Monday, April 29, 2024

సత్వర న్యాయం ఇంకెప్పుడు?

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం గల మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా నాలుగు స్తంభాల ఆధారంగా మనుగడ కొనసాగిస్తున్నది. వాటిలో మొదటి స్తంభం పార్లమెంటు, శాసన సభలు (Legislature). ఈ చట్ట సభల ద్వారా చట్టాలను రూపొందించి పాలనా విధానాలకు రూపం ఇస్తారు. రెండవ స్తంభం కార్యనిర్వాహక వ్యవస్థ (Executive).చట్ట సభలైన పార్లమెంటు, శాసన సభలలో ఆమోదింపబడిన విధానాలను అమలు చేయడం కార్యనిర్వాహక వ్యవస్థ విధి. మూడవ స్తంభం న్యాయ వ్యవస్థ (Judiciary). ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు, నిర్ణయాలు, వాటి అమలు రాజ్యాంగ నిబంధనల పరిధిలో ఉన్నా యో లేదో, రాజ్యాంగం ప్రాథమిక సూత్రాలకు లోబడి ఉన్నాయో లేదో సమీక్షించటానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. భారత దేశ న్యాయ వ్యవస్థలో భాగంగా 26 జనవరి 1950న స్థాపించబడిన సుప్రీంకోర్టుతో సహా హైకోర్టులు, జిల్లా, మునిసిపల్, గ్రామ స్థాయిలలో సబార్డినేట్ కోర్టులు పని చేస్తాయి.

ప్రజాస్వామ్య మూల స్తంభాలలో నాల్గవది, చివరిది వార్తా వ్యవస్థ (Press/ Media). అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మూలస్తంభాలలో ఒకటైన న్యాయ వ్యవస్థ సత్వర న్యాయాన్ని అందించడంలో విఫలమవుతుందన్న విమర్శలు తరుచూ వినబడుతుంటాయి. వంద మంది నేరస్థులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు అన్న మౌలిక సూత్రం ఆధారంగా పని చేసే మన న్యాయ వ్యవస్థ ఆలస్యంగా అందించే న్యాయం, న్యాయ నిరాకరణతో సమానం (Justice Delayed is Justice Denied) అనే విషయాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని పని చేస్తే బాగుంటుంది.
సాధారణంగా మనం న్యాయ స్థానాలలో న్యాయ దేవత (Lady Justice) ప్రతిమ ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి, కళ్ళకు గంతలు కట్టబడి ఉండటాన్ని గమనిస్తాము. ఇవి న్యాయ దేవతకు చిహ్నాలుగా 16వ శతాబ్దం నుండి మనుగడలో ఉన్నాయి. ఆమె కళ్ళ గంతలు ప్రతీకాత్మకం.

ఒక వ్యక్తి జాతి, లింగం, సంపద, అధికారం లేదా న్యాయాన్ని ప్రభావితం చేసే ఇతర అంశాలను న్యాయ దేవత చూడదని, ఆమె నిష్పక్షపాతంగా ఉంటుందని, మనుషుల్లో విభేదాలకు/ వ్యత్యాసాల పట్ల గుడ్డిగా ఉంటుందని అర్థం. సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకుని పక్షపాతం లేకుండా న్యాయం అందజేయబడుతుంది అని అర్ధం. కత్తి ఎప్పుడూ త్రాసు కంటే కింద భాగాన ఉంటుంది. ఎందుకంటే సాక్ష్యం తూకం వేసిన తర్వాత, అంటే నేరం రుజువైతేనే శిక్ష విధించబడుతుందనటానికి ఇది సూచన. అయితే అలానే ఉండాలనే నిబంధన ఏదీ లేకపోవడంతో న్యాయ దేవత ఒక్కో చోట ఒక్కోలా దర్శనమిస్తుంది. భారత న్యాయ వ్యవస్థలో ఒక వ్యక్తి జాతి, లింగం, ఆర్ధిక స్థితిగతులు, అధికారం తదితర అంశాలు న్యాయ దేవతను ప్రభావితం చేయజాలవని, ఆమె దృష్టిలో అందరూ సమానమేనని, నిష్పక్షపాతంగా సాక్ష్యాధారాలను పరిగణనలోనికి తీసుకున్న తరువాతనే న్యాయం వెలువరిస్తుందని అంటారు.

