Sunday, April 28, 2024

మోడీకి చమురు ధరల పీడ కలలు!

- Advertisement -
- Advertisement -

Real concern among Modi fans began

 

సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్‌లో పీపా ముడి చమురు ధర 70.82 డాలర్లు (2019 మే తరువాత ఇది గరిష్ఠం) పలికి 68 డాలర్లకు పడిపోయింది. మంగళవారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం పదకొండు గంటల సమయంలో 68.82 డాలర్లు ఉంది. ఈ పెరుగుదలతో అనేక మంది నరేంద్ర మోడీ అభిమానుల్లో అసలైన ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్లో “అషోల్ పరివర్తన్‌” (అసలైన మార్పు) తెస్తామని ప్రధాని బిజెపి ఎన్నికల సభలో చెప్పారు. కాని పెట్రో ధరల గురించి ఒక్క మాటా అనలేదు.

ఒపెక్ ప్లస్ దేశాలు(చమురు ఉత్పత్తి ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)లో లేకుండా గణనీయంగా చమురును ఉత్పత్తి ఎగుమతి చేసే దేశాలు) ఏప్రిల్లో కూడా ఉత్పత్తిని తగ్గించాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించటంతో ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మే నెల నుంచి చమురు ధరలు తగ్గుతాయని కబుర్లు చెబుతున్న బిజెపి పెద్దలకు అది ఎక్కడైనా తగిలిందో లేదో తెలియదు. గత నాలుగు రోజులుగా ధర పెరుగుతూనే ఉన్నా సోమవారం నాడు ఎక్కువగా పెరగటానికి కారణం అని సౌదీ అరేబియా దాడులను ప్రతిఘటిస్తున్న యెమెన్‌లోని హుతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి దాడి అని చెబుతున్నారు. సౌదీ చమురు కంపెనీ ఆరావ్‌ు కో ప్రధాన కేంద్రాలపై ఆదివారం నాడు ఈ దాడి జరిగింది. దీని తీవ్రత ఇంకా తెలియదు, ఆందోళనపడిన వారు చమురు కొనుగోలుకు ఆతృపడిన కారణంగా ధర పెరిగినట్లు కనిపిస్తోంది.

ఆ దాడులతో నిమిత్తం లేకుండానే ధరలు పెరగటానికి ముందే చెప్పుకున్నట్లు ఉత్పత్తి తగ్గింపు నిర్ణయమే అసలు కారణం. చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయటంలో ఒపెక్‌లో సౌదీ అరేబియా, దాని వెలుపల రష్యా ఇప్పుడు కీలక పాత్రధారులుగా ఉన్నాయి. ధరలు పెరగటం తమ షేల్ అయిల్ కంపెనీలకు లాభాలు తెచ్చిపెడతాయి గనుక అమెరికా కూడా సంతోషంగానే ఉంది. చమురు ఆదాయమే ప్రధాన వనరుగా ఉన్న వెనెజులా వంటి దేశాలకూ ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. చమురు దిగుమతుల మీద ఆధారపడిన చైనా మనకంటే ఎంతో మెరుగైన స్దితిలో ఉంది కనుక దానికి ఇబ్బంది లేదు. ధరల పెరుగుదలతో ఎటొచ్చీ తీట వదిలేది మనకే. అమెరికా నుంచి ఆయుధాలు, ఆయిలు తెచ్చుకుంటూ కొత్త సమస్యలూ తెచ్చుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో రోజుకు పదిహేను లక్షల పీపాల మేరకు చమురు ఉత్పత్తి కోత విధించనున్నట్లు జోస్యం చెబుతున్నారు.

అయితే ఈ కోత నుంచి రష్యా, కజకస్ధాన్లు మినహాయింపు పొందాయి. రష్యా లక్షా 30 వేలు, కజకస్దాన్ ఇరవై వేల పీపాల మేరకు రోజు వారీ ఉత్పత్తిని పెంచనున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో కూడా అవి మినహాయింపు పొందటానికి స్ధానికంగా చలి కాలంలో ఎక్కువ వినియోగమే కారణం. తాను మాత్రం రోజుకు పది లక్షల పీపాల కోత నిర్ణయానికి కట్టుబడే ఉన్నానని, ధరలతో తమకు నిమిత్తం లేదని సౌదీ ప్రకటించింది. కోత ఎప్పటి వరకు అన్నది కూడా వెల్లడించని కారణంగా ఒక్క మన పాలకుల్లో తప్ప అన్ని వినియోగదేశాల్లో ఆందోళన పెరిగింది. పెరిగిందాని కన్నా ఎక్కువగా వసూలు చేసినా ఇదేం దోపిడీ అని అడిగే దమ్మూ ధైర్యం మన వినియోగదారులకు లేనందున కేంద్ర ప్రభుత్వానికి ఎలాగూ పట్టదు. ఎంత పెరిగితే అంత ఆదాయం తమకు పెరుగుతుంది కనుక మెజారిటీగా ఉన్న బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు ఇతరులూ పట్టించుకోరు. ప్రస్తుతం ఉన్న జోస్యాల ప్రకారం ఏప్రిలుసెప్టెంబరు మాసాల మధ్య బ్రెంట్ రకం ముడి చమురు 75 నుంచి 80 డాలర్ల మధ్య ఉండవచ్చు. ఈ నెలాఖరుకు 70 డాలర్ల వరకు పెరగవచ్చని సిటీ బ్యాంకు అంచనా వేసిందని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి.

