Friday, April 26, 2024

సత్యపాల్ పుల్వామా సత్యం!?

- Advertisement -
- Advertisement -

2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు. రాష్ట్రపతిని కలవాలన్నా ప్రధాని అనుమతి కావాలి. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ కూడా పుల్వామా నరమేధంపై నోరెత్తద్దన్నారు. ఇంత పెద్ద సైనిక వాహన శ్రేణి రోడ్డుపై ఎప్పుడూ పయనించ లేదు. ఒక విమానాన్ని ఏర్పాటు చేయమన్న కేంద్ర సురక్ష భద్రత దళాల (సిఆర్‌పిఎఫ్) విన్నపాన్ని గృహమంత్రి (ప్రధాని అనుకోవాలి) తిరస్కరించారు.

2022 జనవరిలో 700 మంది రైతులు దీక్షలో మరణించారని చెప్పగా వారు నా కోసం చనిపోయారా? అని మోడీ అడిగారు అని జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈయన గతంలో మోడీని మహోన్నత నాయకుడని, కశ్మీర్ 370 అధికరణ రద్దు శ్లాఘనీయమని పొగిడారు. 370 అధికరణ రద్దు మాటెత్తితే రాహుల్ గాంధీని జనం చెప్పులతో కొడతారన్నారు.
ఉగ్రవాద దాడులపై నిఘా నియంత్రణలకు ప్రత్యేక సైనిక దళం, ఉగ్రవాదులపై దాడికి ప్రత్యేక పోరాట దళం ఉండేవి.

రోడ్డు రవాణా, పౌరయాన బిజెపి కేంద్ర సహాయ మంత్రి వి.కె. సింఘ్ సైన్యాధికారిగా పదవీ విరమణకు ముందు 2012లో ఈ దళాలను రద్దు చేశారు. 50 చ.కి.మీటర్ల పాకిస్తాన్ సరిహద్దు పుల్వామా ప్రాంతాన్ని సైన్యం ఆధీనం నుండి స్థానిక పోలీసులకు బదిలీ చేశారు. వారు అక్కడి భద్రతను అశ్రద్ధ చేశారు. స్థానికేతరులకు ఇల్లను అమ్మరాదు, అద్దెకివ్వరాదు, వాహన లైసెన్సులివ్వరాదు అన్న నియంత్రణలు తొలగాయి. ఉగ్రవాదులు ఇల్లు కొని పేలుడు పదార్థాల నిల్వకు, విస్ఫోటనల శిక్షణకు, ప్రయోగాలకువాడారు. వాహనాలు కొని రవాణా చేశారు. మోడీ పాలనలో జమ్మూకశ్మీర్‌లో దుర్మరణాల సంఖ్య పెరిగింది. 2014-18 మధ్య ఉగ్రవాద చర్యలు 176%, పౌర హత్యలు 35.71%, సైనిక బలులు 56%, ఉగ్రవాదుల సంఖ్య 133.63% పెరిగాయి. పుల్వామా సైనిక బలికి ఇదే మూలం.
సర్వేలన్నీ 2019 లో మోడీ గెలవడన్నాయి. ఈ నేపథ్యంలో 14 ఫిబ్రవరి 2019న జమ్మూకశ్మీర్, పుల్వామా జిల్లా అవంతిపుర వద్ద ఆర్.పి.ఎఫ్. వాహన శ్రేణిపై ఉగ్రవాది ఆదిల్ అహ్మద్‌దార్ భారీ విస్ఫోటన కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. 44 మంది సైనికులు మరణించారు. 20 మంది గాయపడ్డారు. ముఖ్యమంత్రి మోడీ ఉగ్రవాద ఘటనలకు కేంద్రాన్ని నిందించేవారు. పుల్వామా రాజ్యబలి మోడీ దుష్ప్రణాళిక. ప్రభుత్వ భద్రతారాహిత్యం, తప్పుడు విధానాల, మతోన్మాద చర్యల అవలోకనాసందర్భం. ‘అమర జవాన్ల త్యాగం వృథా పోదు. బాధ్యులు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటాం. మీ గుండె లాగే నా గుండె మండుతోంది’ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని ఇలా పౌరుషంగా ప్రసంగించారు.

