Saturday, December 2, 2023

‘క్వాడ్’ అధినేతల భేటీ!

- Advertisement -
- Advertisement -

Virtual summit of head of four ‘quad’ countries

 

పదమూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొట్టమొదటిసారిగా రేపు శుక్రవారం నాడు జరుగబోతున్న నాలుగు ‘క్వాడ్’ దేశాల (ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) అధినేతల పరోక్ష (వర్చువల్) శిఖరాగ్ర సమావేశానికి విశేష ప్రాధాన్యమున్నది. జో బైడెన్ అమెరికా అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ సమావేశం పట్ల ఇంతగా ఆసక్తి ప్రదర్శించి ఇందులో పాల్గొననుండడమే దీని ప్రాధాన్యాన్ని చాటుతున్నది. అలాగే 1962 యుద్ధం తర్వాత 48 ఏళ్ల పాటు సరిహద్దుల్లో కొనసాగిన సామరస్య వాతావరణానికి తెరదించుతూ గత ఏడాది లడఖ్ వద్ద భారత్‌పై చైనా దురాక్రమణ దాడికి దిగడంతో రెండు దేశాల మధ్య అమిత్ర వాతావరణం మళ్లీ వేడెక్కడం కూడా ఈ సమావేశం ప్రాధాన్యాన్ని పెంచుతున్నది. ‘క్వాడ్’ 2007 ఆగస్టులో లో పురుడు పోసుకున్నప్పుడు హిందూ మహాసముద్రం, పసిఫిక్ సాగరాల విశాల జలాల్లో స్వేచ్ఛ సౌభాగ్యాలను కాపాడడానికి ఏర్పడిన జట్టుగా దానిని అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే వర్ణించారు. ఆ వెంటనే ఆ ఏడాది సెప్టెంబర్‌లో మలబార్ ఎక్సర్‌సైజ్ పేరిట ఈ నాలుగు దేశాల సైన్యాలు సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్నాయి.

ప్రపంచ ఆర్థిక సైనిక శక్తిగా విజృంభిస్తున్న చైనాను నిలువరించడం కోసం అమెరికా నాయకత్వంలో జరిగిన ఏర్పాటుగా ‘క్వాడ్’ను పరిగణించడం అప్పుడే మొదలైంది. దాని నాలుగు సభ్య దేశాలకూ చైనా నిరసన లేఖలు కూడా రాసింది. అయితే ఆ మరుసటి సంవత్సరమే ‘క్వాడ్’ సింగపూర్‌ల సంయుక్త నౌకాదళ విన్యాసాల పట్ల చైనా నిరసన తెలియజేయడం, ఆస్ట్రేలియాలో అధికార మార్పిడి తర్వాత అది ‘క్వాడ్’ నుంచి తప్పుకోడం, జపాన్‌లో కొత్త పాలకులు చైనాతో సామరస్య సంబంధాల వైపు మొగ్గడం , అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ 2008 జనవరిలో బీజింగ్ వెళ్లి చైనాతో సంబంధాలే తమకు ముఖ్యమని ప్రకటించడం వంటి పరిణామాలతో అప్పుడు ‘క్వాడ్’ ప్రాధాన్యాన్ని కోల్పోయి నిద్రాణావస్థలోకి జారుకున్నది. 2017లో ఏసియన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మనీలాలో కలుసుకున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్ బిల్, జపాన్ ప్రధాని షింజో అబే, భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు ‘క్వాడ్’ భద్రతా ఒప్పందానికి తిరిగి ప్రాణం పోశారు.