అయితే సోమవారం నాడు 71డాలర్ల వరకు పెరిగిన తీరు చూసిన తరువాత జోస్యాలన్నీ గాల్లో కలసి అంతకంటే ఎక్కువగా పెరిగినా ఆశ్చర్యం లేదు. చమురు దిగుమతి దేశంగా ఉన్న అమెరికా ఇప్పుడు ఎగుమతి దేశాల్లో ఒకటిగా మారింది. అందువలన ధరల పెరుగుదలను అక్కడి చమురు ఉత్పత్తి ముఖ్యంగా షేల్ కంపెనీలు కోరుకుంటాయి. అయితే తన ఎన్నికను దృష్టిలో ఉంచుకొని అమెరికా వినియోగదార్లకు ధరలు తక్కువగా ఉంచేందుకు గాను డోనాల్డ్ ట్రంప్ సౌదీ పై వత్తిడి తెచ్చి ధరలను అదుపు చేయించాడని, ఇప్పుడు జో బైడెన్ అధికారంలో ఉన్నందున సౌదీ గతంలో మాదిరి వ్యవహరించకపోవచ్చనే అభిప్రాయాలూ వెల్లడవుతున్నాయి.

అరబ్బు దేశమైన ఎమెన్‌లో సంవత్సరాలుగా అంతర్యుద్ధం జరుగుతోంది. అక్కడి ప్రభుత్వానికి సౌదీ అరేబియా నాయకత్వంలోని కొన్ని అరబ్బు దేశాలు మద్దతు ఇవ్వటమే కాదు, తిరుగుబాటుదార్ల పట్టున్న ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. అమెరికా తన చేతులకు మట్టి అంటకుండా ఈ పని చేయిస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక శక్తులైన హుతీలకు ఇరాన్ మద్దతు ఉంది. రాజధాని సనా తిరుగుబాటుదార్ల వశంలోనే ఉంది. దాని మీద దాడుల నేపథ్యంలోనే ఆదివారం నాడు హుతీ దళాలు డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించాయి. వాటిని తాము అడ్డుకున్నట్లు సౌదీ చెబుతోంది. అందువలన రానున్న రోజుల్లో ఎమెన్‌పై సౌదీ దాడులు పెరిగితే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. అవి చమురు ధరల మీద ప్రభావం చూపవచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలేవీ కొద్ది నెలల క్రిందట ఊహించినవి కాదు.

పడిపోయిన చమురు డిమాండ్ పెరుగుతుందని భావించారు తప్ప ధరల పెరుగుదలను ఊహించలేదు. గత ఆరు సంవత్సరాలుగా చమురు ధరలు గణనీయంగా పడిపోవటం ద్వారా కలిగిన ఆర్ధిక ఉపశమనాన్ని నరేంద్ర మోడీ ఘనతగా, మోడినోమిక్సుగా ఆయన భక్తులు ప్రచారం చేశారు. ఇప్పుడు చమురు ధరలు పెరుగుతుంటే భక్తిగీతాలాపనకు బ్రేకుపడింది. రిజర్వు బ్యాంకు అంచనా ప్రకారం పీపా చమురు ధర పది డాలర్లు పెరిగితే మన చమురు వాణిజ్య లోటు 1250 కోట్ల డాలర్లు (రూపాయల్లో సోమవారం నాడున్న విలువ ప్రకారం 91,622 కోట్లు ) పెరుగుతుంది. ఎంత పెరిగితే అంత మనం చెల్లించాలని అతల్ బిహారీ వాజ్‌పేయి ఏలుబడిలో ప్రవేశపెట్టిన విధానాన్ని నరేంద్ర మోడీ ఎలాంటి శషభిషలు లేకుండా అమలు జరుపుతున్నందున మరో విధంగా చెప్పాలంటే అంత మొత్తాన్ని లేదా ఇంకా ఎక్కువగానే మన నుంచి వసూలు చేస్తారు. గతేడాది డిసెంబరు నాటికి మనం కొనుగోలు చేసిన ముడి చమురు ధర 49 డాలర్లు ఉంది. ఇప్పుడు 68 డాలర్లకు పెరిగింది, అంటే మన లోటు లేదా భారం రెండు లక్షల కోట్లు పెరిగినట్లే.