ఇది త్యాగం, అమరం కాదు. రాజ్య బలి. మోడీ దృష్టిలో ముస్లిం లు, తనను కాదన్నవారు హంతకులు. ప్రతీకారం ప్రధాని నోట రాకూడని మాట. గోధ్రానంతర ఘటనలో మోడీ గుండె మండకపోటానికి, ఇపుడు మండటానికి కారణం ఓట్లు. రాజకీయ, దేశాంగ, విదేశాంగ, రక్షణ, దౌత్య విధానాల్లో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అనైతిక బిజెపి -పిడిపి ప్రభుత్వాన్ని బిజెపి పడగొట్టింది. జమ్మూ కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపాదనను తిరస్కరించారు. రాష్ట్రపతి పాలన విధింపజేశారు. రాజకీయ చర్చలలేమి, ఆర్థిక తిరోగమనం, ఉపాధి రాహిత్యం, హద్దులు దాటిన ఉగ్రవాదం, దాని అణచివేతలో మితిమీరిన సైన్య ప్రవర్తన కశ్మీర్ యువతను సున్నీ మతోన్మాద ఉద్యమం వైపు తోశాయి. ఉగ్రవాద అంతంలో ప్రపంచంలో ఏ నాయకునికీ లేనంత మనోబలం మోడీ కుందని అమిత్ షా అతిశయించారు. ఐదేళ్ళ మనోబలం, నోట్లరద్దు ఉగ్రవాదాన్ని ఆపలేదు.

17 ఫిబ్రవరి 2019 న పాక్ బలూచిస్తాన్ లోనూ ఆత్మాహుతి దాడి జరిగింది. 9 మంది సైనికులు చనిపోయారు. 11 మంది గాయపడ్డారు. సౌదీ అరేబియా యువరాజు పర్యటనకు కొన్ని గంటల ముందు మోడీ సమర్థించిన బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్, రిపబ్లికన్ గార్డ్ ఈ దాడికి పాల్పడ్డాయి. పుల్వామా దగ్గర పింగ్లాన్ వద్ద మరుసటి రోజు ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాద సూత్రధారులు ఘాజీ, కమ్రాన్‌లతో సహా ముగ్గురు ఉగ్రవాదులు, ఒక మేజర్, ముగ్గురు సైనికులు, ఒక పోలీసు మరణించారు. ఒక ముస్లింను చంపారు. సైనిక బలి కొనసాగింది. పాలకులు ప్ర జా సమస్యలను పరిష్కరించ లేదు. రాజకీయ లబ్ధికి ప్రణాళికలు రచించారు. ఫలితంగా కశ్మీర్ యువత తుపాకులు పట్టుకుంది.
సౌజన్య పక్షపాత (ఔనంటే ఔను, కాదంటే కాదనే తత్వం) రాజ్యంలో ప్రధాని మాటకు తీవ్రంగా స్పందిస్తారు. ఫలితమే పుల్వామా తర్వాతి దుర్ఘటనలు. బజరంగ్ దళ్, విశ్వహిందు పరిషత్, శివసేన 15 ఫిబ్రవరి 2019న జమ్మూ బంద్ చేశాయి. వాహనాలను కాల్చారు. ముస్లింలను గాయపర్చారు. కర్ఫ్యూ విధించారు.

కశ్మీర్ బయట కశ్మీరీ విద్యార్థులపై దాడి చేశారు. కశ్మీరీల అంగళ్ళను కాల్చారు. పొట్ట కూటికి కశ్మీర్ నుండి వలసవచ్చిన వారిని హింసించారు. బాధితులందరు ముస్లింలే. పుల్వా మా హంతకుడు కశ్మీరీ కావున దేశద్రోహ కశ్మీరీలను కాల్చండి, దేశం నుండి తరమండని సంఘీయులు ఆందోళన చేశారు. హిందుత్వ హంతకుల జోలికి పోలేదు. ఇందిర హత్యానంతర దాడులకు, పుల్వామానంతర హత్యలకు తేడా లేదు. ‘కశ్మీరీలకు తావు లేదు. కుక్కలు రావచ్చు’ అని డెహ్రాడూన్‌లో సంఘీయులు బోర్డు పెట్టారు. సైన్యం ఆకస్మిక దాడిలో వందలాది ఉగ్రవాదులను చంపామన్నారు మోడీ. నిజానికి సర్వీ చెట్లు కూలాయి కాని ఒక బల్లి కూడా చావలేదు. మన యుద్ధ కాప్టర్‌తో మన యుద్ధ కాప్టర్‌ను కూల్చారు. దీనికి ఫ్రెండ్ ఆర్ ఫో ఇండికేటర్ విఫలం కారణమన్నారు. పాకిస్తాన్ భూభాగంలో పడ్డ వర్ధమాన్ విడుదలకు పాక్ ప్రధానిపై ట్రంప్ పలుకుబడిని వాడుకున్నారు. అందుకు మోడీ మగతనం కారణమని చాటుకున్నారు. కశ్మీర్‌లో జాతి వ్యతిరేక తిరుగుబాట్లను అంతం చేశామన్న తప్పుడు ప్రచారంతో కశ్మీరేతరుల ఓట్లను పొందింది బిజెపి.