మన ఆహ్వానం మేరకు 2020 మలబార్ సైనిక విన్యాసాలలో ఆస్ట్రేలియా కూడా పాల్గొనడంతో నాలుగు దేశాల ‘క్వాడ్’ తిరిగి సమగ్రత సంతరించుకున్నది. అయితే ‘క్వాడ్’కు గల లక్షాలు ఉమ్మడివా లేక పెరుగుతున్న చైనా ప్రాబల్యం ముందు తన ప్రాధాన్యం తగ్గిపోకుండా చూసుకోడానికి అమెరికా పన్నుతున్న వ్యూహాలకు మిగతా మూడు దేశాలు అండగా ఉండడమే లక్షంగా అది పని చేస్తుందా అనేది స్పష్టం కావలసి ఉన్నది. వాస్తవానికి ‘క్వాడ్’ లోని నాలుగు దేశాల్లో పశ్చిమ పసిఫిక్ సముద్ర ప్రాంతంలో లేనిది ఒక్క ఇండియానే. అదే సమయంలో చైనాతో 3500 కి.మీ. నిర్ధారణ కాని సుదీర్ఘ భూ సరిహద్దు ఉన్న దేశం కూడా ఒక్క ఇండియానే. అటువంటప్పుడు చైనా శత్రుకూటమిగా ‘క్వాడ్’ను పరాకాష్ఠకు తీసుకెళ్లడం భారత్‌కు మేలు చేస్తుందా అనే ప్రశ్న మనకు అత్యంత కీలకమైనది. 77 బిలియన్ల డాలర్ల కిమ్మత్తు వాణిజ్యంతో 2020లో చైనా మన ప్రధాన వ్యాపార భాగస్వామి అయ్యింది. పొరుగున ఉన్న సాటి అతి పెద్ద దేశమైన చైనాతో మనకు అనేక అనుబంధాలు ఉన్నాయి.

వీటన్నింటినీ పక్కన పెట్టి దానితో శాశ్వత శత్రుత్వాన్ని కోరుకోడం మనకు శ్రేయస్కరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. చైనా సామ్రాజ్య విస్తరణ కాంక్షతో దహించుకుపోతున్న మాట వాస్తవం. వాణిజ్యంలో అమెరికాను తనకు విపరీతంగా అప్పు పడిన దేశంగా చేసుకున్న చైనా సాంకేతిక, సైనిక రంగాల్లో కూడా దానిని సవాలు చేస్తున్నది. అది చేపట్టిన అంతర్జాతీయ భూ, సాగర రహదారి (బెల్ట్, రోడ్డు) ప్రాజెక్టు పట్ల మనకున్న అసంతృప్తి కారణం లేనిది కాదు. పాకిస్థాన్‌ను వెంట పెట్టుకొని చైనా ఈ ప్రాజెక్టును మనకు వ్యతిరేకంగా చేపట్టిందనే భావనతోనే అందులో మనం చేరలేదనే అభిప్రాయముంది. ఇటువంటి ప్రాంతీయ కారణాలతో అంతర్జాతీయంగా చైనాకు శత్రు శిబిరంలో చురుకైన పాత్ర పోషించడం అవసరమా? 2018 జూన్‌లో జరిగిన షాంగ్రిలా సంభాషణ వేదిక మీది నుంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘క్వాడ్’ ఏ దేశానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అయితే అదే ‘క్వాడ్’లో ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ చురుకైన పాత్ర పోషిస్తున్నదనే అక్కసుతోనే చైనా తన సేనలను గత ఏడాది జూన్ నాటి దుందుడుకు దాడులకు పురికొల్పిందనే అభిప్రాయం నెలకొని ఉంది.

లడఖ్ సరిహద్దుల్లోని గల్వాన్ లోయలో సంభవించిన ఘర్షణలలో మన సైనికులు 20 మంది అమరులు కావడం ఆ తర్వాత రెండు దేశాల సైన్యాల మధ్య అనేక సార్లు చర్చలు జరిగి సేనల ఉపసంహరణ ప్రారంభం కావడం తెలిసిందే. భారత చైనా సంబంధాలు నెమ్మదిగా పూరపు స్థితికి కోలుకుంటున్న దశలో జరుగుతున్న ‘క్వాడ్’ శిఖరాగ్ర సమావేశాలు ఎటువంటి సందేశాన్నిస్తాయో వేచి చూడాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News