Tuesday, April 30, 2024

రాహుల్‌కు మళ్ళీ చుక్కెదురు!

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో కింది కోర్టు ఆయనకు క్రిమినల్ సెక్షన్ కింద శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాని వల్ల రెండేళ్ల శిక్ష, పార్లమెంటు సభ్యత్వం రద్దు ఆయనకు సంక్రమించాయి. పార్లమెంటు సభ్యత్వం రద్దును వెంటనే అమల్లోకి తెచ్చారు. అధికారిక నివాస భవనం నుంచి కూడా హుటాహుటిన ఖాళీ చేయించారు. రెండేళ్ల శిక్ష విషయం మాత్రం న్యాయ స్థానాల్లో ఉంది. ప్రతి శిక్ష పైన స్టే మంజూరు చేయాలన్న రూలేమీ లేదని, ఆయన (రాహుల్) పైన పది కేసులున్నాయని ఏకసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. రాహుల్ గాంధీ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో మాట్లాడుతూ వీర్ సావర్కర్‌ను కూడా విమర్శించాడని, సావర్కర్ మనుమడు కూడా కేసు వేశాడని, ప్రజాప్రతినిధులు స్వచ్ఛమైన గుణగణాలు కలిగి వుండాలని న్యాయమూర్తి హేమంత్ ప్రచ్ఛ అన్నారు. అందుచేత రాహుల్ గాంధీ అభ్యర్థనను తోసిపుచ్చుతున్నామని ప్రకటించారు.

2019 ఎన్నికల్లో కర్ణాటకలోని కోలారు సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దొంగలందరి ఇంటి పేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయి అని ఎత్తి పొడిచారు. బ్యాంకులను ముంచిన నీరవ్ మోడీ, లలిత్ మోడీలతో ప్రధాని నరేంద్ర మోడీని పోల్చి విమర్శించారు. దీనికి అభ్యంతరం తెలుపుతూ గుజరాత్‌కు చెందిన మాజీ బిజెపి ఎంఎల్‌ఎ, పేరు చివరి మోడీ కలిగిన పూర్ణేశ్ మోడీ సూరత్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆ కోర్టు ఇటీవల పరువు నష్టం కేసులోని క్రిమినల్ సెక్షన్‌ని ప్రయోగించి రెండేళ్ల శిక్ష విధించింది. దానిపై రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేసుకోగా స్టే లభించలేదు, ఇప్పుడు హైకోర్టులోనూ అదే జరిగింది. ఇక మిగిలింది హైకోర్టు విస్తృత ధర్మాసనం, సుప్రీంకోర్టు. పరువు నష్టంలో క్రిమినల్ శిక్షను తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. దేశంలోని మెజారిటీ మేధావులు, న్యాయ నిపుణులు గట్టిగా దీనిని డిమాండ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగం సకల సహేతుక స్వేచ్ఛల సమాహారం అనడానికి వెనుకాడవలసిన పనిలేదు.

అందరి బాగు కోసం అందరూ కృషి చేస్తూ నిజమైన ప్రజాస్వామ్యాన్ని వర్ధిల్ల జేయడం వైపు జాతి అడుగులు వేయాలని ఆశించి అందుకు తగిన ఏర్పాట్లను రాజ్యాంగ నిర్మాతలు చేశారు. అందులో ముఖ్యమైన ఏర్పాటు వాక్ స్వాతంత్య్రం. అదే సందర్భంలో ఏ వ్యక్తి వ్యక్తి గత గౌరవానికి భంగం కలిగించే దూషణ గాని, విమర్శ గాని చేయకుండా కట్టడి చేయడానికి తగిన అవకాశాన్ని కూడా రాజ్యాంగం కల్పించింది. దానిని ఉపయోగించుకొని ఊడిపడిందే పరువు నష్టం దావా. అయితే జనహితం కోరి చేసే విమర్శను పరువు నష్టంగా పరిగణించనవసరం లేదనే కోణం కూడా ఇందులో వుంది. పాలనాపరమైన నిర్ణయాలు ప్రజలకు హాని చేసేవిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లకుండా ఉండడానికి పాలకులు పరువు నష్టం కేసులు పెట్టి అందరి నోళ్లు మూయించే దారిని ఎంచుకోడానికి అవకాశాలున్నాయి. అందుకే క్రిమినల్ పరువు నష్టం అవకాశాన్ని దురుపయోగిస్తారనే స్పృహతోనే ఇంగ్లాండ్, అమెరికా తదితర చాలా దేశాలు దాన్ని వదిలించుకొన్నాయి.

మన దేశంలోనూ అది జరగాలని మానవ హక్కులకు, వ్యక్తి స్వాతంత్య్రానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు విలువ ఇచ్చే వారందరూ కోరుతున్నారు. పరువు నష్టం దావా ద్వారా రాజకీయ ప్రత్యర్థులను కాకుండా పాత్రికేయులను, పత్రికలలో స్వేచ్ఛగాఅభిప్రాయ ప్రకటన చేసే వారిని కూడా శిక్షించవచ్చు. గతంలో రాజీవ్ గాంధీ హయాంలో పత్రికా స్వేచ్ఛపై వేటు వేయవలచినప్పుడు పాత్రికేయులందరూ దానిపై సంఘటితంగా పోరాడి విజయం సాధించుకొన్న సంగతి తెలిసిందే. పరువు నష్టం దావాలోని క్రిమినల్ సెక్షన్‌ను కొట్టి వేసినా సివిల్ దావాల ద్వారా భరించలేని జరిమానాలు విధించి కక్ష తీర్చుకొనే ప్రమాదం లేకపోలేదు. అందుచేత భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే వారి మీద ఇతరత్రా చట్టంలోని కఠినమైన నిబంధనలను ప్రయోగించే అవకాశం పాలకులు ఎలాగూ వుంది కాబట్టి పరువు నష్టం సెక్షన్‌ను పూర్తిగా ఎత్తి వేయడమే మంచిది. రాహుల్ గాంధీని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నంత కాలం ఆయన ప్రతిష్ఠ పెరిగే అవకాశాలే వున్నాయి.

అది ప్రధాని మోడీ ప్రభుత్వానికి ముప్పుగా పరిణమించగలదు. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన ఇందిరా గాంధీని జనతా పాలకులు షా కమిషన్ ద్వారా, ఇతరత్రా వేధించి చివరికి ఆమె మళ్ళీ ప్రధాని అయ్యేందుకు దోహదపడ్డారు. ప్రశ్నను వివేకాన్ని కాలరాసే చట్టాలను కొనసాగించే దేశం ప్రజాస్వామ్య దేశం అనిపించుకోజాలదు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షాల గొంతును నొక్కివేయడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అది నేలకు వేసిన బంతిలా పైకి లేస్తూనే వుండడం పాలకులు గమనించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News