పుల్వామా రాజ్య హత్యలను జాతీయ విపత్తుగా చిత్రీకరించారు మోడీ. విచక్షణారహిత ప్రతిపక్షాలు మద్దతిచ్చాయి. పుల్వామా దాడితో రాఫేల్ రగడ సద్దుమణిగింది. యుద్ధం పరిష్కారం కాదనే గొంతులు నొక్కబడ్డాయి. ఆకస్మిక దాడులు చేయమనే నోళ్ళు పెరిగాయి. అమెరికా నుండి ఎఫ్ 16, ఎఫ్ 18 యుద్ధ విమానాలను, గార్డియన్ క్షిపణులను కొన్నారు. మోడీ అమెరికా అనుకూల విధానం వల్ల చైనా పాక్‌ను సమర్థించవచ్చు. 1971 బంగ్లాదేశ్, 1999 కార్గిల్ యుద్ధాల తర్వాతి ఎన్నికల్లో ఇందిర, వాజపేయిలు గెలిచినట్లు పుల్వామా తర్వాతి మాటలతో, ఘటనలతో 2019 ఎన్నికల్లో మోడీ నెగ్గారు. పుల్వామా తర్వాత వ్యాపించిన జాతీయవాద భావాన్ని ఓట్లుగా మార్చండని గుజరాత్ బిజెపి నాయకుడు భరత్ పాండ్యా కార్యకర్తలకు బోధించారు. గోధ్రాలో శవాలను ఊరేగించి ఉద్రిక్తతలు పెంచి ఓట్లు కొట్టేశారు. పుల్వామా హతుల శవాలనూ అదే పద్ధతిలో ఊరేగించి 2019 లో ఓట్లకు గాలమేశారు.

ఈ కుట్రలు జమ్మూ కశ్మీర్‌లో విభిన్న జాతుల, మతాల మధ్య సామాజిక సామరస్యతను దెబ్బతీశాయి. ఆధిపత్య మత అల్లర్లు దేశమంతా పెరిగాయి. కశ్మీర్ యువత భద్రత క్షీణించింది. వారిని పాక్ అనుకూలురుగా ఉగ్రవాదుల పంచన చేర్చింది సంఘ్. కశ్మీర్ బయటి భారతంలో విద్య, ఉపాధి అవకాశాలు దెబ్బతింటే పాక్ కంటే భారత్ మెరుగన్న భావన పోతుంది. 2014 నుండి మోడీ ప్రభుత్వం కశ్మీర్‌కు కలిగించిన నష్టం, కశ్మీర్ పట్ల సంఘ్ ప్రవర్తన ముస్లిం రహిత కశ్మీర్ సాధనకే. సత్యపాల్ అప్పుడు చెప్పని సత్యాలను ఇప్పుడు చెప్పారు. రక్తపాతానికి కశ్మీరీ ముస్లింలే కారణమన్న అపవాదుతో, తమ కశ్మీర్ వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, తీవ్ర మతోన్మాద జాతీయవాదంతో, భారత్ హిందువులకేనన్న రాజ్యాంగ విరుద్ధ సిద్ధాంతంతో, దేశ ప్రజలను కేంద్రీకృతం చేసి 2019 ఎన్నికల్లో బిజెపి గెలిచింది.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News