Sunday, April 28, 2024

నిర్మాత ఘట్టమనేని రమేశ్‌బాబు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Producer Ghattamaneni Ramesh Babu passed away

 

సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, స్టార్ హీరో మహేష్‌బాబు అన్నయ్య ఘట్టమనేని రమేష్‌బాబు (56) అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు గచ్చీబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే రమేష్‌బాబు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. హీరోగా, నిర్మాతగా రమేష్‌బాబు పలు సినిమాలు చేశారు. బాల నటుడిగానూ పలు సినిమాల్లో నటించారు. రమేష్‌బాబు మృతి పట్ల పవన్ కళ్యాణ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. సూపర్‌స్టార్ కృష్ణ, ఇందిరాదేవిల మొదటి సంతానంగా 1965 అక్టోబర్ 13న చెన్నైలో జన్మించారు రమేష్‌బాబు. అతనికి ముగ్గురు సోదరీమణులు మంజుల, పద్మావతి, ప్రియదర్శిని, తమ్ముడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఉన్నారు.

కృష్ణ నట వారసుడిగా…

సూపర్‌స్టార్ కృష్ణ నట వారసుడిగా రమేష్‌బాబు 1974లో వచ్చిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత కృష్ణ నటించిన ‘మనుషులు చేసిన దొంగలు’, దాసరి నారాయణ రావు చిత్రం ‘నీడ’లో ఆయన నటించారు. ఇక 1987లో వి.మధుసూదన రావు దర్శకత్వంలో వచ్చిన ‘సామ్రాట్’ చిత్రంతో రమేష్‌బాబు హీరోగా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం జంధ్యాల చిత్రం ‘చిన్ని కృష్ణుడు’, దర్శకుడు ఎ.కోదండరామి రెడ్డి సినిమా ‘బజార్ రౌడీ’లో కథానాయకుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. ‘బజార్ రౌడీ’ చిత్రంతో రమేష్‌బాబు తొలి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. అయితే కృష్ణ స్వీయ దర్శకత్వంలో కుమారుడు రమేష్‌బాబు హీరోగా కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు చిత్రాలను తెరకెక్కించడం విశేషం. బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామ కోడలు, అన్నా చెల్లెలు చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు. రమేష్‌బాబు హీరోగా చేసిన చివరి చిత్రం ‘పచ్చ తోరణం’. 1997లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది.

సినీ నిర్మాతగా…

రమేష్‌బాబు నిర్మాతగా కృష్ణ ప్రొడక్షన్స్ ప్రై.లి. బ్యానర్‌ను స్థాపించి సినిమాలను నిర్మించారు. తొలిసారిగా తన సోదరుడు మహేష్‌బాబుతో గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మాతగా ‘అర్జున్’ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనంతరం మరోసారి మహేష్‌తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అతిథి’ చిత్రాన్ని నిర్మించారు. ఇక మహేష్‌కు బ్లాక్‌బస్టర్ హిట్‌నిచ్చిన ‘దూకుడు’ చిత్రానికి రమేష్‌బాబు సమర్పకుడిగా ఉన్నారు. అదేవిధంగా ‘ఆగడు’ చిత్రానికి కూడా ఆయన సమర్పకుడిగా వ్యవహరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News