భర్త సంపాదన భార్య బుట్టలోలకులకే సరిపోయిందన్న సామెత తెలిసిందే. జన వేతనాలు ఎంత పెరిగినా, పెరగకున్నా కేంద్ర ప్రభుత్వానికి ఇంత మొత్తం చెల్లించాల్సిందే. మన కరెన్సీ పతనం అయితే అది అదనపు భారం. చమురు ధరల ప్రభావం కరెంట్ ఖాతా లోటు మీద ఎలా ప్రభావం చూపుతుందో దిగువ పట్టికలో చూడవచ్చు.

చమురు ధరల పెరుగుదల పెట్రోలు, డీజిలును వినియోగించే వారి మీద ప్రత్యక్ష భారాన్ని మోపితే పరోక్ష భారం జనం అందరి మీదా పడుతుంది. ఇది చమురు వినియోగదారులకు అదనం. చమురు ధరల పెరుగుదల వలన ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. నిజ వేతనాలు పతనమవుతాయి, దానికి అనుగుణ్యంగా వేతనాలు పెంచకపోతే జీవితాలు దిగజారతాయి. అది కొనుగోలు శక్తిని దెబ్బ తీసి పారిశ్రామిక, వాణిజ్య, సేవారంగాలు కుంటుపడి కొత్త సంక్షోభానికి దారితీసి ఉపాధిని దెబ్బ తీస్తుంది. ఇది ఒక విష వలయం. ఒకటి మరొకదానిని దెబ్బతీస్తుంది. మన వాణిజ్య లోటు పెరిగిన కొద్దీ మన రూపాయి విలువ మీద వత్తిడి పెరిగి పతనానికి దారి తీస్తుంది. అది మనం దిగుమతి చేసుకొనే చమురుతో సహా అన్నింటి ధరల పెరుగుదలకూ దారి తీస్తుంది. నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన సమయంలో 58 గా ఉన్న మన రూపాయి విలువ ఇప్పుడు మోడీ వయస్సును కూడా అధిగమించి 73పైగా ఉంది.

చమురు ధరల పెరుగుదల పరిశ్రమలు, వాణిజ్యం మీద కూడా పడి కంపెనీల వాటాల ధరల మీద ప్రభావం చూపుతుంది. వాటి ధరలు పడిపోతే విదేశీ సంస్ధలు తమ వాటాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయి కొత్త సమస్య మొదలవుతుంది. గతంలో ఇది తీవ్రమై బంగారాన్ని తాకట్టు పెట్టటం, రూపాయి విలువ తగ్గించటం, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ షరతులను ఆమోదించి మన మార్కెట్‌ను తెరవటం వంటి అవాంఛనీయ పరిణామాలకు మన పాలకులు తెర లేపారు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి అప్పుడే ఇంకా తలెత్తనప్పటికీ మోడీ సర్కార్ మన మార్కెట్‌ను ఇంకా తెరుస్తోంది. వ్యవసాయ సంస్కరణల పేరుతో తెచ్చిన మూడు చట్టాలు వాటిలో భాగమే. ఉన్న ఆస్తులను తెగనమ్ముతోంది. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మిన తరువాత అప్పు తీసుకోవాలన్నా ఇచ్చేవారు మన ప్రభుత్వం దగ్గర ఏముంది అని చూస్తారు.

ఇప్పటి వరకు నల్లేరు మీద బండిలా నడిచిన మోడీ సర్కార్ ప్రయాణం చమురు ధరలు ఇలాగే పెరిగితే అలా సాగదు. జనం సహనానికీ ఒక హద్దు ఉంటుంది. అది దాటితే అభిమానమే దురభిమానంగా మారుతుంది. అప్పుడేం జరుగుతుందో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, అతల్‌బిహారీ వాజ్‌పేయిల ఏలుబడిలో ఏమి జరిగిందో చూసిన వారికి అర్థం అవుతుంది. కొత్త తరాలకు నరేంద్ర మోడీ అలాంటి “చైతన్యం ”, అవగాహన కలిగిస్తారా? మోడీకి ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో తన పార్టీ బలం పెరుగుదల మీదే దృష్టి ఉంది గాని జనం ఊసే లేదు. చరిత్ర పునరావృతం అవుతుంది గానీ గతం మాదిరే అవుతుందని చెప్పలేము, కొత్త రూపంలో జరుగుతుంది.

చమురు         జిడిపిలో వాణిజ్య                 వాణిజ్య లోటు
ధర              లోటు శాతం                       కోట్ల డాలర్లు
55                2.33                           6,890
65                2.76                           8,140
75               3.18                            9,390
85               3.61                            10,640

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News