అయితే సమాజంలో పలుకుబడి గల వారు, సంపన్నుల కోసం న్యాయ స్థానాలు సెలవు దినాలలో సైతం పని చేసిన దృష్టాంతాలు చరిత్రలో ఉన్నాయి. 2002 నాటి గుజరాత్, గోద్రా అల్లర్లకు సంబంధించి తప్పుడు సాక్ష్యాధారాలను సృష్టించి ఉన్నతాధికారులను ఇరికించడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కేసు కోసం సెలవు దినం అయినప్పటికీ శనివారం, 1 జూలై 2023న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా సమావేశమవడం అలాంటిదే. తొలుత సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సాయంత్రం 6:30 గంటలకు తీస్తా పిటిషన్‌ను విచారించింది. ఇద్దరు న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్రిసభ్య ధర్మాసనానికి కేసు బదిలీ అయింది.

శనివారం రాత్రి 9:15 గంటలకు దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిజ్ ఎఎస్ బోపన్న, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ వెంటనే లొంగిపోవాలన్న గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. తీస్తా సెతల్వాద్‌కు ఏడు రోజుల మధ్యంతర రక్షణ కల్పిస్తూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం మహిళగా ప్రత్యేక రక్షణ పొందేందుకు తీస్తా సెతల్వాద్ అర్హురాలని సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులపై అప్పీలు చేసుకునేందుకు ఆమెకు సమయం ఇవ్వకపోవడం నిర్హేతుకమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. తీస్తా సెతల్వాద్ కేసులో సుప్రీంకోర్టు చూపిన ప్రత్యేక చొరవ, సాధారణ విచారణ ఖైదీల కేసులలో కూడా చూపగలిగిన నాడు మన న్యాయ వ్యవస్థ తప్పకుండా ప్రజల మన్ననలు చూరగొంటుంది.

దేశంలోని వివిధ జైళ్లలో ఉన్న మొత్తం ఖైదీలలో దాదాపు 4 లక్షల మందికి పైగా విచారణ ఖైదీలు (Under Trials) ఉండడం మన న్యాయ వ్యవస్థ నత్తనడకకు దర్పణం పడుతుంది. ఎందుకు సమాజంలో కేవలం పలుకుబడి గల నిందితులు మాత్రమే సత్వర న్యాయం పొందగలుగుతున్నారు? కోర్టుల దృష్టిని అంతగా ప్రభావితం చేయగల అంశాలు ఏమిటి? అని ప్రశ్నించుకుంటే భారీ ఫీజులు వసూలు చేసే పలుకుబడి గల న్యాయవాదుల ద్వారా మాత్రమే సత్వర న్యాయం సాధ్యమవుతుందన్న విషయం మనకు బోధపడుతుంది. అయితే మధ్యాదాయ, స్వల్పాదాయ విచారణ ఖైదీలకు ఇంత భారీ మొత్తంలో ఫీజులు చెల్లించి ఖరీదైన న్యాయవాదులను నియమించుకోవడం సాధ్యమయ్యే పనేనా? దేశంలోని మొత్తం విచారణ ఖైదీలలో దాదాపు 60 శాతం మంది అట్టడుగు వర్గాలకు చెందినవారు కావడం గమనార్హం.

అంటే వారి ఆర్ధిక పరిస్థితి కారణంగా వారు విచక్షణకు గురవుతూ జైళ్లలో పడి మగ్గాల్సిందేనా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఏ రాజకీయవేత్తో, సెలబ్రిటీనో లేదా ధనవంతుడో అయితే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ పూర్తవుతుంది. దేశంలో కొందరు ప్రముఖ న్యాయవాదులు రూ. 15 నుండి రూ. 20 లక్షలు ఫీజు వసూలు చేస్తూ సత్వరమే న్యాయ ప్రక్రియ పూర్తయ్యేందుకు దోహదపడుతున్నారు. అలా అని న్యాయవాదులందరూ అలానే ఉంటారనుకుంటే పొరబాటే. మన దేశంలో కక్షిదారు ఆర్ధిక స్థితిగతులను బట్టి పూర్తి ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజు తీసుకుని నిబద్ధతతో వ్యాజ్యాలు నడిపే న్యాయవాదులూ లేకపోలేదు. దేశంలోని వివిధ జైళ్ళలో ఉన్న ఖైదీలలో 77 శాతం మంది (4.27 లక్షలకు పైచిలుకు) విచారణ ఖైదీలు అని తెలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు.

