Sunday, May 5, 2024

మరో 72 గంటల పాటు అప్రమత్తతే

- Advertisement -
- Advertisement -

 

వరుణుడి ఆగ్రహం నీటమునిగిన పంటపొలాలు
రైతన్నలకు అపార నష్టం, ఆవేదన భాగ్యనగరాన్ని
ముంచెత్తిన వాన మళ్లీ వర్షసూచనతో
రాష్ట్రమంతటా అధికారుల అప్రమత్తత
రంగంలోకి మాన్సూన్, డిఆర్‌ఎఫ్ బృందాలు
విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చర్యలు

మన తెలంగాణ/హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల భాగ్యనగర్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెరపి ఇచ్చినట్లే తెరపిచ్చి అక్మస్మాత్తుగా వర్షం దంచికొడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండి రోడ్లపైకి నీరు చేరుతోంది. రహదారులు అధ్వాన్నంగా మారాయి. చేతికంది వచ్చిన పంట పొలాలు నీట మునిగాయి. రైతన్నలకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన హెచ్చరికలతో భాగ్యనగర్ వాసులతో పాటు పలు జిల్లాల వాసులు ఆందోళన అంతా ఇంతా కాదు. మెదక్, సిద్ధిపేట, గద్వాల జోగులాంబ, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్ అర్బన్, రూరల్, కొత్తగూడెం సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల పరిధిలోని గడ్డిగూడెం, ఉలవచెలక, ఐలాపురం, పినపాక, బయ్యారం తదితర గ్రామాల పరిధిలో సుమారు 60 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. కామారెడ్డి, లింగంపేట పరిధిలో ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఎన్నడూ లేని విధంగా కామారెడ్డి జిల్లాలో ఐదు లక్షల 35 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా, పత్తి, పెసర, మినుము పంటలు సాగు చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి అప్పులు చేసి పంటలు సాగు చేస్తే వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. లక్షలాది రూపాయల పంట నీట మునగడంతో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పత్తి నల్లగా మారిపోయింది. మరోవైపు వరి నెలబారి పోతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు వర్షాలు కురుస్తున్న కారణంతో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు ఆ శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రజలకు తగు సూచనలు ఇస్తున్నారు.

వాగులో వంద గొర్రెలు గల్లంతు

జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్‌లో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులో వందకు పైగా గొర్రెలు కొట్టుకుపోయాయి. ఇటిక్యల మండలం మానవపాడులో భారీ వర్షాలకు పత్తి, మిరప పంటలన్నీ నీట మునిగాయి. వాగు సమీపంలో వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, దామోదర్, అయ్యన్న, చిన్నయ్య గొర్రెల కాపరులు సుమారు 400కు పైగా గొర్రెలను పొలంలో కంచెవేసి మేపుకుంటున్నారు. సోమవారం తెల్లవారుజామున వాగు ఒక్కసారిగా ఉద్ధృతంగా రావడంతో నిద్రలో ఉన్న కాపరులు లేచి చూసేసరికి గొర్రెలు నీట మునిగాయి. కంచె తీసి ఒడ్డుకు తోలుతున్న సమయంలో వాగు ఉద్ధృతికి సుమారు వందకు పైగా గొర్రెలు కొట్టుకుపోయాయని తెలిపారు. గొర్రెలో తమకు జీవనాఢారం. వాగులో గొర్రెలు కొట్టుకుపోవడంతో ఆవేదన చెందుతున్నారు.

వర్షం సమస్యలపై బల్దియాకు
డ్రైనేజి ఓవర్ ఫ్లోపైనే భారీ ఎత్తున ఫిర్యాదుల వెల్లువ

భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని డ్రైనేజీ, మ్యాన్‌హోల్స్ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువగా వస్తున్నాయి. సోమవారం జంటనగరాల్లో కాల్‌సెంటర్, వెబ్‌సైట్, డయల్ 100, మై జీహెచ్‌ఎంసి యాప్ ద్వారా 279 ఫిర్యాదులు అందాయని బల్దియా అధికారులు వెల్లడించారు. వీటిలో అత్యధికంగా డ్రైనేజి ఓవర్ ఫ్లోపైనే ప్రజలు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. పలుచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచి ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ప్రజలు జిహెచ్‌ఎంసీ అధికారులను కోరారు. వీటిలో కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కారం కాగా.. అధిక శాతం పెండింగ్‌లో ఉంటున్నాయి.

అప్రమత్తంగా ఉండండి..

రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 9 నుంచి 16 సెంటిమీటరల వర్షపాతం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మంగళవారం భాగ్యనగర్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News