గెలుపును గుర్తించింది. మన ప్రధాని మోడీ కూడా అధ్యక్ష, ఉపాధ్యక్ష పీఠాలకు ఎన్నికైన బైడెన్, కమలా హారిస్‌లను సకాలంలో అభినందించారు. తనను విజేతగా ధ్రువపరుస్తూ ఎలెక్టోరల్ కాలేజీ ప్రకటన వెలువడగానే బైడెన్ వాషింగ్టన్‌లోని డెలారెస్ నుంచి మాట్లాడారు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని అమెరికన్లకు పిలుపు ఇచ్చారు. అమెరికా ప్రజాస్వామ్యం అనేక ఒత్తిడులను, పరీక్షలను, బెదిరింపులను తట్టుకొని తన దుర్భేద్యతను చాటుకున్నదని అన్నారు.

ఎన్నిక ఫలితాన్ని తారుమారు చేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ పన్నిన కుయుక్తులను, కుట్రలను తిప్పికొట్టిన ప్రజలను ప్రశంసిస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో అగ్రరాజ్య అధ్యక్షుడుగా అధికార పగ్గాలు చేపట్టబోతున్న బైడెన్ తన దేశానికి, ప్రపంచానికి ఏమి చేయబోతున్నారనేది కీలకం. కరోనా కోరల్లో చిక్కి విపరీతంగా ప్రాణ నష్టానికి గురైన అమెరికాకు దాని నుంచి ఊరట కల్పించడం తన ప్రభుత్వ మొట్టమొదటి కర్తవ్యమని బైడెన్ చెప్పుకున్నారు. కరోనాకు 3 లక్షల మందికి మించి ఆత్మీయులను బలి ఇచ్చుకున్న దేశస్థులకు సానుభూతిని ప్రకటించారు. ప్రజలందరికీ టీకా వేయించడం, దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింప చేయడం తన కర్తవ్యమని చెప్పారు. ప్రపంచం విషయానికి వస్తే బైడెన్ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. ట్రంప్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత తనకంటే ముందున్న బరాక్ ఒబామా హయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలను రద్దు చేయడానికి అమిత ప్రాధాన్యమిచ్చారు.

అదే మాదిరిగా ట్రంప్ నిర్ణయాలన్నింటినీ బైడెన్ చెత్తబుట్టలోకి పంపిస్తారా లేదా కొత్త మార్గాన్ని అవలంబిస్తారా అనేది ఆసక్తికరమైన విషయం. బైడెన్ హయాంలో పారిస్ పర్యావరణ ఒప్పందం వంటి వాటిలో అమెరికా తిరిగి భాగస్వామ్యం వహిస్తుందా, ఇరాన్‌తో ట్రంప్ రద్దు చేసిన అణు ఒప్పందాన్ని పునరుద్ధరిస్తారా, ఇజ్రాయిల్ పట్ల గత అధ్యక్షుడు ప్రదర్శించిన అతి సాన్నిహిత్య వైఖరిని వదులుకుంటారా అనే ప్రశ్నలు జవాబుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో పోటీ పడుతున్న చైనా విషయంలో బైడెన్ మెతక వైఖరి అవలంబించడానికి అవకాశం లేదు. అయితే ట్రంప్ ప్రదర్శించిన దూకుడును కొనసాగించకుండా అవసరమనుకున్న సందర్భాల్లోనే చైనా ప్రాబల్యాన్ని తగ్గించే నిర్ణయాలకు బైడెన్ పరిమితం కావచ్చు. అమెరికా ఫస్ట్ విధానాన్ని ట్రంప్ బాహాటంగా ఎంచుకొని సొంత ఓటు బ్యాంకును పెంచుకున్నాడు. హెచ్1బి వంటి వీసాల మీద అమెరికాలో ఉద్యోగాలు పొందుతూ వచ్చిన విదేశీయుల పట్ల కక్ష వహించి వ్యవహరించాడు. అలా వచ్చే ఉద్యోగుల మీద ఆధారపడిన అమెరికన్ కంపెనీలు ఆయనను వ్యతిరేకించాయి.

ఆ విధానాన్ని పూర్తిగా వదులుకుంటానని మాట ఇచ్చిన బైడెన్ ఎటువంటి అడుగులు వేస్తారనేది ముఖ్యం. ట్రంప్ చైనా పట్ల శత్రు వైఖరితో భారత్‌కు మితిమించిన అనుకూలుడుగా కనిపించడానికి తాపత్రయపడి వాస్తవంలో మనకు చేసిన మేలేమీ లేదు. మరి బైడెన్ ఎలా ఉంటాడో, గతంలో పాకిస్థాన్‌కు అనుకూలుడుగా ప్రచారం పొందిన ఆయన ఈసారి ఎలా రుజువు పరుచుకుంటాడు అనేది కూడా ప్రధానమైన అంశం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News