Saturday, April 27, 2024

రాహుల్‌కు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : లోక్‌సభ ఎంపిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఇక ముందు కూడా కొనసాగనుంది. ప్రధాని మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యల సంబంధిత కేసులో గుజరాత్ హైకోర్టు నుంచి రాహుల్‌కు శుక్రవారం చుక్కెదురైంది.సూరత్ సెషన్స్‌కోర్టు తనను దోషిగా ఖరారు చేయడాన్ని నిలిపివేయాలనే ఆయన అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చింది. దోషిత్వ నిర్థారణలో అనుచితం కన్పించడం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. 2019లో ఎన్నికల ప్రచార దశలో రాహుల్ తమ ప్రసంగంలో మోడీ ఇంటిపేరును తీసుకుని పరుషపదజాలం వాడారనే అభియోగాలు ఉన్నాయి. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లగా ఆయన కేరళ వాయనాడ్ ఎంపి సీటును కోల్పోవల్సి వచ్చింది. దీనితో పాటు శిక్షకు కూడా వీలేర్పడింది. ఆయన దోషి అని పేర్కొనడం సముచితంగానే ఉంది. చట్టబద్ధత కూడా ఉందని హైకోర్టు తెలిపింది.

ఆయన ఎంపి సీటు అనర్హత చెల్లుతుందని స్పష్టం కావడంతో ఇక ఈ నెల 20 నుంచి ఆరంభం అయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు రాహుల్ హాజరు కావడం కుదరదు. గుజరాత్ హైకోర్టు ఇప్పుడు వెలువరించిన రూలింగ్‌తో ఎంపి అనర్హత విషయంలో రాహుల్ ఇప్పుడు క్లైమాక్స్ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గుజరాత్ హైకోర్టు రూలింగ్‌ను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు. అక్కడ కూడా సుప్రీంకోర్టు ఆయన అప్పీలును తోసిపుచ్చితే ఇక వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుండదు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయనకు విధించిన రెండేళ్ల జైలు శిక్షను ఇప్పటికే కోర్టు నిలిపివేసింది. ఇప్పటికే పుణే కోర్టులో రాహుల్ గాంధీపై వినాయక్ వీర్ సావర్కర్ మనవడు దాఖలు చేసిన మరో పరువు నష్టం దావా గురించి కూడా శుక్రవారం గుజరాత్ హైకోర్టు ప్రస్తావించింది.

సుప్రీంకోర్టుకు వెళ్లనున్న రాహుల్
అనర్హత వేటుపై గుజరాత్ హైకోర్టు రూలింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం నిర్థారించాయి. ఆయనకు చట్టపరంగా పలు మార్గాలు ఉన్నాయని, దోషిత్వ ఖరారు వీగిపొయ్యేందుకు ప్రతి ఒక్క అవకాశాన్ని వాడుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేత , లాయర్ అభిషేక్ సింఘ్వీ శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌పై దాఖలు అయిన వ్యాజ్యం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించినది. దీనిపై తమ న్యాయపోరు సాగుతుందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News