నేరం మోపబడి విచారణ ప్రక్రియ పూర్తి కానందున జైలులో ఉండే నిందితులను విచారణ ఖైదీలు అంటారు. వీరిలో దాదాపు 60 శాతం మంది దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారు. ఆందోళన కలిగించే మరో అంశం ఏమిటంటే దేశ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల కేసులు పెండింగ్‌లో ఉండటం. ఒక పక్క సాధారణ విచారణ ఖైదీలు దశాబ్దాల తరబడి న్యాయం కోసం పడిగాపులు పడుతుండగా మరోపక్క రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సంపన్నులు తమ అర్థబలం, పరపతి, పలుకుబడులతో సత్వరం న్యాయ ప్రక్రియను పూర్తి చేయించుకోగల్గుతున్నారు. ఈ నేపథ్యంలో ధన బలం, పలుకుబడి లేక జైళ్ళల్లో మగ్గుతున్న సాధారణ విచారణ ఖైదీల వెతలను గుర్తించిన సుప్రీంకోర్టు ఈ సమస్య పరిష్కారానికి, కోర్టులలో పెండింగ్ కేసులను తగ్గించేందుకు దిగువ కోర్టులకు జైలుకు బదులుగా బెయి లు లాంటి మార్గదర్శకాలను సూచించినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు.

సమాజంలో పలుకుబడి గల రాజకీయవేత్తలు, సెలబ్రిటీలు, సంపన్నుల కోసం సెలవు రోజున కూడా పని చేసే కోర్టులు సాధారణ విచారణ ఖైదీల కోసం కూడా అదే ప్రక్రియను అవలంబించడానికి వారికి ఉన్న ప్రతిబంధకాలు ఏమిటో మరి!
భారత న్యాయ వ్యవస్థలో భాగంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుతో సహా 25 హైకోర్టులు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో పేర్కొన్న గరిష్ఠ సంఖ్య 34 కు గాను, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ (డి) వై చంద్రచూడ్ తో సహా సుప్రీంకోర్టులో ప్రస్తుతం 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రూ. 2.80 లక్షలు, సుప్రీం కోర్టులోని ఇతర న్యాయమూర్తులు రూ. 2.50 లక్షలు నెలసరి జీతంతో పాటు వివిధ రకాల భత్యాలు అందుకుంటారు. 65 సంవత్సరాలకు పదవీ విరమణ చేసే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పదవీ విరమణానంతరం పింఛనుతో పాటు కరువు భత్యం కూడా పొందుతారు.

ప్రతి హైకోర్టుకు ఒక ప్రధాన న్యాయమూర్తితో పాటు ఆయా కోర్టులకు మంజూరైన గరిష్ఠ సంఖ్య ప్రకారం న్యాయమూర్తులు ఉంటారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు తెలంగాణ హైకోర్టుకు గరిష్ఠంగా 42 మంది న్యాయమూర్తులు మంజూరు కాగా, అందులో 32 మంది శాశ్వత, 10 మంది తాత్కాలిక న్యాయమూర్తులు ఉన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రూ. 2.50 లక్షలు, హైకోర్టు ఇతర న్యాయమూర్తులు రూ. 2.25 లక్షలు నెలసరి జీతంతో పాటు వివిధ రకాల భత్యాలు అందుకుంటారు. 62 సంవత్సరాలకు పదవీ విరమణ చేసే హైకోర్టు న్యాయమూర్తులు, పదవీ విరమణానంతరం పింఛనుతో పాటు కరువు భత్యం కూడా పొందుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News