Tuesday, April 30, 2024

మద్దతు ధరలకు చట్టబద్ధత , కులాలవారి జనగణన

- Advertisement -
- Advertisement -

భోపాల్ : రైతుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని పార్టీ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రైతాంగానికి కనీస మద్దతు ధరలు (ఎంఎస్‌పి)పై చట్టబద్ధత కల్పించితీరుతామని, ఇదే విధంగా కులాలవారి జనగణన తమ ప్రాధాన్యత క్రమాలలో ఒకటిగా ఉంటుందని స్పష్టం చేశారు. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్‌లోని మోరినాకు రాహుల్ భారత్ జోడో న్యాయయాత్ర శనివారం ప్రవేశించింది. ఈ సందర్భంగా ఏర్పాటు అయిన సభలో రాహుల్ ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎప్పుడూ బడా పారిశ్రామికవేత్తలకు గొడుగు పడుతోంది. ఈ క్రమంలో రైతులను ముళ్లదారిలో వదిలేస్తోందని, నినదిస్తే అణచివేస్తోందని విమర్శించారు. రైతులను గాలికొదిలేస్తోందని తెలిపారు. ఇక కులాల వారి జనగణన జరిగితేనే వివిధ వర్గాలు కోరుకుంటున్నారు. దీనిని పాలకపక్షం తొక్కిపెట్టింది. కానీ కాంగ్రెస్ వస్తే వెంటనే ఈ ప్రక్రియ చేపడుతుందని, ఇది కాంగ్రెస్ గ్యారంటీ అని రాహుల్ ప్రకటించారు.

దేశంలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన 73 శాతం మంది మేర అనేక విధాలుగా వెనుకబడ్డారు. పలు రంగాలలో వీరిని ముందుకు రానివ్వలేదు. ఇక అధికార యంత్రాంగంలోని ఉన్నత స్థానాలలో వీరి ప్రాతినిధ్యం తక్కువగా ఉంది. ఈ విషయాలన్ని కూడా కులాలవారి జనగణన క్రమంలో వెలుగులోకి వస్తాయి. దీనితో ఇటువంటి వారికి తగు న్యాయం చేకూర్చేందుకు వీలేర్పడుతుందని రాహుల్ తెలిపారు. మోరినా తరువాత రాహుల్ గ్వాలియర్ సభలో మాట్లాడారు. ఇండియా కూటమి పలు ప్రజా కేంద్రీకృత అంశాలపై వెంటనే దృష్టి సారిస్తుందని, ఇందుకు తమకు బిజెపిలాగా ఎటువంటి ప్రతిబంధకాలు లేవని స్పష్టం చేశారు. ఇక ప్రధాని మోడీ సారధ్యపు కేంద్ర ప్రభుత్వం ఏరికోరి వారి అనుంగు ఆత్మీయులు అయిన 15 మంది పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసిన రుణాల విలువ రూ 16 లక్షల కోట్ల వరకూ ఉంటుంది. కానీ కష్టపడి ప్రజలకు ఆహారం పండించే రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని , ఎంఎస్‌పి చట్టబద్ధతపై కాలయాపనకు దిగుతోందని విమర్శించారు.

ఇటువంటి పాలకులకు ఇక కాలం చెల్లుతుందని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక అసమానతలు మరింతగా పెరిగాయి. కేవలం 22 మంది అత్యంత సంపన్నుల వద్ద సొమ్ము పేరుకుని ఉంది. ఈ ధనం విలువ దేశ జనాభాలోని సగభాగం కలిపితే ఉండే సంపద అంతగా ఉందని తెలిపారు. కాగా ఐదు శాతం సంపన్నవర్గం వద్ద దేశ ద్రవ్యంలోని 60 శాతం వరకూ ఉందని , ఇంతకంటే ఆర్థిక అసమానత ఏముంటుందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News